పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల?
మళ్లీ అదే ఒరవడి - అదే ఉరవడి @3194*
ఆదివారం(4.8.24) వేకువ అదే సమయం 4.18-6.10, స్థలం 216 వ జాతీయ రహదారి మీద కాసానగర్ సెంటరు, మనుషులు 38 మంది, పనైతే 50 x100 గజాలలో అంటే ఎకరంపైగా, అందులో 60 అడుగుల రాదారీ, వెడల్పాటి మార్జిన్లూ, ప్రక్కన లోతైన డ్రైసులూ!
ఇక అక్కడ ప్రజా ప్రయోజనార్థం ఇందరు విద్యా వినయ - సంపన్న సామాజిక కార్యకర్తలు 2 గంటల పాటు చేసే పని గురించి వేరే చెప్పాలా? నెలకొన్న సందడిని ప్రత్యేకంగా వర్ణించాలా? అక్కడి చెక్ పోస్టు ఉద్యోగులూ, కాసానగర నివాసి ఐన ఒక ప్రభుత్వోపాధ్యాయుడూ "ఏమిటీ వింత! ఈ వృద్దులేంటి – గ్రృహిణులేంటి – వ్యాపారులూ రైతులేంటి- డాక్టర్లేంటి- ఊరికింత దూరంగా వేకువ 4.18 కే వచ్చి- ఈ వీధి పారిశుద్ధ్యమేంటి.... " అని ఆశ్చర్యపోవాలా?
నిజానికిదేమీ ఆశ్చర్యానందాల్లో మునగదగినంత లోకోత్తర – అత్యుత్తమ శ్రమదానమేమీకాదే! కొన్ని యూరోపియన్, కామన్ వెల్త్ దేశాల్లో నిత్యమూ జరిగేదే! కాకపోతే మనం మరిచిపోయిన మన పెద్దలతరం నాటి- స్వాతంత్ర్య కాలం నాటి సామాజిక స్పృహ ఈ చల్లపల్లిలో హఠాత్తుగా కనిపించడం వల్ల కలిగే సంభ్రమం!
స్విట్జర్లాండులో చదువుతున్న ఒక విద్యార్థి అక్కడి “ స్విస్ టైమ్ బ్యాంకు” గురించి పెట్టిన వాట్సప్ నివేదిక చదివాను- అక్కడి ప్రజలు తమకు దొరికే ఖాళీ సమయాన్ని తమ చుట్టూ ఉన్న- అవసరంలో ఉన్న వ్యక్తుల సేవలో గడుపుతారట! మళ్లీ తమకవసరమైనప్పుడు ఇతరుల నుండి ఆ 'సమయాన్ని' సదరు బ్యాంక్ నుండి తీసుకొంటారట!
ఆ టైమ్ బ్యాంకు సంగతి ఇప్పుడప్పుడే మన దేశానికి పనికి రాదు గాని - ఈ స్వచ్చ సుందర కార్యకర్తలకు ప్రయోగాత్మకంగా ఏమన్నా పనికొస్తుందేమో మరి!
నేటి గ్రామ సామాజిక సేవకులు 38 మంది, వచ్చే పోయే వీక్షకులు వందల మంది, 6.10 తర్వాత గాని ఆరేడుగురు పనులు ముగించి, కాఫీల వద్దకు చేరలేదు, అప్పుడు ఈ దైనందిన గ్రామ కర్తవ్య సంబంధిత నినాదాలను పలికినదీ, ఈ పంచాయతీకి స్వాతంత్ర్య దినోత్సవానికి ఢిల్లీ రమ్మనే ఆహ్వానాన్ని గురించి వెల్లడంచినదీ- సర్పంచి కాకముందే గ్రామ సేవికగా మారిన పైడిపాముల కృష్ణ కుమారి! హర్షాతిరేకం స్వచ్చ సుందర కార్యకర్తలందరిదీ!
ఇక తనది కాని ఊరికి ఏడెనిమిదేళ్ల నుండీ సేవలందిస్తున్న - ఈ నెల తన చందా 5000/- ను మేనేజింగ్ ట్రస్టీ గారికందించిన ప్రాతూరి శంకర శాస్త్రి గారిది నిత్యానంద లహరి!
రేపటి మన పని స్థలం కూడ ఈ 216 వ జాతీయ రహదారిలోని కాసానగర్ సమీపాననే!
ఎవరొ నేర్పిన విద్య కాదట
ఇంతమందొక సమూహముగా ఇంత ఊరును బాగుచేయుట
ఎన్ని చిక్కు సమస్యలనో ఎచటి కచట పరిష్కరించుట
ఎవరొ నేర్పిన విద్య కాదట - ఎవరి శిష్యరికమో కాదట
స్వయం నిర్ణయ - స్వయం కృషితో సాధికారక వీధి సేవట!
- ఒక తలపండిన కార్యకర్త
04.08.2024