పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల?
NH 216 లోనే 3195* వ శ్రమదానం కూడ.
సోమవారం వేకువ కూడ గంటా ఏబై నిముషాల - 24 మంది శ్రమ సమర్పిత మయింది కాసానగర్ – న్యూట్రీఫీడ్స్ ఫ్యాక్టరీల మధ్యస్త రహదారి మీదనే! అందులోనూ ప్రధానంగా రోడ్డుకు దక్షిణ భాగాననే!
అది కూడ ఇతర చిన్న పనులు కాక - ముఖ్యంగా రెండు రకాల పూలమొక్కలు నాటిన పనే! నేడక్కడ కొలువు తీరిన పూల చెట్లు 30+7. మొదటిది గద్ద గోరు కులమూ, రెండో సంఖ్య పారిజాత పూల జాతీ! నిరుడు ఈ బాటలో 2.2+2.2 కిలోమీటర్లమేర నాటిన 2900 కు పైగా పూలచెట్లలో నష్టపడిన వాటినిప్పుడిలా భర్తీ చేస్తున్నారు.
ఏదో ప్రాద్దున లేచి, పెరట్లోనో - ఇంటెదురుగానో నాటిన మొక్కలా? మ్రొక్కుబడిగా - ఎడాపెడా నేలలో గ్రుచ్చేసిన మొక్కలా? యదాలాపంగా - అనాలోచితంగా- ప్రచారార్థంగా చేసే పనులా? లేదే చల్లపల్లి స్వచ్ఛ సుందర కార్యకర్తల ఏ పనైనా ప్రణాళికాబద్ధంగా, గరిష్ఠ ప్రయోజనార్థంగా, అంకిత భావంగా నిర్వహించేదే!
లేకుంటే - ఉద్యోగ విధుల నిమిత్తం పొరుగూళ్లకు వెళ్లవలసిన - ఇంటి పనులు నెరవేర్చవలసిన కార్యార్థులూ - గృహిణీమతల్లులు 3-4-5 కిలోమీటర్లు దాటుకొని, ఊరికి దూరంగా రహదారి సుందరీకరణ పనులు చేయగలరా?
మొక్కలు నాటి పెంచడంలో - ఊరినీ, చుట్టు ప్రక్యల ప్రదేశాల్నీ స్వచ్ఛ - సుందర - హరిత మయం చేయడంలో సిద్ధహస్తులైన ఈనాటి 2 డజన్ల మందీ:
- బాట ప్రక్కల మార్జిన్ల గడ్డి చెక్కడంలోనూ,
- పాదులు త్రవ్వడంలోనూ,
- మార్కింగ్ ప్రకారం 5:1 నిష్పత్తిలో 2 రకాల మొక్కలు నాటడంలోనూ,
- ఇంకా అక్కడి ప్లాస్టిక్ తుక్కులేరడంలోనూ,
- చీపుళ్లతో శుభ్రపరచడంలోనూ, పరిణతి కనబరిచారు!
మొత్తం గత 10 రోజుల్లో నాటిన మొక్కలే (2 రోడ్ల వెంట) 800 ఉండొచ్చు.
నేటి స్వచ్ఛ సుందరోద్యమ నినాద కర్తా, సూక్తి ప్రదాతా అడపా గురవయ్యే!
రేపటి శ్రమదాన కార్యక్రమం కూడ ఇదే NH 216 లోని పెదకెళ్లేపల్లి రోడ్డు ప్రాంతమే!
చుండూరి మెహర్ వేంకట రామకృష్ణ సత్య వరప్రసాద్ – సుధారాణి దంపతుల వారికి కుమారుడు మెహర్ శ్రీ విహార్ తరపున స్వచ్చోద్యమం కోసం 5000/- విరాళం ఇచ్చారు.
అంతిమంగా శ్రమదే విజయం
సదవ గాహన ప్రయత్నాలకు - అనాలోచిత నిర్ణయాలకు
అపరిశుభ్రత – శుభ్రతలకూ - త్యాగములకూ స్వార్ధములకూ
అన్ని కాలములందు ఘర్షణ - అంతిమంగా శ్రమదే విజయం
స్వచ్ఛ సుందర స్వప్నములకూ జయం తప్పదు అనుట తద్యం!
- ఒక తలపండిన కార్యకర్త
05.08.2024