3218* వ రోజు ... ....           29-Aug-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

చల్లపల్లి శ్రమదానంలో అక్షరః 3218* వ పూట!

         గురువారం(29.08.2024) నాడు సైతం వేకువ 4.20 కే నిన్నటి నిర్ణయానుసారం 216 వ జాతీయ రహదారిలోని సిమెంటు కొట్టువారి కల్యాణ మండపం ఎదురుగానే శ్రమదానం మొదలయి, 6.06 వరకూ ప్రవర్థిల్లినది!

         అలుపెరుగని శ్రామికులు 22 మంది. రహదారికి ఉత్తరపుటంచున పని స్థలం నిడివి 150 గజాల మేర! పని స్వభావం - 98 పూల - పండ్ల మొక్కలు నాటేందుకు గాను ఎగుడు దిగుడు నేలను సిద్ధపరచుట!

           గుబురులుగా పెరిగిన దర్భ కాబోలు అక్కడక్కడా ఉన్నది; పనికిమాలిన మొక్కలూ, గడ్డీ సరే సరి! ఎనిమిదేసి అడుగల కొలత ప్రకారం ముందుగానే అక్కడో కర్ర పుల్లలు పాతి ఉంచారు.

         ఐతే - ఈ కొద్ది మంది కార్యకర్తలు పని కనువుగాని చోట - చీకటి పూట అంత దూరమెలా శుభ్రపరిచగలిగారు? గతంలో నాటి, పెంచి, మూరెడెత్తులోనే - పిట్ట కొంచెం సామెతలాగా - పుష్పించిన కొన్ని మొక్కల కంపనెలా సరిజేశారు?

         జరిగింది 35 పని గంటల కృషి; జరిపింది చిన్నా-పెద్దా, ఆడా-మగా ఉత్సాహవంతులైన-ఊరి ప్రయోజనం తప్ప-సొంతానికేమీ ఆశించని స్వచ్ఛ-సుందర కార్యకర్తలు! పని నాణ్యత గురించి వేరే చెప్పాలా?

         చానాళ్ల క్రిందటే బహూకరింపబడి, 3 రోజుల్నాడే - బైటకు తీసిన గడ్డి కోత యంత్రం ఈ పూట కూడ బాగా పని కొచ్చింది! మైకు పాటల్తో బాటు ఈ మిషను తమాషా చప్పుళ్లు కూడ సందడి చేశాయి!

         ఇద్దరో-ముగ్గురో నేటి పని స్థలమంతా చీపుళ్లతో ఊడ్చి-సిమెంటు రోడ్డును ప్లాస్టిక్ రహితం చేశారు!

         ఎప్పట్లాగే 6.20 తర్వాత-కల్యాణమండప ద్వారం వద్ద అర్థవలయంగా నిలిచి, పోస్టల్ మెండు శ్రీను గట్టిగా ముమ్మారు నినదించిన గ్రామ స్వచ్చ సౌందర్య సాధక సంకల్పానికి బదులిచ్చి,

         98 పూల-పండ్ల మొక్కలకు గుంటలు త్రవ్వే పనికి రేపటి వేకువ గంగులవారిపాలెం వీధి దగ్గర కలవాలని నిర్ణయించారు!

         కాలోచిత స్వప్నం ఇది

గ్రామ స్వస్తతను గురించి కాలోచిత స్వప్నం ఇది

సామాజిక కోణంలో సమయోచిత ఉద్యమమిది

ఒక దశాబ్ది కాలంగా వీరోచిత శ్రమచరితం

ఒక్క ఊరుదాహరణగ ఉవ్వెత్తున శ్రమ కెరటం!

- ఒక తలపండిన కార్యకర్త

   29.08.2024