పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?
శ్రావణ శుక్రవారం వేకువ శ్రమదానం - @3219*
అంటే ఇది 30-8-24 న తెల్లారక ముందటి సంగతి! వాన కురిసి వెలిసినా, చినుకు తుంపరల నడుమనే - ఊరికి దూరంగా – 216 వ జాతీయ రహదారి ఉత్తరం ప్రక్కన-హరిత-పుష్ప-సుందరీకరణ ప్రయత్నమన్న మాట! ఇదే రాదారి మీద గత 2 నెలలుగా జరుగుతున్న శ్రమయజ్ఞమే ఇది!
ఇప్పటికే 3 వేల పూల-పండ్ల-నీడ మొక్కల్ని నాటి, వాటిలో నష్టపడిన ఐదారేడొందల్ని పునః ప్రతిష్టించిన శ్రమదానానికి ఈ పూట మరికొంత పొడిగింపు!
మళ్లీ క్రొత్త సందర్భమేమంటే - 01-09-24 - ఆదివారం నాటి ప్రభుత్వ వన మహోత్సవంలో స్వచ్ఛ కార్యకర్తల - పంచాయతీల - ప్రజల భాగస్వామ్యమన్నమాట! దానికి సన్నాహకంగా 98 మొక్కలకు కొలతలు తీసి, కర్రలు పాతి, పాదులు త్రవ్వే శ్రమే గతనాల్గు రోజులుగా!
ఐతే-నేటి వేకువ శ్రమదాతల సంఖ్యేమో తక్కువ, అది కూడ 2 చోట్ల 2 పనుల వల్ల-ఈ చినుకుల్లో పనేం సాగుతుందిలే అనుకున్నాం గాని – తీరా 6.00 కు చూస్తే ఫలితమందుకు భిన్నం!
నలుగురు కార్యకర్తలు బండ్రేవుకోడు కాల్వ ఉత్తరాన వాహనదారుల్ని ఇబ్బంది పెట్టుతున్న రోడ్డు పైకి పెరిగి, వంగిన, గద్ద గోరు మొక్కల్ని సరిజేసేందుకు వెళ్లగా - ఇక్కడ మిగిలిన నలుగురు+ఒక్కరితోనే 22 పాదులు త్రవ్వారు. (అక్కడ జర్రున కాలు జారి ఒక BSNL మహాశయుడు బురదలో పడి లేవడం- వేఱే కథ!)
మళ్లీ వీరిలో ఒక మహిళా కార్యకర్త శ్రావణ శుక్రవార పూజా కార్యక్రమం కోసం కాస్తముందుగానే వెళ్లగా మిగిలిన వారు రహదారి దక్షిణంగా నిలబడి, పుట్టినరోజు స్వచ్చంద శ్రమదాతల మధ్య జరుపుకోవచ్చిన కళాశాల మాజీ ప్రిన్సిపల్ తగిరిశ సాంబశివరావు గారి ననుసరించి, నినాదాలు చేశారు.
ఈ నినాదకర్తే స్వచ్చోద్యమ ఖర్చుల నిమిత్తం ఇచ్చిన 500/- విరాళాన్ని మేనేజింగ్ ట్రస్టీ గారు స్వీకరించారు!
రేపటి వేకువ కూడా NH216 మీదనే – క్రొత్త మినీ ఫామ్ హౌస్ దగ్గరే కలుసుకొందాం!
తక్షణమే అనుష్ఠింపదగు మార్గం!
న్యూజిలాండు-పోలండ్లో సహజ సంప్రదాయం
ఊరి చరిత్ర మలుపు త్రిప్పుతున్న మహత్తరదానం
చల్లపల్లి సామాజిక - సామూహిక శ్రమదానం
అన్ని ఊళ్లు తక్షణమే అనుష్ఠింపదగు మార్గం!
- ఒక తలపండిన కార్యకర్త
30.08.2024