పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?
ఒక అనూహ్య శ్రమదానం ఈ ఆదివారం నాటిది! - @3220*
తేదీ సెప్టెంబరు మాసారంభానిది; సమయం మధ్యాహ్నం 03.30 – 5.30 నడిమిది; శ్రమ 44 మందిది; స్ధలం పెదప్రోలు పంచాయతి పరిధిలోని కాసానగర్ – కప్తానుపాలెంలో ½ కిలోమీటరుకు చెందినది; కార్యకర్తల సంతోషం 170 కి పైగా పూల మొక్కల్తో 216 వ జాతీయ రహదారి నలకరించినది!
చరిత్రలో కొన్ని వింత ఘట్టాలుంటాయి - స్వచ్ఛ సుందర చల్లపల్లి శ్రమదానోద్యమంలాంటివి – 3220* రోజుల సుదీర్ఘ శ్రమదాన చరిత్రలో కూడ కొన్ని చమక్కులుంటాయి – ఈ మధ్యాహ్నం జరిగిన 50 కి పైగా పని గంటల వేడుకలాంటివి!
ఈ మిట్ట మధ్యాహ్నం ముగ్గుర్నలుగురు ముఖ్య కార్యకర్తలు చకచకా నిర్ణయించుకొన్నారు – ‘ఈ ఉదయం నాటడం కుదర్లేదు గనుక - 216 వ రహదారి వెంట ఇప్పుడు పూల మొక్కలు నాటాలని! చప్పున నలుగురైదుగురికి ఫోన్లు వెళ్లాయి - కాసానగర్ దగ్గరకు వచ్చి కలుసుకొమ్మని!
ఆ ఫోను సందేశాలు గొలుసు కట్టులాగా తక్కిన కార్యకర్తలకూ అంది, ముప్పావు గంటలోనే పాతిక ముప్పై మంది చేరుకోవడమూ, అందిన కాడికి తలా ఒకపారో – గునపమో – నక్కో పుచ్చుకొని పాదులు త్రవ్వే వాళ్లు త్రవ్వి, మొక్కలు నాటే వాళ్లు నాటి, కొందరు సందర్శకులూ, కప్తానుపాలెం నుండి ఔత్సాహికులూ పాల్గొని, 170 నుండి 175 గద్ద గోరు పూల మొక్కలు పదేసి అడుగుల దూరంలో పెట్టడం పూర్తయింది!
ఇదీ అసలైన నిస్వార్ధ శ్రమదానమంటే! ఇదీ చల్లపల్లి స్వచ్చ కార్యకర్తల చైతన్యమంటే! ఒక సామాజిక బాధ్యతకు మనసా - వాచా – కర్మణా అంకితమైపోవడమంటే ఇదే మరి! ప్రతి దాంట్లో “నాకేంటి?" అనుకొంటే ఈ వనమహోత్సవం ఇంత సార్థకంగా జరుగుతుందా? ఇందరి ముఖాల్లో – కష్టించిన అలసటకంటే - తమ ఊరి ప్రక్క రహదారిని హరిత సుందరీకరించిన సంతృప్తి కనిపిస్తుందా?
వీళ్లంతా బృంద గమనం చేస్తూ కాసానగర కూడలి వద్ద ఆగి, మాలెంపాటి అంజయ్య గర్జించిన త్రివిధ నినాదాలకు బదులిచ్చారు;
తనది కాని చల్లపల్లికి తన తొమ్మిదేళ్ల సేవానిరతికి గుర్తుగా ఉదయ శంకర శాస్త్రి గారు 5,500/- విరాళాన్నీ, కార్యకర్తలకు మిఠాయిల్నీ పంచారు.
చీమకుర్తి జవహర్ డాక్టర్ గారి 10 వేల విరాళమూ, దేసు జాహ్నవి పుట్టిన రోజు నాటి 1,000/- చందా ముట్టినవి!
రేపటి వేకువ మనం కలిసేది గంగులవారిపాలెం రోడ్డులోని భవఘ్ని నగర్ దాటిన తర్వాత వచ్చే మూల వద్ద!
జీవుల మనుగడ మిగలదు
వికృత హేయ చర్యలతో వికటించిన ప్రకృతి
ఇప్పటికే చేరుకొంది హీనమైన దుస్థితి
ఊరూరా స్వచ్యోద్యమ మువ్వెత్తున్న లేవకున్న
జీవుల మనుగడ మిగలదు – చిత్తగించుడా స్థితి!
- ఒక తలపండిన కార్యకర్త
01.09.2024