పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?
భవఘ్ని నగర్ కు మారిన 3221* వ శ్రమదానం!
సోమవారం(2.9.24) వేకువ పని స్థలం మార్పుకు కారణం 216 వ రహదారి ప్రక్కల ఎక్కువగా నిలిచిన వాన నీళ్లు! తొలి కార్యకర్తల ఉనికి అక్కడి వీధి మలుపులో 4.13 కే ఉన్నదంటే - కార్యకర్తలు ఏ 3.30 కే మేల్కొని 4.10 కే పని చోటులో ఉన్నారని అర్థం! నేటి వీధి పారిశుద్ధ్య సుందరీకరణ కృషి 6.05 కు ముగిసేదాక భవఘ్ని నగరంతా సందడే సందడి!
ఏ క్రొత్త పరిశీలకులు చూసినా “ఈ వీధికేం - అరె! ఈ రోడ్డంతా అమర్చిన చెట్ల, పూల బొమ్మల కొలువులాగా ఉన్నదే – ఈ ఊర్ధ్వ జల ఫౌంటైన్లూ, సెల్ఫీ పాయింట్లూ, చిక్కని పచ్చదనాలూ, శుభోదయాన్ని స్వాగతిస్తున్న సుమధుర సుస్వర సంగీతాలూ... ఇదొక క్రొత్త ప్రపంచం అనిపిస్తున్నదే...అనుకొంటారు” అనిపిస్తుంది!
కాని – ఈ వీధినిలా రూపొందించి, నిర్వహిస్తున్న స్వచ్ఛ కార్యకర్తలకు మాత్రమే తట్టుతుంది –“ఇంత చక్కని వీధిలో ఫలానా చోట ఈ చిన్న లోపముందే - ఈ నాల్గు చెట్ల కొమ్మలు మర్యాద తప్పి పెరిగిపోయాయే - రోడ్డు మీద పడిన ఈ చిన్న గుంట పెద్దదైతే రాకపోకలకు ఇబ్బందే అని....”
అలా తట్టడం కార్యకర్తల ప్రారబ్దం! అదే చల్లపల్లి అదృష్టం! లేకపోతే - ఈ చినుకుల్లో, చలిగాలిలో, బ్రహ్మకాలంలో ఈ సో కాల్డ్ వృద్ధులూ, గృహిణీమతల్లులూ, వృత్తి నిపుణులూ, ఉద్యోగులూ తరలి వచ్చి, గౌరవనీయులెవ్వరూ ఇష్టపడని పారిశుద్ధ్య పనులకు దిగడమేమి? ఈ ఊరి ప్రత్యేకత దశదిశలా ప్రాకడమేమి?
నేను ప్రతి ఉదయమూ ఏదోక వీధిలో జరిగే మురుగు పనులో - మొక్కలు నాటే పనులో రోడ్ల మరమ్మత్తులో వివరిస్తున్నానంటే – ఆ వివరణలేమీ గాలి మూటలు కావు – “జై స్పచ్ఛ చల్లపల్లి సైన్యం” వాట్సప్ ఫొటోల సాక్షిగా నిజాలు!
ఈ పూటైనా -
- డెయిరీ ముందర డజను మంది వీధి పడమర ప్రక్క కోసేసిన గడ్డీ
- ప్రక్కకు ఒరిగిపోతే నిలబెట్టిన చెట్లూ,
- త్రవ్వి, చదును చేసిన మురుగుమట్టి దిబ్బలూ,
- కత్తిరించి, సుందరీకరించిన గద్ద గోరు పూల మొక్కల ముళ్ల కొమ్మలూ,
- ఊడ్చి, శుభ్రపరచిన 100 గజాల వీధీ
- ‘ఇన్ని మంచి పనులు నా ఊరి కోసం గంటన్నరసేపు చేశా'మనే కార్యకర్తల సంతృప్తీ... అన్నీ ససాక్ష్యంగా వాట్సప్ లో చూడవచ్చు!
- ప్రతి రోజూ స్వచ్ఛ చల్లపల్లికి ఏదొకటి ఇస్తే తప్ప సంతృప్తి లేని శాస్త్రి మహాశయులు మొక్కల ఖర్చుల నిమిత్తం మళ్లీ ఈ పూట 5,000/- చెక్కు (నిన్నటి తాలూకు) ఈ పూట సమర్పించారు.
6.20 సమాయాన :
- వినదగ్గ 2 సూక్తులు ప్రవచించిన గురవయ్య గురువూ,
- స్వచ్ఛ – సుందరోద్యమ నినాదాలు ప్రకటించిన భోగాది వాసుదేవుడూ,
- మన రేపటి కర్మక్షేత్రం కూడ ఇదే భవఘ్ని నగర్ అని నిర్దేశించిన Dr. DRK...
స్వార్ధమెరుగని శ్రమ విలాసం
శ్రమల దోపిడి జరుగు కాలం - మాట తప్పే - మడమ త్రిప్పే మాయకాలం - మర్మకాలం
దాని కెదురుగ ఋజుప్రవర్తన - ధర్మచింతన ప్రొది చేసే దయాశాలురు ఉన్న కాలం
ఇరువదొకటవ శతాబ్దంలో - చల్లపల్లి - స్వార్ధమెరుగని శ్రమ విలాసం
తొమ్మిదేళ్లుగ ఊరి కోసం తొట్రు చెందని మనోభీష్టం - కార్యకర్తల మహోల్లాసం!
- ఒక తలపండిన కార్యకర్త
02.09.2024