3222* వ రోజు ... ....           03-Sep-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

భవఘ్ని నగర్ వీధి సేవల పొడిగింపు - @3222*

         సోమ, మంగళ(3.9.24) వారాల్లో కార్యకర్తల కర్మక్షేత్రమొక్కటే - భవఘ్ని (= మరో జన్మ లేకుండా చేసే అంటే మోక్ష మిచ్చే) నగర్ - దాటిన వీధి మలుపు దగ్గరే! ఈ రెండు రోజుల్లోనూ శ్రమ సమర్పకుల సంఖ్యా ఒక్కటే - 27 మంది! మరొక 111 రోజుల్లో నేటి 3222 సంఖ్య కాస్తా ఒక మాంత్రిక సంఖ్య 3333* గా మారుతుంది!

         ఐతే-బుడమేరూ, మానేరూ ఉపనదుల ఉప ద్రవ వరదల్లా కాదు-నీరవ ప్రశాంత గోదావరి కదలికలా చల్లపల్లి స్వచ్చంద శ్రమ స్రవంతి కనీసం మరో దశాబ్దకాలం ప్రవహిస్తూనే ఉంటుంది!

         మరి-నేటి 27 మంది శ్రామికులు వేకువ 4:12-6.06 సమయాల నడుమ ఈ గంగులవారిపాలెం వీధి భాగానికేం ఒరగబెట్టారు?’ అని ప్రశ్నిస్తే:

- సంఘజీవులుగా గ్రామం చివరి వార్డులో తమ కర్తవ్యం నెరవేర్చారు.

- పోసుకోలు కబుర్లాడు కోవడం కాదు సన్న చినుకుల మధ్య కనీసం ఒక్క వీధి భాగాన్ని బాగు చేసేందుకు శ్రమించారు.

- వీళ్లని పంచాయతీ పురమాయించలేదు, అధికారులు బ్రతిమాల్లేదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యర్థించనూలేదు, కేవలం స్వయం ప్రేరణతో తమకు తోచిన మంచిని తమ ఊరికి చేశారు.

- అందుకోసం మట్టి త్రవ్వారు, బురద పిసికారు, రోడ్డు మార్లిన్ బలహీనపడిన చోట కోసుకుపోకుండా పెగ్గులు పాతి కొమ్మలడ్డువేసి, మట్టి కప్పి చదును చేశారు.

- ఇది వైయక్తిక లబ్దికి కాదు, ఒంటరిగా ఎవరికి వాళ్ల ప్రయత్నించేది కాదు, ఒకే విధమైన సానుకూల దృక్పధమున్న కొందరి సమష్టి ప్రయత్నం.

- చిన్న మొక్కల్ని కాపాడి, అక్కర్లేదనుకొన్న మహా వృక్ష ఖండనం చేశారు.

- అయ్యో! ఇన్ని వేలరోజులైనా తక్కిన గ్రామస్తులు వచ్చి మాకు సహకరించరేఅని విచారించక ఒక నిష్కామకర్మ నిర్వహిస్తున్నారు.

         ఇందరి పని ఫలితంగా మెరుగుపడ్డ వీధి మరొక 100 గజాలు.

         తమ ఆనవాయితీ ప్రకారం ఈపూట స్వచ్చ సుందరోద్యమ నినాదాలు ఉచ్ఛరించినది మెండు శ్రీను.

         బండ్రేవు కోడు కాల్వ ఉత్తరపు వీధి పనులు రేపటివిఅని సూచించినది దాసరి రామకృష్ణ ప్రసాదు.

         నెలవారీ చందా దాత బత్తిని శ్రీనివాసులు ఉమాదేవి గార్లు ఈ నెల కూడా వారి 5,000/- విరాళాన్ని ట్రస్ట్ అకౌంట్ కు బదిలీ చేసినందుకు ధన్యవాదాలు.

         పద్మావతి ఆసుపత్రిలో నర్సు నలుకుర్తి కృష్ణకుమారి వారి భర్త స్టీఫెన్ బాబు స్వచ్చ చల్లపల్లి అభివృద్ది కోసం డా.డి.ఆర్.కె.ప్రసాదు గారికి 5,000/- విరాళాన్ని సమర్పించడం అభినందనీయం.

         మార్గాంతర మేమున్నది

ప్రభుత్వాల నిధులు నాస్తి - బకాయీల బెడద జాస్తి!

ఎవరికి వారే మేల్కొని ఎంతొకంత శ్రమ చేయక -

స్వచ్చోద్యమ కారులతో చేయి కలిపి నడవక

మార్గాంతర మేమున్నది మన గ్రామం సంస్కరణకు?

- ఒక తలపండిన కార్యకర్త

   03.09.2024