3223* వ రోజు ... ....           04-Sep-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

పోటీపడిన వర్షం-అష్టాదశ కార్యకర్తల గ్రామ కర్తవ్యం - @3223*

         బుధవారం నాడు (4.9.2024) వేకువ 4.13 సమయంలోనే సదరు టగ్గాఫ్ వార్ మొదలయింది. పోనుపోనూ పై చేయి సాధన కోసం రసవత్తరంగా మారింది.

         మధ్యలో తన మిత్రుడైన వానకు గాలీ తోడయింది. ఐనా స్వచ్ఛ కార్యకర్తల పట్టు సడల్లేదు. ఏ స్త్రీ, వృద్ధ కార్యకర్తా తమ చేతిలోని గొర్రూ, చీపురూ, దంతె వంటి ఆయుధ సన్యాసం చేయలేదు - దగ్గర్లోని వ్యానులోకో, కార్లషెడ్డులోకో వెళ్ళలేదు!

         వానలో తడవడం, ఎండల్లో ఎండడం, చలినీ మంచునీ ఎదుర్కోవడం వాళ్ళకేమైనా క్రొత్తా? నడుం లోతు మురుగు కాల్వల్లో దిగి పనిచేసిన వాళ్లకీ తేలికపాటి వానా-గాలీ ఒక లెక్కా?

         అలా ఈ చిన్న గుంపెడు మంది గ్రామ సామాజిక కార్యకర్తల వీధి పారిశుద్ధ్య సుందరీకరణం ఒక వంక ప్రకృతితోనూ, మరో వంక తమ శత్రువైన గంగులవారిపాలెం వీధి కాలుష్యంతోనూ ద్విముఖ పోరాటంగా 6.05 వరకూ సాగింది!

         రోడ్డు భద్రత దృష్ట్యానూ, డ్రైను సాఫీ నడక దృష్ట్యానూ నలుగురి కృషి - అంటే నీటి కోత పడే అవకాశమున్న చోట్ల డ్రైన్ నీటి ప్రక్కన పెగ్గులు పాతి, కొమ్మ రెమ్మలమర్చి, దాన్ని మట్టితో కప్పే పని యధాప్రకారం సాగింది!

         బండ్రేవుకోడు పెద్ద కాల్వ ఉత్తరం గట్టున నాలుగైదు భారీ ఏడాకుల చెట్ల కోతలో మాత్రం ఒక అపశృతి జరిగింది. అది చూడటానికి ఒళ్లు గగుర్పొడిచేదే గాని - అదృష్టవశాత్తూ ఒక ఆల్ రౌండర్ కార్యకర్త లాఘవంగా ప్రమాదం నుండి బైట పడ్డాడు.

         ఇటు వర్షమూ అటు శ్రమదానమూ సమ ఉజ్జీలుగా తేలిన సన్నివేశాన్ని గంటన్నరకు పైగా చూశాం.

         పెను విపత్తును దాటిన సదరు ఆల్రౌండరు వాలంటీరే - 6.25 కు జోరు వానలోనే - స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలు ప్రకటించగా –

         రేపటి కార్యక్రమం కూడ గంగులవారిపాలెం వీధి మలుపులోనే అని Dr. DRK ప్రకటించారు!

         భవితకొక ఆశావహ ప్రయత్నం

గ్రామ మందే మూలనైనా కదులునీ శ్రమ జయపతాకం

దశాబ్దికి పైబడిన స్వచ్ఛోద్యమ విలాసం శిరోధార్యం

అది సహర్షం - అంచనాలకు అందనిది ఆ అభినివేశం

భవితకొక ఆశావహ ప్రయత్నం - భావి జీవనమున కవశ్యం!

- ఒక తలపండిన కార్యకర్త

   04.09.2024