3224* వ రోజు ... ....           05-Sep-2024

పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

ఆకస్మికంగా వర్షం - అర్ధాంతరంగా గ్రామ సేవలు - @3224*

         - ఇది గురువారం (5.9.24) నాటి శ్రమదాన సమాచారం. ఈ వానలు తాత్కాలికం - స్వచ్ఛ కార్యకర్తల వీధి సేవలు దశాబ్దాల పర్యంతం! 150 మందికి పైగా శ్రమదానోద్యమ ధీరులు అలనాడెప్పుడో కట్టుకొన్నారు కంకణం – తత్ఫలితంగానే, వేల-లక్షల ఊళ్లలో ఇప్పుడు చల్లపల్లికి దక్కింది అగ్రస్థానం!

         నేటి శ్రమదానం కూడ ముందు నిర్ణయించుకొన్న బండ్రేవుకోడు కాల్వ ఉత్తరపు గట్టు రోడ్డు వద్దనే పార్రంభం ! కొద్ది సమయానికే నేనున్నానంటూ పళ్ళికిలించింది వర్షం! ఐనా గంటకు పైగా జరిగింది వీధి పారిశుద్ధ్య ప్రయత్నం! ఐతే నేటి వేకువ శ్రమదానం డజను మందికే పరిమితం!

         ఇక - రోజుటికంటే అరగంట ముందుగానే ముగిసింది కార్యకర్తల శ్రమవిన్యాసం! పూల ముళ్ళ కొమ్మల కత్తిరింపూ, చెట్ల పాదుల కలుపు తొలగింపూ, ఏడాకుల పెద్ద వృక్ష ఖండనమూ వంటి పనులు మాత్రం యధాతధం!

         తమ పనుల పట్ల అసంపూర్ణ తృప్తితో 5.30 కే ముగించారు 3224* వ వాటి శ్రమదాన ఘట్టం!    

         రేపటి వేకువ కూడ గంగులవారిపాలెం వీధిలోని బండ్రేవుకోడు మురుగు కాల్వ గట్టే మన శ్రమదాన రంగస్థలం!

         ఇదేమంత బ్రహ్మ విద్య

ఇదేమంత బ్రహ్మ విద్య - ఈ ఊళ్లో నివసిస్తూ

ప్రతి దినమొక గంటన్నర గ్రామానికి సమర్పిస్తు

సామాజిక సామూహిక శ్రమదానం చేయడం

డజన్ల కొద్ది శ్రమదాతల దరిదాపున మెసలడం?

- ఒక తలపండిన కార్యకర్త

 

   05.09.2024