3243* వ రోజు ....           24-Sep-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

4.09 AM కే మొదలు కాబడిన వీధి పారిశుద్ధ్యం - @3243*

         ఇది గంగులవారిపాలెం వీధిలోని ప్రొద్దు తిరుగుడుపూబజారు వద్ద; రోజూ, సమయమూ – మంగళవారం (24-9-24) 2 గంటలపాటు; స్థలం – దాసరి వాళ్ల పాల ఉత్పత్తికేంద్రం దాక – 50 గజాలే! వీధి కర్తవ్య దీక్షితులు 24 మంది – వివిధ వార్డులు, గ్రామాల నుండి చేరుకొన్నవారు!

జరిగింది 3 రకాల పనులు –

1) కత్తులతో రోడ్డు వారలా అణిచిపెట్టి గడ్డి తెగ నరికిన 15 మంది. అందుగ్గానూ వాళ్లు కావాలంటే ఒంగొనీ, నేల మీద చతికిలబడీ, - (ఆ కూర్చొన్న దగ్గర ఏ ఎంగిళ్లు, గలీజులున్నాయో అది వేఱే సంగతి) మధ్యలో ఒకాయన ఛలోక్తులు విసురుతూనూ!

2) అక్కడి ప్రోగుబడ్డ మొక్కల, తీగల, ప్లాస్టిక్ గుట్టల మాటేమిటి? అందుకు చీపుళ్లతో – గొర్రులతో ఇద్దరు నర్సులు సంసిద్ధులు!

వాళ్ల చురుకుదనంతో సదరు వ్యర్ధాలన్నీ బాటకు తూర్పుగా కుదురుకొన్నాయి!

3) “ఎక్కడ లైఫ్ బాయ్ ఉండునో అక్కడ ఆరోగ్యం ఉండును” అనే ప్రాతకాలపు అడ్వర్ టైజ్ మెంటులాగా – “ఎక్కడ ఆకుల దుర్గా ప్రసాదుడుండునో అక్కడ వంకరటింకర చెట్ల కొమ్మలకు మూడును”. ఏ 20 చెట్లనో ఈ పూట అతగాడు అదుపులో పెట్టాడు!

         ఈ వేకువ పూట వాతావరణం పైకి చూడటానికి మర్యాదగానే ఉన్నా - మబ్బుపట్టినా – చినుకురాలలేదు, గాలి కదలలేదు. బట్టలు చెమటతో తడిసి ముద్దయిందానికి వీరిలో ఏ ఒక్కరూ అతీతులు కాదు! మరొక ప్రసాదుకైతే – చేతొడుగులనుండీ, కాళ్ల సాక్సుల్నుండీ చెమట బొట్లు ముత్యాల్లా రాలుతున్నాయి కూడ!

         ఇదీ - ఈనాటి అననుకూల పరిస్థితుల శ్రమదాన సమాచారం! శ్రమ వేడుకలో ఒక లోపమేమంటే - ఒకానొక డొక్కా అన్నపూర్ణా, మరొక ప్రాతూరి శాస్త్రీజీ, వేరొక అడపా ప్రవచనకారుడూ నిన్న - నేడూ గైరు హాజరు కావడం!

         తన కామ్ గోయింగ్ స్వభావ విరుద్ధంగా ఈ పూట స్వచ్చ - సుందరోద్యమ నినాదాలను అదరగొట్టిన వారు అంబటి శంకర్రావు గారైతే - కొంతవరకు గురవయ్య పాత్ర పోషించి, 2 ఉదంతాల ద్వారా ఒక మంచి లైఫ్ స్టయిల్ ను సూచించిన వారు దాసరి రామకృష్ణ ప్రసాదు గారు!

         మన రేపటి శ్రమ రంగస్థలం కూడ ఇదే గంగులవారిపాలెం వీధిలో - ఇదే ప్రొద్దుతిరుగుడు పూల బజారు వద్ద!

        ఎన్నెన్నో ఆటుపోట్లు

కొన్ని సానుకూలతలూ, ఎన్నెన్నో ఆటుపోట్లు

అప్పుడపుడు ప్రోత్సాహం, అంతలో నిరుత్సాహం

శ్రమదానం పట్ల చల్లపల్లి ప్రజల వైఖరి!

ఐనా కష్టించు వారి కర్పిస్తాం ప్రణామం!

- ఒక తలపండిన కార్యకర్త

   24.09.2024