3244* వ రోజు ....           26-Sep-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

తగ్గింది పని కాదు - కార్యకర్తల సంఖ్యే - @3244*

         గురువారం (26.9.24) వేకువ - 4.09 కే మొదలైన గంగులవారిపాలెం వీధి పారిశుద్ధ్య సమాచారమది! ఈ పూట శ్రమ ప్రత్యేకతేమంటే;

- దఫ దఫాలుగా, తెరలు చెరలుగా, సరైన హెచ్చరికలు లేకుండా వర్షం! భారీవర్షమా, కార్యకర్తలు నిట్ట నిలువునా తడిసిపోయరా అంటే అదేం లేదు గాని, మొండి మనుషులు తప్ప - ఎవరైనా చిరాకు పడేంతగా!

- మరొక విశేషమేమంటే - పైకి చల్లచల్లగా కనిపిస్తూనే - పని చేసే వాళ్లకు మాత్రం ఉక్కపోత తెచ్చే వాతావరణం!

- ఇక - గ్రామ వీధి బాధ్యతామూర్తుల నేటి సంఖ్య చివర్లో 16 గా తేలినా - నికర శ్రమ మాత్రం డజను మందిదే! సందిగ్ధ వాతావరణం కనీసం డజను మందిని ఇళ్ల దగ్గర ఉంచేసింది మరి!

         నేటి శ్రమదానం వాతావరణ వైపరీత్యం వల్ల రద్దవుతుందని ఇళ్ల దగ్గర ఆగిపోయిన కార్యకర్తలు పనిచోటుకు రానందుకు ఎంతగా విచారిస్తారో మరి!

         “సంక్షోభాల నుండే అవకాశాలు సృష్టించుకోవాలి” అనేది ఒకానొక సీనియర్ ముఖ్యమంత్రి ఉవాచ!

         అలాగే – సమస్యలోచ్చేకొద్దీ రాటుతేలిపోతున్నదే ఈ స్వచ్ఛ - సుందర చల్లపల్లి శ్రమదానోత్సవం!

         నేటి మన వాట్సప్ చిత్రాలను గమనించండి – పని చేతుల సంఖ్య తగ్గినా, గడ్డి చెక్కుతున్న - ముళ్ల పూల మొక్కల్ని సుందరీకరిస్తున్న – ఎంత కష్టమైనా తడి రోడ్లను ఊడ్చి బాగుచేస్తున్న – వ్యర్ధాలను గుంజుకుపోయి బాట ప్రక్కన గుట్టగా పేరుస్తున్న –

         మరీ ముఖ్యంగా ఇటు చినుకుల, అటు చెమటలతో బట్టలు తడిసి ముద్దైన - అలసిన ఎడం చేతివాటం కార్యకర్తను చూడండి - ఎందుకీ చల్లపల్లిలో మాత్రమే దశాబ్దానికిపైగా - లక్షోపలక్షల పనిగంటలుగా ఊరి వీధుల శ్రమదానం జరుగుతున్న రహస్యం తెలిసిపోతుంది!

         ప్రతి పనిదినం చివర్లో (నేటి సదరు నినాద బాధ్యత BSNL మాజీ ఉద్యోగి నరసింహునిది!) గట్టిగా ఎందుకు నినదిస్తారో - అంతగా శ్రమించిన తర్వాత కూడ ఎంతగా ఆనందిస్తారో అర్ధమౌతుంది!

         రేపటి వేకువ శ్రమదానం భవఘ్నినగర్ లోనిది, మనం కలుసుకొనేది మాత్రం పొద్దు తిరుగుడు పూల బజారు వద్ద!

         ఏల ఇంత ఉపేక్ష చేయుట?

ముఖం చూచుకొనేందు కద్దం రోజు రోజూ తుడుచుకోమా!

ఇల్లు వాకిలి చక్కగున్నా ఎందుకని ముగ్గులు లిఖింతుము!

మరి - వీధి ఊరూ మనవెకావా - ఏల ఇంత ఉపేక్ష చేయుట?

ఊరు మొత్తం ఎప్పుడింకా స్వచ్ఛ సంస్కృతి ప్రాకి పావుట?

- ఒక తలపండిన కార్యకర్త

   26.09.2024