3245* వ రోజు....           27-Sep-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

3245* రోజుల ప్రాయంలో స్వచ్చోద్యమ చల్లపల్లి!

         ఇది 27-9-24. ఆషాఢ శుక్రవారపు వేకువ 4.12 - 6.06 నిముషాలకు పరిమితం. గంగులవారిపాలెం వీధిలోనే –

1) భవఘ్నినగర్ పరిశుభ్రతకూ,

2) అక్కడికి ½ కిలోమీటరు దూరంలోని బండ్రేవుకోడు కాలువ అంచు భద్రతకూ పరివ్యాప్తం!

         ఒక వంక వర్షం కాచుక్కూర్చున్నా, ఉత్తర – తూర్పు ఆకాశాల్లో ఉరుములు....మెరుపులు హెచ్చరిస్తున్నా, లెక్కచేయని 22+2 మంది స్వచ్చ కార్యకర్తల శ్రమతో పైన చెప్పిన వీధి భాగాలు పునీతం!

         చల్లని వాతావరణంలోనూ, ఎడతెగని పని వల్ల చాల మంది వాలంటీర్ల చెమటధారలు విస్పష్ట ప్రత్యక్షం! ఇందులో ఎవరి కష్టాన్నని వర్ణించాలి?

- ఒక వంక దోమలు చెండుతున్నా, వీధి పడమటి మురుగు కంపు పీలుస్తూ, ఏటవాలు ప్రమాదకర స్థలంలో గడ్డి చెక్కుతున్న, గొర్రూ – చీపుళ్ళతో వ్యర్ధాలు లాగుతున్న - కోమలానగర్ మిత్ర ద్వయం గురించా?

- తూర్పు ప్రక్కన నిన్నటి, నేటి ముళ్ల పూల కొమ్మల్నీ, గడ్డినీ, ఇతర వ్యర్థ్యాల్నీ ట్రాక్టర్ లో నింపుతున్న ఏడెనిమిది మంది శ్రమత్యాగాన్నా?

- మహిళలైయ్యుండీ ఇళ్లు వదలి వేకువ నాల్గింటికే ఇంత దూరం వచ్చి, చీపుళ్లందుకొని, వీధిని శుభ్రం చేస్తున్న ముగ్గురి గ్రామ బాధ్యత గురించా?

- బాగా గాయపడి, సంవత్సరం తర్వాత పాక్షికంగా కోలుకున్న కాలికట్టుతోనే వచ్చి, పాటుబడుతున్న గృహస్తురాలినా?

- బండ్రేవుకోడు కాల్వ రోడ్డు ఎక్కడ దెబ్బతింటుందోనని కంటికి రెప్పలా కనిపెట్టుకొని, పక్షులు గూళ్లు కట్టుకొన్నట్లు – ఎక్కడెక్కడి వ్యర్ధాల్నీ, కొమ్మ రెమ్మల్ని పేర్చి, రాళ్ళూ రప్పల్తో కప్పుతున్న కార్యకర్తల కష్టాన్నా?

- నిన్నా - మొన్నా రాలేక, సదరు నష్టనివారణగా రోడ్డు కిరుప్రక్కలా పనిచేసుకుపోతున్న పొరుగూరి రైతూ, విశ్రాంత ఉద్యోగుల ప్రయత్నాన్నా!

         ఇందులో ఎవరి బాధ్యతాయుత శ్రమదానాన్నైనా పేజీ చొప్పున వ్రాయవచ్చు!

         అప్పటికప్పుడు కుంభవృష్టి సూచన వల్ల – తొందరగా కాఫీలు ముగించి, కబుర్లు తగ్గించి, UTF కార్యాలయం దగ్గర - జీవిత బీమా ఉన్నతోద్యోగ పదవీ విరమణ చేసిన జాస్తి ప్రసాదుని నిలకడైన నినాదాలతో నేటి శ్రమదాన సమాప్తి.

         రేపటి వేకువ మనం కలుసుకొనేది ఇదే గంగులవారిపాలెం వీధిలో, పనులేమో భవఘ్నినగర్ పరిసరాల్లో!

         స్వార్థం విషజ్వాలలోన?

ఆనందం ఎక్కడుంది స్వార్థం విషజ్వాలలోన?

తోటి వారి సంతోషం తొలగించే చర్యలోన?

పదేళ్లుగా ప్రజల కొరకు పాటుబడే దారిలోన?

ఊరంతటి స్వస్తతకై ఉద్యమించు తీరులోన?

- ఒక తలపండిన కార్యకర్త

   27.09.2024