3246* వ రోజు....           28-Sep-2024

పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

3246 * వ శ్రమదానంబెట్టిదనగా ....

         దాని సమయం వేకువ 4.18-6.15 నడిమిది ; అందుకు కర్తలు 3 గ్రామాల – ఏడెనిమిది వార్డుల- వివిధ నేపధ్యాల - వయస్సుల 9 + 24 మంది . (తొలి సంఖ్య మహిళామణులది!) 18 వ వార్డుకు చెందిన గంగులవారిపాలెం వీధి లోని భవఘ్ని నగరుకు  చివరిది; పాతిక వేల గ్రామస్తులకు ప్రయోజనకరమైనది కూడ!

మరి కొంత వివరించాలంటే- ఈ 50 కి పైగా పని గంటల కృషి 4 రకాలు

- బాగా బరువు పనుల వ్యసన పరులు 7-8-9 మంది కత్తులతో వీధికి 2 ప్రక్కల ఖాళీ స్థలాల పిచ్చి కంపను తొలగించడమూ

- చీకట్లో కాళ్లూ -  నడుములూ వంచి, 60 ఏళ్లు దాటిన వాళ్లు ఏడెనిమిది మంది ఎలా కూర్చంటారోగాని - బాటదరుల గడ్డిని కోయడమూ, చెక్కడమూ

- ఒకరిద్దరు అందంగా కనిపిస్తున్న గద్దగోరు, సువర్ణ గన్నేరు పూల చెట్లను మరింతగా సుందరీకరించడమూ,

- ఇంకొందరు- ప్రత్యేకించి స్త్రీ కార్య కర్తలు ఎప్పటికప్పుడు గడ్డినీ, కొమ్మ రెమ్మల వ్యర్థాల్నీ ఊడ్చే వాళ్లూ ఊడ్చి, లాగే వాళ్ళు లాగి, మూల మలుపు ఖాళీలోకి తరలించడమూ,

- భవఘ్నినగర వాసులూ, ట్రస్టు సంబంధీకులూ ఏనాటిదో ఎండు మురుగు మట్టి మేటల్ని త్రవ్వి, ట్రాక్టర్లో నింపుకొని దూరంగా ఉన్న మామిడి మొక్కల పాదుల్లో ఎరువుగా రక్షణగా సర్దడమూ,

- మరీ ముసలీ- ముతకా సీనియర్ మోస్ట్ కార్యకర్తలు కూడా ఉత్సాహం తెచ్చుకొని, మంచి నీళ్లనూ- అవసరమైన పనిముట్లనూ అందించడమూ...

         చాలమంది గ్రామస్తులు వేల రోజుల్నుండి చూసీ, వినీ ఈ శ్రమదానాన్నొక రొటీన్ ప్రాత చింతకాయ పచ్చడిగా అనుకొంటే అనుకోనీ –

         ఈ వేకువ సమయపు వీధి సుందరీకరణ/భద్రతా సేవలెంత విశిష్టమైనవని ఆశ్చర్యపడే విజ్ఞులూ ఉన్నారు!

         30 వేల మొక్కలు నాటి పెంచడమూ, ప్రతి మొక్క ఎదుగుదలనూ తమ బిడ్డల ఎదుగుదలలాగా ఆనందించడమూ సామాన్య విషయమనుకుందామా?

         డి.ఆర్.కె. వైద్యుల వారు సమీక్షించిన, దేసు మాధురి గారు నినాదాలు పల్కిన చివరి సభలో –

         మరొక 42 రోజుల్లో-  నవంబరు 9 న మన ఊరి దశాబ్దకాల శ్రమదానోత్సవం జరగబోతున్నదనీ,

         ఈ సుదీర్ఘ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తున్న వర ప్రసాద రెడ్డి, గురవారెడ్డి వంటి హేమాహేమీలు తరలివస్తారనీ   

తెలిసింది.

         రేపటి వేకువ కూడ మనం ఈ బండ్రేవు కోడు కాల్వ వీధికే అంకితమవుదాం!

     ఓరయ్యో గ్రామస్తుడ

అందరి ఆహ్లాదానికి ఈ 33 మంది

పదేళ్లుగా వీధుల్లో - ఊరి మురుగు కాల్వల్లో  

ఎలా పాటుబడినారో - ఎవరికై శ్రమించారో –

ఓరయ్యో గ్రామస్తుడ! ఒక్కమారు వచ్చిచూడు!

- ఒక తలపండిన కార్యకర్త

   28.09.2024