3247* వ రోజు....           29-Sep-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

             41 మంది తడాఖా చూపిన మరొక ఆదివారం!- @ 3247*

    29.9.24 వేకువ 4.12 - 6.06 అనేది చల్లపల్లిలో తప్ప ఎక్కడా పనివేళ కాకపోవచ్చు! ఈ గ్రామ  పారిశుద్ధ్య కృషిలో అదివారాల ప్రత్యేకతలు కొన్ని ఉన్నాయి!

         గ్రామస్తుల్లో స్వచ్చ- శుభ్ర – సౌందర్య పిపాసను పెంచడానికి ఆనంద ఆదివారాలు జరిగేవి. ఊరికి  ఉపయోగపడాలని ఉన్నా,  తక్కిన రోజులు రాలేని కొందరు కార్యకర్తలు ఆ రోజునే ఎంచుకొంటారు. చాలా వరకు సంవత్సరాంతపు శ్రమదానోత్సవ వేడుకలు కూడ అదే రోజున జరుగుతుంటాయి!

     ఈ ఆదివారం కూడ - అదే గంగులవారిపాలెం వీధిలో ½  కిలోమీటరు బారునా జరిగిన శ్రమలో వివిధ గ్రామాల వాళ్ళు పాల్గొన్నారు.

      వాతావరణం కూడ చాలవరకు బుద్ధిగా ప్రవర్తించింది. ఐనా సరే- మూడొంతుల మంది చెమటతో తడిశారంటే- అది వేరే సంగతి -  అది ఈ స్వచ్ఛ కార్య కర్తల సహజ లక్షణంగా మారింది!

   “మరి - ఇందులో సగం మంది నిన్నటి చోటనే పని చేశారేమిటి? ఈ గంగులవారిపాలెం రోడ్డుమీద కార్యకర్తలకింత వల్లమాలిన అభిమానమెందుకు ? దీన్నే ఇన్నాళ్లు  శుభ్ర సుందరీకరిస్తే – 2.2  కిలోమీటర్ల NH 216 సంగతేమి?’’  అనే ప్రశ్నలు అప్రస్తుతం!  వానొచ్చినా – వరదొచ్చినా ఎప్పుడీ శ్రమ జీవులు తమ వేకువ వీధి సేవలు మానారు గనుక?

      “జై స్వచ్చ చల్లపల్లి సైన్సం” వాట్సప్ లో నేటి దృశ్య – శ్రవణ ఛాయా చిత్రాల్ని గమనించిన వారికి స్పష్టంగా తెలిసిపోతుంది కార్యకర్తల శ్రమ క్రమం ఏమిటో.   - ఎప్పుడో నాటిన పొగడ చెట్టు అనుమానాస్పదంగా ఉందని స్థానిక రామలక్ష్మణ కవలలు దాని ప్రక్క మరొకటి నాటడాన్నీ ,

- ఒక వృక్ష సుందరీకర్త మళ్లీ మళ్లీ అవే పూల మొక్కల పొందికకు మెరుగులు దిద్దడాన్నీ, అతడిని 5 గురు ప్రోత్సహించడాన్నీ ,

- ట్రాక్టర్ల కొద్దీ  తుక్కునూ, మట్టినీ వృధా పోకుండా మురుగు కాల్వ అంచుకు చేర్చి, రోడ్డు భద్రతకు పూచీ పడుతున్న కష్ట జీవుల్నీ నేటి వాట్సాప్ లో చూడండి !  

వారం రోజుల తరువాత ప్రాతూరి శంకర శాస్త్రి గారి పునరాగమనం మంచి బిస్కెట్ల పంపకంతో జరిగింది.

40 మందికి పైగా ఒక చోట చేరినపుడు కబుర్లకు లోటా? మైకు ధ్వనులకూ, మర రంపం రొదనకూ కొదవా? ఐతే-

ఒక మాజీ పంతులమ్మ- అడుసుమిల్లి పద్మ ముమ్మారు స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలు ప్రకటించిన సభలో DRK గారు వివరించినట్లు –

ఇక్కడి చతుర్లూ, సరసాలూ, సరదా పదాలూ, వాడే భాషా అదుపులోఉండాలి-ఉంటూనే ఉన్నది!

నేటి 2 గంటల సందడిలో నందేటి వాని స్వయం విరచిత పద్య పఠనమే హైలైటు!

రేపటి వేకువ కూడ మన పనిచోటు గంగులవారిపాలెం వీధి మలుపే!

               దశాబ్దంగా సాగు క్రతువుకు

     సహర్షంగా - సగర్వంగా - సమర్థంగా – సముచితంగా-

    సాహసంగా - సమున్నతముగ స్వచ్ఛ సుందర నిత్య సేవలు!

    ఊళ్ళకొక దిక్సూచియగు ఈ ఉద్యమానికి అండదండలు !

    దశాబ్దంగా సాగు క్రతువుకు దాతలందరి శుభాశీస్సులు.

 

- ఒక తలపండిన కార్యకర్త

   29.09.2024