3248* వ రోజు ....           30-Sep-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

సెప్టెంబరు మాసాంతపు రహదారి సుందరీకరణ!

            సోమవారం నాటి ఆ పనికి పూనుకొన్నది 4.20 - 6.10 వేకువ కాలాన! నేటి ఇరువదిన్నొక్కరు కార్యకర్తల్లో సగానికి పైగా గంగులవారిపాలెం దగ్గరి NH 216 సేవలో నిమగ్నులైతే - మిగిలిన వారు భవఘ్నినగర్ ప్రాంతంలో.

1) నిన్నా మొన్నా షెడ్డర్ పొడిగా కొట్టిన తుక్కును అక్కడి రోడ్డు, చెట్ల భద్రతకు వాడుతూనూ,

2) ఎలా కనిపెట్టారో గాని బాట తూర్పు ప్రక్కన ఖాళీలో 2 బోగన్ విలియా పూల మొక్కలు నాటుతూనూ

3) ఇద్దరు మరొకమారు వీధిని ఊడుస్తూనూ కనిపించారు!

            ప్రస్తుతానికైతే మరో 2 నెలల దాకా ఈ గంగులవారిపాలెం వీధి స్వచ్చ శుభ్ర సౌందర్యాల లోటేమీ లేనట్లే! ఏవైనా చిన్నా - చితకా సమస్యలొస్తే చూసుకునేందుకు ట్రస్టు ఉద్యోగులుండనే ఉన్నారు!

            ఇక డజను మందితో మురుగు కాల్వ వంతెన దగ్గర రెండు ప్రక్కలా జరిగిన శ్రమ ఎట్టిదనగా!

            అసలా ప్రాంతం ఇప్పటికే ఒక మోడల్ గా కనిపిస్తున్నది, “ఇక్కడ పని చేసేకంటే మనం దీనికి పడమరగా గడ్డి బాగా పెరిగిన చోట కష్టించవచ్చు గదాఅని ఇద్దరు కార్యకర్తలు వ్యాఖ్యానించారు కూడ!

            కాకపోతే గత 10 రోజులుగా ఆ ప్రాంతంలో కొన్ని ప్లాస్టిక్ తుక్కులు చేరి, నాటిన పూల చెట్ల పాదుల్లో కొంచెం గడ్డి పెరిగి, రెండు మూడు వంకరగా పెరుగుతున్న చెట్లు కనిపించి, కార్యకర్తలిక్కడ అగి ఉంటారు.

- చెట్ల కొమ్మల ఖండనదారుడు ఆ పనికి బదులు గడ్డిని మట్టంగా కత్తిరించే యంత్రంతో పనిచేసుకుపోగా,

- ఆ తునకలు రోడ్డు మీదకు చెదిరిపడితే ఇద్దరు మహిళలు ఊడుస్తుండగా,

- ఈ రహదారి భాగానికింకేమైనా లోపాలున్నాయా - అని ఒకాయన వెదకుతుండగా తీరా చూస్తే 6.00 దాటిపోయి, చంద్ర వంక కనుమరుగైపోయి, కణకణలాడుతూ సూర్యుడు పైకెగబ్రాకనే ప్రాకాడు!

            ఇక, 21-2 మందీ చురచురలాడే సూర్యునికెదురు నిలిచి, మల్లంపాటి ప్రేమానందమనే శివరాంపురం కృషీవల కార్యకర్త 3 మార్లు స్వచ్చ సుందర సంకల్ప నినాదాలు పలుకగా,

            తాజాగా మంగళాపురం సమీపాన జరిగిన ఘోర ప్రమాదాన్ని దృష్టిలో పెట్టికొని రేపటి నుండీ జరిగే రహదారి పనుల్లో జాగరూకత పాటించాలని హెచ్చరించుకుని, నేటి శ్రమదానం ముగించారు.

            రేపటి శ్రమ కూడ ఇదే NH 216 కే సమర్పించేందుకు నిర్ణయించారు!

            ఒక్క శాతం మంది లేరే

ఒక్క శాతం మంది లేరే - స్వచ్ఛ సుందర కార్యకర్తలు

దశదిశలకూ వ్యాప్తి చేసిరి చల్లపల్లిఅనెడి పేరును

అన్ని ఊళ్ల హితాభిలాషులు స్వల్పముగనే పూనుకొనినను

ఇంగితాలను తట్టి లేపిన ఎన్ని అద్భుతములు జరుగునునో!

- ఒక తలపండిన కార్యకర్త

   30.09.2024