పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?
దిగ్విజయవంతంగా 24-10-24 నాటి శ్రమదానం @ 3271*
ఇది బృహస్పతి గారి వారం – మళ్లీ వేకువ నిన్నటి చోటనే 4-16 కే 12 గురి సమాయత్తం! బ్రహ్మ ముహుర్తాన వాళ్ల సంసిద్ధత పెళ్లికో – పేరంటానికో కాదు; ఏలిన వారి స్కీముల్లో దొరికే సముచిత పంపకాలందుకొనేందుకూ కాదు – కేవలం పదేళ్లనాటి తమ స్వయం నిర్దేశిత స్వగ్రామ పరిశుభ్ర – హరిత – సుందరీకరణ నిమిత్తమే!
ప్రపంచం ఎంత విచిత్రమైనదంటే –
“ఇది కనీ-వినీ ఎరుగని సత్యం” అని నమ్మించే దిక్కుమాలిన అబద్ధాల గ్రాఫిక్సూ, కళ్ల ముందు కనిపించిన కటిక నిజాన్ని కూడ – “అబ్బే ఇదొక భ్రమ! అసలిదెలా సాధ్యం?” అనుకొనే సంఘటనలూ ఉంటాయి! ఒకటి కాదు – 2 కాదు – పదేళ్ల సుదీర్ఘ చల్లపల్లి శ్రమదానం అలాంటి ఒక సంఘటన!
వానొచ్చినా – వణికించే చలీ – మంచూ కురిసినా – ఎండలు మండినా - ఆఖరికి ప్రళయ భీకర కోవిడ్ తరుముతున్నా - స్వచ్ఛ కార్యకర్తల సామాజిక – సామూహిక శ్రమదానం పూర్తిగా ఆగిందా?
మరి – ఈ నాల్గు లక్షల గంటల సమష్టి శ్రమదానం ఊరికేపోతుందా? పదేళ్ల క్రితం చల్లపల్లికీ – 24-10-2024 నేటి స్వచ్ఛ-సౌందర్య-హరిత-మనోహర చల్లపల్లికీ పొలికుందా?
ఇక ఈ గురుని వారపు వేకువ శ్రమ సంగతులా? అవి షరా మామూలే! పింగళి వారి ఆస్పత్రి మొదలుకొని, భగత్ సింగ్ దంత వైద్యశాలా, జమీందారు భవన ప్రాంతమూ, మధ్యలో మునసబు వీధి భాగమూ, సజ్జా వారి వీధి మొదలూ బాగుపడక ఏం చేస్తాయి?
34 గురు రెగ్యులర్ కార్యకర్తలూ, ముగ్గురు ట్రస్టు సంబంధీకులూ, మరో ముగ్గురు అతిథి వాలంటీర్లూ శ్రమిస్తే 140 గజాల వీధి కాలుష్యాలు తట్టుకోగలవా?
రేపల్లె రైల్వే స్టేషన్ నుండి వస్తూ దారిలో ఆగి, శ్రమదానంలో పాల్గొన్న లక్ష్మీపురం వార్డు సభ్యుడొక అతిథి!
నేటి ఉద్యమ నినాదాలను హడావిడిగా పలికింది దేసు మాధురీ కార్యకర్త!
రేపటి మన పనుల ప్రారంభం భగత్ సింగ్ వైద్యశాల నుండే!
ఇదేం తప్పో.... అదేం గొప్పో....
ఇదేం తప్పో! స్వంత ఊరికి ఎంతొకొంతగ ఉపచరించుట
అదేం గొప్పో ఒక్క పూటా అట్టి పనులను చేయకుండుట
ఆనాహ్లాదం, అనారోగ్యం ఊరినుండీ తరిమికొట్టక
పంతమో – నిర్లక్ష్యమో స్వప్రజాక్షేమం పట్టకుండుట!
-నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
24.10.2024