పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?
3274* వ పూట - 47 మంది ప్రయత్నాలు!
అక్టోబరు 27-ఆదివారం వేకువ సైతం మళ్లీ అదే బందరు వీధిలోని రిలయన్స్ దుకాణం దగ్గర ఆగిన (సమయం 4.17 Am) 12 మందీ, నిర్ణీత కాలానికి చేరుకొన్న 18 మందీ, ఇంకొంచెం ఆరామ్ గా వచ్చి కలిసిన మిగిలిన కార్యకర్తలూ
అటు మునసబు వీధి-ఇటు తూర్పు రామమందిరాల నడిమి ½ కిలోమీటరు బందరు రహదారిని మరొకమారు అలరించిన అలంకరించిన విధమిట్లున్నది!
1) అమరావతి జమీందారుని ప్రాసాదము వెలుపలి ఉద్యానమునందలి ప్రతి పూల మొక్కకూ ప్రేమపూర్వకంగా కలుపు తొలగించుట-పాదులు సవరించుటలో 15 మందికి పైగా!
2) ఐదారు రోజులుగా బందరు దారి మార్జిన్లు బాగుపడినా-సుందరీకరణ సంఘానికది సరిపోక-గడ్డి పిలకల్ని చెక్కేసి, నారుమడిలాగా తయారు చేయడమూ –
3) మరికొందరి చూపు – అంతకు ముందుగ బొమ్మలు గీసి, రంగులేసినవి మాసిపోయిన గోడల మీద పడి – వాటిని పునరలంకరించాలనే నిర్ణయమూ –
4) కొందరు రిలయన్స్ స్మార్ట్ వద్దా, కొందరు ఫర్నిచర్ దుకాణం ఎదుటా, సజీవ చేపల దుకాణం దగ్గర ఇంకొందరూ –
5) అటు రామాలయం వైపు నుండి చీపుళ్ళ వాళ్ళూ –
- ఇలా చేసిన వాళ్ళకు చేసినంత పని! విడివిడిగా ఎవరెంత శుభ్రపరిచారని కాదు – గంటన్నర శ్రమానంతర బందరు రహదారిని చూసి ఆనందించేవారు-దాని వెనక ఎందరి శ్రమ ఉన్నదో గ్రహించాలి!
ఈ పదేళ్లలో ఊళ్లో ఎన్నెన్ని మార్పులు జరిగిందీ గుర్తుంచుకోవాలి. ఉత్సాహం అదుపులో లేని వారు రేపే వచ్చి స్వచ్ఛ కారకర్తలతో చేరాలి!
“ఇది వెనకటి చల్లపల్లి కాదు, మా సమష్టి కషార్జితంతో మారుతున్న “స్వఛ్ఛ-సుందర-చల్లపల్లి” అని దేశానికి చాటి చెప్పాలి!
6 రోజుల తర్వాత స్వచ్చ కార్యకర్తల్ని, వారి శ్రమనూ చూసిన ఇద్దరు ప్రముఖ వైద్యులు తమ పర్యటనానుభవాల్నీ, వాటి నుండి మనం నేర్వదగిన క్రొత్త సంగతుల్నీ చర్చించి, -
అంతకుముందు పైడిపాముల కృష్ణకుమారి గారు ఉద్యమ నినాదాలు ప్రకటించి-
చల్లపల్లి శ్రమదాన దశాబ్ది ఉత్సవానికి పంచాయతీ తరపున తమ పూర్తి సహాయ సహకారాలుండునని సర్పంచ్ మరియు EO మాధవేంద్రరావు గారలు కార్యకర్తల హర్షధ్వానాల నడుమ ప్రకటించారు.
చివరకు రేపు రాయపాటి రాధాకృష్ణ గారి ఇంటి దగ్గరే ఆగి, పనులు ప్రారంభించాలని నిర్ణయించారు.
మెచ్చకుండా మిగలగలరా?
వీధులెంతో శుభ్రముగ - ప్రతి శ్మశానం ఒకపూల తోటగ
ఊరి చుట్టున బాటలన్నీ వృక్ష సంపద నిండియుండగ
మరుగుదొడ్లూ, మంచి పార్కూ ప్రజల మన్నన పొందుతుండగ
ఎవరు మాత్రం చల్లపల్లిని మెచ్చకుండా మిగలగలరా?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్చ కార్యకర్త
27.10.2024