3275* వ రోజు ... ....           28-Oct-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

సోమవారం నాటి శ్రమదాన సమాచారం! - @3275*

          28-10-24 వేకువ మరీ 4.09 కే తొలి సమాచారం అందింది. తమ ఇతర కర్తవ్యాలు ప్రక్కనబెట్టి ఎప్పుడు లేచి, బయల్దేరి, ఎంతెంత దూరాలు పయనించి, బందరు వీధి దక్షిణపు ట్విల్స్వస్త్ర దుకాణం వద్దకు చేరి ఉంటారో ఆలోచించాలని మనవి!

          ఏం కర్మపట్టి - ఈ 31 మంది - (అందులో ఒక పెద్ద మనిషి - పురచెయ్యి లిగమెంటు మొన్న తెగిపోయినా సరే-) గౌరవనీయులు 3 గ్రామాల నుండి వచ్చి - ఎవరెవరి ఇళ్ళ వద్దనో ఎంగిళ్లు ఎత్తే వీధులూడ్చే – ‘ఒకటిమడుగుల్లో శుభ్రపరిచే గడ్డి పీకే - పనులకు పాల్పడుతున్నారో గాని -

ఇలాంటి 150 మంది కార్యకర్తల పుణ్యం కాదూ

1) దిక్కుమాలిన కంపులు కొట్టే గంగులవారిపాలెం వీధి ఇప్పుడు, ఈ ఊరికే గాదు మండలాలు మండలాలకే మోడల్ గా మారింది;

2) అడుగున మురుగు వ్యవస్థా, పైన పూల వనాలతో కనీసం 3 వీధులు బాగుపడినవి;

3) అడుగు పెట్టటానికే భయపడే శ్మశానాలు కన్నుల పండుగగా - దర్శనీయ ప్రదేశాలుగా మారిపోయినవి;

4) 32 వేల చెట్లతో - పూల గుబాళింపులతో - మినీ ఉద్యానాలతో ఈ పురాతన గ్రామానికింత మహర్దశ పట్టింది!

          చల్లపల్లి చుట్టూ 2-3-4 కిలోమీటర్ల దాకా రహదారులు మీరు ప్రవేశిస్తున్నది స్వచ్ఛ - సుందర ఆరోగ్య చల్లపల్లిలోనికి సుమా!అని అగంతకుల్ని హెచ్చరిస్తున్నది!

          ఈ పూట కూడ ఇంచుమించు నిన్నటి చోటే పని జరిగింది కాకపోతే జమీందారీ భవనపు ఉద్యానంలో అదనంగా గద్దగోరు పూల మొక్కలు నాటారు.

          పదేళ్ళ నుండీ అలోచిస్తూనే ఉన్నాను ౼ ఇదెలా సాధ్యం? ఈ వయసు మీరిన పెద్దలు, గృహిణులు, వైద్యులు విజిల్స్ ఊదుతున్నా వినిపించుకోక - ఇంతగా ఊరి వీధి పనుల్లో ఎలా లీనమౌతున్నారా!అని

          ఏం చేస్తాం - ఈ తేడాగాళ్ళకి ఇదే పరమానందం!

          చివరి సభలో అదినారాయణుల వారికి కుదరకపోతే మరొక పెద్ద తేడా గాడు స్వచ్చ సుందరోద్యమ నినాదాలు అదరగొట్టితే - ఇంకో తేడా వైద్యుడు శ్రమను సమీక్షిస్తే

          రేపు కూడ రాయపాటి వారి ఇళ్ల దగ్గరే ఆగి, శ్రమించాలని నిర్ణయమయిపోయింది!

          స్వచ్ఛోద్యమ చల్లపల్లి ప్రత్యేకత!

అతిహీనం - అవమానం - అంతస్తుకు దిగుమానం

ఈ పాచి పనికి పెంట పనికి పాల్పడటం నా వంతా?....”

అని వెనుకాడక ప్రతి పని కందరు పోటీపడుటాశ్చర్యం!

మరి అదే గదా స్వచ్ఛోద్యమ చల్లపల్లి ప్రత్యేకత!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్చ కార్యకర్త

   28.10.2024