3276* వ రోజు .......           29-Oct-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

4.10-6.10AM. కాలపు శ్రమ సంరంభం! @3276*

          36 మంది సామాజిక ప్రయోజక కార్యకర్తలు ఒక చోట చేరినప్పుడు - వారిలో శస్త్రచికిత్సా నిపుణులూ, మహిళలూ, వివిధ వయసుల కుటుంబ నేపధ్యాల చిన్నా-పెద్దా మనుషులున్నప్పుడు - కవి గాయక కళాకారులు పూనుకొన్నప్పుడు వాళ్ళకు తోడుగా ధ్వని అదుపాజ్ఞల్లో ఉన్న మైకు పాటలు తోడైతే.... సందడికేం లోటు?

          ఈ 30 కి పైగా తలలలో ఊరి మంచి కార్యక్రమాల ప్రణాళికలూ, చేతుల్లో రకరకాల పనులకనువైన పనిముట్లూ, కళ్ళలో వీధి కాలుష్యం పట్ల కసీ, మురుగు కాల్వ సరిగా పారుతున్నదా - లేదా అనే ఆరా, రోడ్డు మార్జిన్లలో ఏ పిచ్చి మొక్కో, క్రొత్తగా కట్టే భవనం ఎదుట వ్యర్ధాలూ, మాంస దుకాణాల దగ్గరి గలీజులో ఉంటే గట్టి స్పందనా!

          తూర్పు కోదండ రామమందిరం ఎదుట ఆగింది మొదలు కొందరు నిన్నటి రిలయన్స్ ప్రాంతంలో మళ్లీ శుభ్రపరుస్తుండగా

          ఒక మాజీ వార్డు సభ్యురాలు రోడ్డు మీద పరచుకొన్న ఇసుకా, రాతి గులకా క్రొత్త నిర్మాణం వైపుకు నెట్టుతుండగా బాటకు దక్షిణపు డ్రైన్ ఒడ్డున గడ్డి పీకే వాళ్లు పీకుతుండగా చీపుళ్ల వారు మసీదూ, మేదర కుటీర పరిశ్రమల, సిమెంటు దుకాణాల దగ్గరి సకల జాతుల వ్యర్ధాల్నీ ఊడుస్తుండగా

          సుందరీకర్తలు తమ పనుల్లో తాము మునగానాం తేలానాంఅన్నట్లు పాటుబడుతుండగా

          భళ్లున తెల్లారనే తెల్లారింది! అప్పటికి బందరు వీధి కమ్యూనిస్టు బజారు దాక ఎంత బాగుపడిందో స్వయంగా చూడని  గ్రామస్తులు వాట్సప్ ఫోటోలైనా చూడవచ్చు!

అలజడి మా జీవితం - ఆందోళన మా ఊపిరి -

తిరుగుబాటు మా వేదాంతం......అనే శ్రీశ్రీ గేయం లాగా

గ్రామ వీధి పరిశుభ్రత వీళ్ళ లక్ష్యం - హరిత పుష్ప సౌందర్యాలు వీళ్ల ఆశయం; ఏ నాటికైనా తమ ఊరిని దేశపటంలో నంబరు వన్ గా తీర్చిదిద్దాలన్నది వాళ్ళు కట్టుకొన్న కంకణం!

          ఆరున్నరకు చెరువు గట్టున జరిగిన సమీక్షా, ప్రణాళికా సమావేశం కూడా సందడిగానే ఉత్సాహంగానే! కార్యకర్తలందర్నీ 9.11.2024 నాటి పదేళ్ళ ఫంక్షన్ మూడ్ పట్టుకొన్నది! కస్తూరి ప్రసాద్ సందర్భోచిత నినాదాలు చేశాక కొందరు ఇళ్లకు పోకుండా శ్మశానానికీ, 216 వ రహదారికీ వెళ్లారు!

          రాజ్యలక్ష్మి ఆసుపత్రి వీధి దగ్గరి చంటి హోటల్ వద్ద రేపు 4.30 కు కలవాలని నిర్ణయించుకున్నారు. 

          ఘన నివాళులర్పిస్తాం!

ఎవరి చెమట చలువ వలన ఈ బందరు వీధి నేడు (29.10.24)

100 గజాలకు పైగా బాగుపడెనొ మెరుగయ్యెనొ

గడ్డి చెక్కి కసవులూడ్చి కష్టించిన స్వచ్ఛ - మాన్య

కార్యకర్తలందరికీ ఘన నివాళులర్పిస్తాం!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్చ కార్యకర్త

   29.10.2024