పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?
అతి విలువైన 3277* వ నాటి శ్రమ సమాచారం!
అది ఈ 30-10-24 - బుధవారపు శుభోదయానికి చెందినది! 37 మంది వీధి పనుల గురించినది! సామ్యవాద (కమ్యూనిస్ట్) వీధి మొదలు రక్షకభట కార్యాలయ వీధి దాక సముచిత శ్రమదాన సంగతన్న మాట!
ఇక ‘విలువ’ సంగతికొస్తే - 7-5-1937 న శ్రీ శ్రీ మహాకవి రైతుల కష్టం గురించి వ్రాసిన గేయమే గుర్తుకొస్తున్నది.
“......బలం ధరిత్రికి బలి కావించే
కర్షక వీరుల కాయం నిండా – కాలువ కట్టే ఘర్మ జలానికి –
ధర్మ జలానికి.... ఖరీదు కట్టే షరాబు లేడోయ్!”
మరి నేటి వేకువ ఏ ప్రతిఫలమాసించక 37 మంది స్వచ్ఛ కార్యకర్తలు – “...గ్రామ సౌఖ్యములు వర్ధిల్లాలని...” కష్టించి సాధించిన 200 గజాల ప్రధాన వీధి స్వచ్చ - శుభ్రతలకు ఏ షరాపు ఖరీదు కట్టగలడు? పనికైతే ఇంతని విలువ కట్టగలరేమో గాని – ఇందరి మనోసంసిద్ధతకీ, స్థిత ప్రజ్ఞకీ, త్యాగం చేసిన తలా గంటన్నర సమయానికీ ఖరీదు కట్టడం సాధ్యమా?
ఇక్కడ ఆలోచించవలసింది – “ఏ కార్యకర్త ఎంత చెమట చిందించాడు – ఎన్ని గజాల వీధినీ, మురుక్కాలవనీ, బడ్డీ కొట్ల, టిఫిన్ బళ్ల దగ్గర వ్యర్ధాల్ని బాగు చేశాడని కాదు -”
“నికృష్టపు పనులని అందరూ అనుకొనే సదరు పనుల్ని ఈ మర్యాదస్తులూ, (కొందరు) సంపన్నులూ తిట్టుకొంటూ – గొణుక్కుంటూకాక - సంతోషంగా ఎలా చేయగల్గుతున్నారు? తమ దిన తొలి చర్యగా ఎందుకు మార్చుకొన్నారు?” అని ఆలోచేస్తే ఈ సుదీర్ఘ శ్రమదాన లేక వేడుక రహస్యం తెలిసిపోతుంది!
ఇంతగా గంటన్నర కష్టించాక కూడ - 6.20 కి పచారీ దుకాణం ఎదుట 85 ఏళ్ల పరమ వృద్ద వైద్యుడు ప్రకటించిన నినాదాల సమయంలోనూ - DRK వైద్యుని సంతోషాత్మక సమీక్ష జరిగేప్పుడూ అందరి ముఖాల్లో ఉత్సాహ - ఉద్వేగాలా - అలసటా కన్పించింది?
ఈ శ్రమదానాన్నొక వింతగా భావించే గ్రామం లోపలి, వెలుపలి జిజ్ఞాసువులు ఒక్క పది రోజులు వరసగా పాల్గొంటే తెలిసిపోతుంది.
- “ఇదేదో మఘలో పుట్టి పుబ్బలో ముగిసిపోయే శ్రమదానం కాదు – మరో దశాబ్దమైనా విజయవంతమౌతుందని”
రేపటి మన వేకువ తొలి కలయిక సంత వీధి మొదట్లోనే.
మనమేనా
మనమేనా మన ఊళ్లో మలినాలను తొలగిస్తిమి
కర్మభవన శ్మశానాల కాలుష్యం తీసేస్తిమి
ఊరంతా పచ్చదనం ఉరకలెత్తజేస్తుంటిమి
దేశంలో మన ఊరిని తేజరిల్లి జూస్తుంటిమి!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్చ కార్యకర్త
30.10.2024