పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?
దివ్వెల పండుగలోనూ 3278* వ శ్రమ వైభవం!
మాలాంటి చాల మందికి - ఈ క్రోధినామ సంవత్సర దీపావళి పర్వదినమును మించి - ఈ వేకువ 4.19-6.10 నడుమ జరిగిన - 44 మంది శ్రమదాన పర్వము మరింత గుర్తింపదగినది.
ఈ రోజు తన ఉపాధ్యాయ ఉద్యోగపర్వం ముగిస్తున్న మన ప్రముఖ కార్యకర్త అడపా గురవయ్యకు శుభ కామనలందింపదగినది..
స్వచ్ఛంద శ్రమ శీలురు ఈ వేకువ కలుసుకొన్నది బందరు వీధిలోని సంతబజారు వద్ద - శ్రమించినది అదే రోడ్డులో ½ కిలోమీటరు బారునా మరియు అమరావతి జమీందారుని ‘వైజయంతము’ వద్ద!
తత్ఫలితముగా శుభ్రత సంతరించుకొన్నవి – సంపటాలమ్మ, వెంకటేశ్వర, ధర్మశాస్త దేవళాలు! కూరల దుకాణమూ, బిర్యానీ పాయింటూ, పిండి మిల్లూ, కొబ్బరికాయల కొట్టూ, వస్త్ర దుకాణాల చోటులు కూడా స్వచ్చ - శుభ్రతల రుచి చూశాయి!
మరి ఈ పాటి వీధి పారిశుద్ధ్య సాధనకు కార్యకర్తల తపన? చేసిన శ్రమ? పొందిన సంతృప్తి? నేర్చుకొనే గ్రామస్తులుంటే ప్రదర్శించిన స్ఫూర్తి? అయ్యప్ప స్వాముల నినాదాల నడుమ స్వచ్ఛ కార్యకర్తల చీపుళ్ల గరగరలూ, ATM కేంద్రాల వద్ద వారి శ్రమ విన్యాసాలు, పని సమయం మించిపోతున్నప్పటి పనుల తొందరా.... దేన్నని వ్రాయగలను?
ఇందరు తిప్పలు పడి సాధించిన వీధి శుభ్రత కేవలం 200 గజాలకూ, 50 గజాల వైజయంతం ప్రహరీ నగిషీలకూ పరిమితమైనదే!
“వీధి అందంగా ఉంటే చాలా? - వీధి ప్రక్క గోడ రంగులూ, బొమ్మలూ లేక బోసిగా ఉండాలా?” అని 8 మంది పట్టిన పంతం ఇంకో 3-4 రోజులకు గాని తీరేట్టు లేదే!
6.20 సమయాన - అందరూ ATM కేంద్రం వద్ద నిలిచి, అడపా గురవయ్య చేసిన నినాదాలూ, చెప్పిన సూక్తులూ ఆలకించారు;
నేటి కార్యకర్తల కృషి పట్ల DRK గారి కళ్లలో ఆనందం గమనించారు; ఈ పర్వదినం తన పుట్టిన రోజనేది నిజమో – వంకో గాని – ఉదయ శంకర శాస్త్రి గారి పనుపున పంచిన లడ్డులు స్వీకరించారు.
రేపటి వేకువ మన కలయిక ATM కేంద్రం వద్దనని గ్రహించి గృహోన్ముఖులయ్యారు!
మంచి పనుల జాతరగా
ఒక కలగా - కల నిజముగ - ఊరికి ఉపకారం చేసే
ఒక కార్యాచరణగ - అత్యుత్తమమగు సమూహముగా
‘మనకోసం మనం’ జరుపు మంచి పనుల జాతరగా
ఎలా గడిచిపోయినదో ఈ పదేళ్ళ శ్రమ సందడి!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్చ కార్యకర్త
31.10.2024