పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?
ఇది 34 వ శతకం తొలి రోజు - (అనగా 3301*)
శనివారం (23-11-24) ఉషోదయం గ్రామ సమీప రహదారి బాధ్యతలు 36 మందివి! NH 216 లో 3 చోట్ల జరిగిన 3 రకాల పనులవి. ఒక వరుస క్రమంలో వాటినవలోకిస్తే :
I. చల్లపల్లి నుండి 2 ½ కిలోమీటర్ల దూరంగానూ, పెదకదళీపురం రోడ్డుకు కాస్త దగ్గరగానూ రైతులు ధాన్యం ఎండబెట్టుకొంటున్న చోట – బస్ షెల్టర్ వద్ద - తొలుతగా 3-4 మందీ, చివరికి 5-6 గురూ గత నాల్గు రోజుల సుందరీకర్తల కృషి! అక్కడింకెంత సౌందర్య పరిపూర్ణత సాధించాలనుకొంటున్నారో తెలీదు గాని – అక్కడిప్పుడు ఏ శుభకార్యమైనా జరుపుకోవచ్చు!
II. శివరామపురం రోడ్డులో హైవేకి ఉత్తరాన - 50 గజాల రోడ్డు మార్లిన్ల వద్ద ఇద్దరు భారీ విశ్రాంత వృద్ధ కార్యకర్తలూ, వాళ్ళిద్దరి వల్ల బక్కగా కన్పిస్తున్న మరొక పెన్షనరూ, తదుపరి మరో 4 గురూ సాధించిన శుభ్రత + భద్రత! 6.08 తర్వాత పని అపి, నడుములెత్తి, గంటన్నర పాటు తాము సాధించిన దానికి సంతృప్తినీ ఒకింత గర్వాన్నీ పొందారంటే - తప్పేముంది?
III. ఇక – అతికష్టమైన - నాలుగ్గజాల దాకా ముక్కులదర కొడుతున్న గాజు పెంకుల – ఆహార వ్యర్ధాల –ఏమిదాచారో తెలియని సంచీ మూటల మినీ డంపింగును ఆష్టాదశ కార్యకర్తలు తొలగించి, శుభ్రపరిచిన సాహసమే నేటి మేటి శ్రమదానానికి పరాకాష్ట! ముగ్గుర్నలుగురు పెద్దవాళ్లం దూరంగా నిలబడి, లీలగా తాకుతున్న దుర్వాసనను తట్టుకొంటూ చూస్తుంటేనే ఒళ్లు జలదరించింది - ఆ దిక్కుమాలిన కంపు పనులకి!
మిగిలిన కార్యకర్తలు. సీసాలు ఏరారు, చీపుళ్ళకు పని చెప్పి, హైవేను శుభ్రం చేశారు , పనిలో మునిగి తామెంత దూరంగా వెళ్లామో పట్టించుకోక - ఇద్దరు ఉత్తరవు బస్ షెల్డరు దాక మొక్కల పాదుల్ని క్రమబద్ధీకరించుకుపోయారు!
6.30 సమయంలో - సమీక్షా సభలో - మహా వీర సింహుడు గ్రామం పట్ల నిబద్ధతా నినాదాలు ప్రకటించగా - నేటి 50 పని గంటల కార్యకర్తల కష్టాన్నీ, తత్ఫలితాన్నీ Dr. డి.ఆర్కే. కీర్తించగా –
రేపటి వేకువ మన బాధ్యత బెజవాడ రోడ్డులో విజయా కాన్వెంటు వద్దకు మారుతున్నదనే ప్రకటనతో గృహోన్ముఖులయ్యారు!
హంగులెన్ని సమకూడునొ!
ఈ నూటరవయ్యారు మొక్క లెపుడు పెరిగి పుష్పించునొ!
ఎన్నేళ్లకు పండ్ల మొక్కలెదిగి ఫలములిచ్చునొ గద!
పచ్చదనం ప్రయాణికుల పలకరించి మెప్పించునొ
గంగులపాలెం వీధికి హంగులెన్ని సమకూడునొ!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
23.11.2024