పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?
24.11.2024 ఆదివారం నాటి శ్రమ విశేషాలు - @3302*
తొలి విశేషం చలినీ మంచునూ తట్టుకొని వేకువ 4.18 కే వయో వృద్ధ మూర్తులతో సహా 29 మంది విజయవాడ మార్గం దగ్గరి కస్తూర్బాయి ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకొని 6. 12 దాక సొంతానికీ కాక – ఊరి ప్రయోజనార్థం శ్రమించడం! (వీరు కాక - ప్రక్కన విజయా కాన్వెంటులో -22 ఏళ్లు పూర్తి చేసుకొంటున్న వైద్య శిబిర సేవల్లో 15 మంది కార్యకర్తలు !)
రెండోది మరీ విశేషమనిపించదేమోగాని, వాళ్ళు చేసేవి పెళ్లీ –పేరంటం పనులో, విందూ- విహార యాత్రలో కాదు – చాలామంది దృష్టిలో దిక్కుమాలిన మురికి- చెత్త పనుల్ని ఇష్టంగా –ఊరి పట్ల ఆప్యాయంగా చేసుకు పోవడం !( అవసరమైతే ఈ మహత్కార్యం నిమిత్తం వీళ్ళు తమ సొంత బాధ్యతల్ని తాత్కాలికంగా వాయిదా వేసుకొనేంత ఘనులు!)
పది – పదకొండేళ్లుగా చెత్త- దుమ్ము- కంపు పనుల్లో బాగా రాటు తేలిపోయిన ఈ కార్యకర్తలకు:
- ఈ 200 గజాల వీధిలో చెట్లు కొమ్మరెమ్మల్ని ట్రిమ్ చేయడమూ,
- మురుగు కాల్వల వ్యర్ధాల్ని బైటకు గుంజడమూ,
- ఆ వీధి బాగానే కనిపిస్తున్నా చీపుళ్లతో ఒకటికి రెండు మార్లు ఊడ్వడమూ,
- ప్లాస్టిక్ గాజు సీసాల- ప్లేటుల – కప్పుల దరిద్రాన్ని తుదముట్టించడమూ,
- ఇవన్నీ కలిపి ట్రాక్టర్ లో త్రొక్కి సర్దడమూ.. ఒకలెక్కా?
కళ్లెదుట చెత్త-వ్యర్ధాలు కనిపిస్తే- 6.00 కు ఇంకా అవి మిగిలిపోతే - నచ్చక, పని వేళ ముగిశాక కూడ పావుగంట పాటు వాటిని ఏరడమూ పరిపాటే! ఇందుకే మరి- వీళ్లని “ చెత్తపనుల వ్యసన పరులు” అనేది!
ఈ ఆదివారం పూట అన్నిటికన్నా పెద్ద విశేషం:
దేశవ్యాప్తంగా పెద్ద పత్రికల్లో తొలి 5-6 స్థానాల్లో ఉండే "ఈనాడు" లో- ఒట్టి వార్త కాదు-చల్లపల్లి స్వచ్చ సుందరోద్యమం గురించి ఏకంగా సంపాదకీయమే ఈ ఉదయం రావడం! ఇదొక విశేషమూ, విజయమూ అనుకొంటే అది కేవలం DRK, పద్మావతి అనే డాక్టర్లదే కాదనీ, స్వచ్ఛ కార్యకర్తలందరిదీ అనీ, అంతకన్నా అది చల్లపల్లి గ్రామ సామాజిక విజయమనీ అర్ధంచేసుకోవాలి!
చల్లపల్లిలో 11 ఏళ్ల తమ ప్రస్థానం గానీ, 22 ఏళ్లుగా నడుస్తున్న గోపాళం భ్రమరాంబా ట్రస్టు వారి సముచిత వైద్య శిబిరం గానీ – ఏ దేవదూతలో దిగి వచ్చి చేస్తున్న సేవలుగా కాక, సాటి మనుషుల పట్ల కొందరు నెర వేర్చుకొంటున్న బాధ్యతలుగా భావించడమే సమంజసం!
రేపటి పని స్థలంలో మార్పు గమనించాలి- బెజవాడ బాటలోని తరిగోపుల ప్రాంగణం వద్దే మన రేపటి బాధ్యతలు !
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
24.11.2024