పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?
33 శతకాల 3 వ రోజు శ్రమ దాతృత్వం – (అంటే) - @3303*
ఈ యొక్క దానగుణానికి వేదిక బెజవాడ బాటలోని డంపింగ్ కేంద్రం దగ్గరి కాటా ప్రదేశం! కార్తీక మాసపు తుది సోమవార కారణంగానో – అయ్యప్ప స్వాముల దీక్షాదక్షతలవల్లనో గాని - నేటి కార్యకర్తల సంఖ్య చక్కటి పొదుపు పాటించింది. పని స్థల మార్పిడీ, భారీ చలీ అందుక్కారణాలు కాకపోవచ్చు!
20 మందినీ మించని నేటి వివిధ రకాల పనిమంతుల శ్రమ విన్యాసాలెట్లున్నవో పరిశీలిస్తే :
వాళ్లు ప్రధానంగా అపార్ట్మెంట్లకీ - కాటాలకీ మధ్య 100 గజాల వీధి శుభ్రతతో సరిపెట్టుకొన్నారు గాని - జరిగిన పనికి మాత్రం లోటు లేదు.
ఒకరు కాటాల ముందు భాగం గడ్డి చెక్కేస్తే – మరొకరు అక్కడి నుండి చిల్లులవాగు వైపుకు ఊడ్చుకొంటూపోతే - కోమలానగర్ విశ్రాంతోద్యోగ కార్యకర్తల జోడీ కాటాల దక్షిణ భాగాన్ని సంస్కరిస్తుంటే –
ఇక అసలు శ్రమంతా అక్కడి నుండి 50 గజాల దక్షిణంగానే కేంద్రీకృతమయింది. అపార్ట్మెంట్ల మురుగు కంపూ అక్కడే! ఆ నీటి ఆధారంగా ఏపుగా పెరిగిన పిచ్చి చెట్ల సంహారమూ ఆ మురుగు వాసన పీలుస్తూనే!
అక్కడ ఊడుస్తుంటే ప్రోగుపడిన దుమ్మే సగం ట్రాక్టరుకు సరిపోయింది! పారలకూ, కత్తులకూ, దంతెలకూ, చీపుళ్ళకూ చాలినంత పని! ఇంత చలిలో మరీ ఎక్కువ చెమటలు - పట్టలేదు గాని - బట్టలు దుమ్ము కొట్టుకుపోయాయి! వాళ్ళ గూళ్లూ, నడుములూ పట్టేస్తే పట్టి ఉండవచ్చు! గంటన్నర పనుల వల్ల తయారైన వ్యర్ధాలన్నీ ట్రక్కులో కొలువై చెత్త కేంద్రం చేరాయి!
కాటాల కార్యాలయం ఎదుట జరిగిన సమీక్షా సభలో :
1) 3303 రోజుల శ్రమ వైభవ చిహ్నంగా అస్మదర్పిత 3303 రూపాయల స్వల్ప విరాళమూ, (మళ్లీ ఇందులో ఒక విదేశీ హస్తమూ, స్వదేశీ ముసలి హస్తమూ ఉన్నాయి!)
2) తాతినేని రమణుని జన్మదిన సందర్భంగా సిరిగంధం – 1, ఎర్రచందనం – 3, మహాగని – 6 = 10 పెద్ద మొక్కల విరాళమూ ముఖ్యాంశాలు!
రేపటి మన కర్మక్షేత్రం కూడ బెజవాడ బాటలోని కాటాల చోటే!
ఒక దిక్సూచిక కాదా!
మారేదీ మార్పించేదీ కవితా లక్షణ మందురు
నడచుచు నడిపించేదే మంచి ఉద్యమం అందురు
జనంలోన పెనునిద్దుర వదిలించేదిది కాదా!
ఈ విశాల భారతావనికి ఒక దిక్సూచిక కాదా!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
25.11.2024