3304* వ రోజు ....           26-Nov-2024

 పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

కటిక చలిలో 24 మంది వీధి శుభ్రతలు! @3304!

            మంగళవారం వేకువ - ముంచుకొస్తున్న తుఫాను వాతావరణం మళ్లీ ఊరికి 2-3 కిలోమీటర్ల దూరాన శ్మశానం సమీపాన 2 డజన్ల కర్మ వీరుల పారిశుద్ధ్య కృషిని గురించి పాతిక వేల మంది ప్రజల్లో ఎందరు గట్టిగా ఆలోచిస్తున్నారు?

            అప్పుడప్పుడూ కొద్దిమంది అవగాహనా - ఆలోచనా - సానుభూతి పరులు మాత్రం ఇలా జాలిపడుతుండగా వింటుంటాను:

- పాపం ఆ DRK డాక్టరుది ఈ ఊరే కాదే - ఆస్పత్రి పెట్టుకొని సంపాదిస్తున్నాడు సరే పిల్లల పిల్లలకు దాచక ఇలా చల్లపల్లికి తగలేయడమేమిటి?

- పాపం ఆ డాక్టరమ్మకు ప్రొద్దున్నే చేసుకోవడానికెన్ని ఆపరేషన్లు లేవు - చీపురేసుకొని శ్మశానం దగ్గర ఊడ్చే ఖర్మేమిటి?

- ఇద్దరు ముగ్గురు ముసలోళ్లు ఈ గతుకుల రోడ్డులో ప్రయాణించి, గడ్డకట్టే చలిలో ఈ స్వచ్చ కార్యకర్తల వేషాలెందుకు?

- కొందరు రైతులకు అవతల తుఫాను తరుముకొస్తుంటే - కష్టించి పండించిన ధాన్యం సంగతి చూసుకోక వీధి పనులవసరమా?

- పాస్టర్లూ, గృహిణులూ, ఉద్యోగులూ ఊరి కోసం ఇలా రోజూ గంటన్నర ఒళ్లు హూనం చేసుకోవాలా?

            అసలన్నిటికన్నా నాకొచ్చిన ధర్మ సందేహం – “పేపర్లో చదివో, కర్ణాకర్ణిగా వినో ఈ ఊరి ముఖమే చూడని 4 రోజుల్నాడు గతించిన బత్తుల ఉమాదేవి నెలనెలా ఈ స్వచ్చ సుందరోద్యమాన్ని ఆర్ధికంగా హర్ధికంగా ఆదుకోవాలా?” అని.

            నాపాటికి నేను మాత్రం  ఆలస్యంగా వెళ్లిన వాడిని మర్యాదగా కార్యకర్తల పనులకు ఆలోచనల్లో తేలిపోక శంకర్రావనే విశ్రాంత ఇంజనీర్ తో కలిసి, ఒక్క ఉదుటున ముళ్ళ కొమ్మలు లాగనేల - ఇద్దరూ బొక్క బోర్లా రోడ్డు మీద పడ నేల? మోకాళ్లకు ఈ దెబ్బలేల?

            ఇవాళ్టి కార్యకర్తల శ్రమవివరాలా వాటికేం? అవి ఏరోజు ఆగాయి కనుక - ఎవరు ఒళ్ళు దాచుకొన్నారు గనుక? ఈ 100 గజాల రోడ్డూ, మురుగు కాల్వా, అర ట్రాక్టరు చెత్తా చెదారాలుండగా వాళ్ళకేం లోటు? ఇంకో పదేళ్ళైనా ఇలాగే ఊరి పనులు చేసుకుంటూ పోవచ్చునే!

            నేటి తుది సమావేశం సజ్జా ప్రసాద నామధేయుని నినాదాలతో మొదలై - మన ఆత్మీయ ఉమాదేవికి శ్రద్ధాంజలితో ముగిసింది!

            రేపటి పని పాటులు కూడ బెజవాడ రోడ్డు కాటాల నుండే మొదలగును!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   26.11.2024