పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?
చలి తీవ్రతలోనే వీధి శుభ్రతకు తెగబడిన 41 మంది - @3305*
బుధవారం వేకువ – 6 వ నంబరు పంట కాల్వ నుండి బెజవాడ దిశగా – ½ కిలోమీటరు బారునా జరిగిన శ్రమ సంఘటనలు నేను వ్రాస్తే - మీరు చదివితే ఏం మజా ఉంటుంది? ఇప్పటి దాకా శ్రమదానానికి ససేమిరా అంటున్న గ్రామ పౌరులు వచ్చి, పాల్గొనకున్నా – కనీసం చూసినా తెలిసేది అసలీ స్వచ్ఛ సుందరోద్యమ మూల స్వభావ మేమిటా అని!
అరె! బాటకిరువైపులా కత్తులేసుకొని, దంతెలు ధరించి, పారల్తో, గునపాలతో 4.15 నుండీ 6.15 దాక – పని ముగింపు సమయపాలననూ పట్టించుకోక - ఆ 3 రకాల పనులేమిటి! 2 గంటల వీధి పారిశుద్ధ్య కృషిలో కొందరికింత చలిలోనూ చెమటలా? ఆడ కార్యకర్తలు సైతం పారతో మట్టి పనులా? ఎంత ఉత్సాహమూ - ఆవేశమైతే మాత్రం రద్దీ రోడ్డు మీద తమ వయసుల్ని విస్మరించి ఈ ఉరవడులూ పరవడులా?
కావడానికి మధ్య వయస్కుడైనా – పనుల్లో నవ యువకుడిగా చెప్పదగిన ఒక అమెరికా ప్రవాసుడు - నాదెళ్ల సురేశుడు గంటల తరబడీ 4 ముళ్ల బోగన్ విలియా చెట్లను ట్రిమ్ చేయడమా!
గ్రామస్తులు ఇప్పుడైనా వెళ్ళి 6 వ నంబరు కాల్వ వంతెన చూడండి – ఆ పరిసరాంలెంతగా స్వచ్ఛ శుభ్ర – సౌందర్యాలుట్టి పడుతున్నాయో! అది 5 గురు మహిళా సుందరీకర్తల గంటన్నర శ్రమ ఫలితమని నమ్మితే నమ్మండి!
ఈ వేకువ వేళ - 16 మంది కార్యకర్తలు 250 గజాల బారునా రోడ్డు వైపుకు చొచ్చుకుపోతున్న ఎన్ని చెట్ల కొమ్మల్ని అదుపు చేశారో –
ఏడెనిమిది మంది యువ కార్యకర్తలు 2 మట్టి దిబ్బల్ని త్రవ్వి, వందకు పైగా డిప్పల్ని ట్రాక్టర్ లో నింపుకొని, సదరు మురుగు మట్టి సంపదను డంపింగు యార్డుకు చేర్చిన వైనాన్ని ఆలోచించండి!
ఇన్నిన్ని – ఇంతింత - బరువు - మురికి పనులు చేశాక కూడ సగం మంది అలసిపోతే పోయారు గాని – ముఖాల్లో సంతృప్తీ, వీధి కశ్మలాల మీద మరింత కసీ కనిపిస్తాయి గమనించండి!
మైకు పనిచేయనప్పడల్లా కోడూరు వెంకటేశ్వరుని భీకర నినాదాలు! అతని ప్రక్కనే నిల్చున్న నా చెవుల్లో గింగుర్లు!
ఇక నేటి శ్రమను సమీక్షిస్తున్న DRK వైద్యుని సంతోషమేపాటిదంటే – ఏడెనిమిది గంటల ఆస్పత్రి పనులకు ప్రోద్భల మిచ్చేంతగా! బేబీ సరోజిని గారిచ్చిన (తన మేనల్లుడు ఉప్పల గోపీచంద్ జన్మదినం గుర్తుగా) 500 విరాళం కృతజ్ఞతా పూర్వకంగా స్వీకృతమయింది.
రేపటి వేకువ మన శ్రమ రంగస్తలం NH216 లోని శివరాంపురం క్రాస్ రోడ్డు వద్ద!
ఏమాయలు జరిగినవో
ఈ అరుదగు రుద్రభూమి, ఈ హిందు శ్మశాన ధాత్రి
ఆ తరిగోపుల ప్రాంగణ మా కర్మల భవనమ్ములు
వీడుకోలు వాహనాలు, దహన వాటికల సొగసులు
ఏమాయలు జరిగినవో ఈ దశాబ్ది కాలమ్మున!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
27.11.2024