3306* వ రోజు ....           28-Nov-2024

 పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

నేటి (గురువారం - 28-11-24) చలి వైపరీత్యాన్నెదుర్కొన్న ధీరులు 37 మంది - @ 3306*

          ఆ గట్టి చలి దెబ్బ ఊళ్లో ఐతే ఇంత ఎక్కువగా తగలకపోను! నిర్మానుష్యమైన 216 వ హైవే మీద - PK పల్లి జంక్షన్ వద్ద - ఉత్తరమ్మూల నుండి తగిలిన చలి కెరటాలను 4.15 - 6.10 మధ్య ఎదుర్కొని, 200 గజాల వీధి శుభ్రతను – [వాళ్ళ పొలంలోని వరి పంటను దక్కించుకొనే యుద్ధం కాదిది - ఊరి జనమంతటి కోసం కాలుష్యం మీద చేసిన అనివార్య యుద్ధం!] సాధించిన వాళ్లను  ‘చల్లపల్లి హీరోలు’ గా పేర్కొంటే తప్పేమిటి?

          రాజుల కోసం యుద్ధ వీరులు పోరాడి చచ్చింది చరిత్రలో మాట! జమీందార్ల స్వార్థం కోసం బలైనది మొన్నమొన్నటి వార్త! 20 డిగ్రీల చలిలో ఈ వేకువ పోరాటం ఆహ్వానింపదగిన – అన్ని ఊళ్లలో అవశ్యం జరుగక తప్పని కాలుష్య వ్యతిరేక సమరం!

          “ఎముకలు క్రుళ్లిన వయస్సు మళ్లిన సోమరులారా! ఆగండి! నెత్తురు మండే - శక్తులు నిండిన (యువ) సైనికులారా! రారండి! అనేగదా శ్రీ శ్రీ ఉవాచ?

          ఈ స్వచ్ఛ చల్లపల్లి శ్రమదానోద్యమంలో వయస్సు మళ్లిన సైనికులతో బాటు 10-12 మంది యువకులూ, “మేము కూడా సై” అంటూ కనీసం అరడజను మంది ధీరవనితలూ పాల్గొన్నారు చూశారా?

          రాష్ట్రానికే తలమానికమైన – స్వచ్ఛ హరిత శుభ్ర సంపన్నమైన డంపింగ్ యార్డు ఉండగా – ఈ హైవే దక్షిణాన

1) గాజు పెంకుల ముక్కలు

2) క్రుళ్లిన ఆహార వ్యర్ధాల

3) నానా వ్యర్ధ దరిద్రాల మినీ డంపింగ్ ఎవరి చలవో పంచాయతీ - పోలీసు వ్యవస్థలే తేల్చాలి!

          సహనానికి మారుపేరైన ఈ 30+ కార్యకర్తలే గంటన్నర పాటు ఆ పాప భారాన్ని మోసి - ఒక్కరి చేయీ గాజు ముక్కలకి కోసుకుపోక - మాస్కులు పెట్టుకోని వారు ఆ వాసనకు కడుపులో దేవుతున్నా పడిపోక - పని ఆపక పోవడంలోనే ఉన్నది ఈ చల్లపల్లి స్వచ్ఛ సుందరోద్యమ విజయరహస్యం!

          చలిపులి గాండ్రింపులకీ, ఘాటు కంపులకీ రేపు పని మాని, ఇళ్లలో ముసుగులు తన్ని పడుకుండి పోయే రకాలు కాదు ఈ కార్యకర్తలు!

          నింపాదిగా నేటి స్వచ్చోద్యను నినాదాలు ప్రకటించినదెవరనుకొంటిరి? అతడు బహుదూరపు బాటసారి ఐన నాదెళ్ల సురేషే!

          రేపటి వేకువ మన శ్రమ సమర్పణ కూడ NH216 లో శివరాంపురం రోడ్డు వద్దే!

          వందనీయము పూజనీయము

వంద శాతం స్వచ్ఛ శుభ్రత వందనీయము పూజనీయము

మాతృ గ్రామపు సుందరాకృతి మాననీయము శ్లాఘనీయము

అందుకంకితమైన వారభినందనీయులదృష్టవంతులు

స్వచ్ఛ సుందర గ్రామ సాధక కర్తలారా! ప్రణామంబులు!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   28.11.2024