పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?
స్వచ్చంద శ్రమ చరిత్రలో మరొక పుట! - @3307*
ఈ పేజీ 29-11-24 (శుక్రవారం) నాటిది. “చలీ-గిలీ జాన్తానై” అని, నిన్నటి తీవ్ర శైత్యం దెబ్బ రుచి చూసి కూడా - ఇవ్వాళ 4:20-6:20 నడుమ NH-216 పారిశుద్ధ్య హరితీకరణకు హాజరైన వారు తొలుత 10 మందే, ఆ సంఖ్య క్షణక్షణ ప్రవర్ధమానమై, సమీక్షా సభలో లెక్కిస్తే 36 మందీ!
ఇంతమంది సందడిగా శరీర శ్రమకు తెగబడితే – చేయగలిగిందేమీ లేక చలిగాడు తోక ముడిచాడు! ఇకేముంది – జాతీయ రహదారి200 గజాల బారునా, శివరామపురం రోడ్డునా ఒక్కో కార్యకర్త శ్రమ వీర విహారం యథేచ్ఛగా విజృంభించింది.
సినిమా హీరో ‘నాని’ పనుపున వెబ్ సిరీస్ చిత్రం కోసం చల్లపల్లి వచ్చిన సినీ దర్శకుడు ‘శాంటో’ - అంత వేకువ సమయాన రావడమే కాదు - కార్యకర్తల శ్రమదానంలో పాల్గొనడం ఆశ్చర్యం!
చల్లపల్లి కార్యకర్తల శ్రమంటే అదేదో మాట వరసకు జరిగే లాంఛనం కాదు – అర్ధం పర్ధం లేని - యదాలాపంగా జరిగే కష్టం కాదు. స్వార్ధ మూల మిదం జగత్” అనిపించుకొంటున్న నేటి అస్తవ్యస్త సమాజానికదో చక్కని చుక్కాని! అక్కడ ఈ పూట సరిక్రొత్తగా 28 నేరేడు మొక్కలు నాటారు. ఆ పని ముగిశాక ఏడెనిమిది మంది రహదారిని ఉడ్చారు! కొన్ని చెట్ల పాదుల్ని చక్కదిద్దారు!
20 మంది ప్రాత కాలపు సారా షాపుల దగ్గర దిక్కుమాలిన ‘సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వస్తువుల్ని ఏరేసి, 2 రోడ్ల కూడలి వద్ద మూలల ఎగుడుదిగుడుల్ని సరిచేసి, తమ పని తనం చూపారు!
ఇందులో ఇద్దరో - ముగ్గురో ఈ వేకువ అలస్యంగా వచ్చినందున - బ్రతిమాలుతున్నా లేవక డ్రైను ఒడ్డున 6:20 దాక శ్రమిస్తూనే ఉన్నారు.
అసలు చల్లపల్లిలో 10-11 ఏళ్ల వేకువ సామాజిక శ్రమదానమే ఒక చిత్రం! జీతం – భత్యం లేని 2 గంటల శ్రమ ఎప్పుడు ముగుస్తుందిరా దేవుడా – అని కాక “అయ్యో! పని మిగిలిపోతున్నదే - పనికాలం ముగుస్తున్నదే...” అని నిరాశ చెందే వాళ్లే ఎక్కువగా ఉండడం చిత్రాతి చిత్ర విచిత్రం!
“ఇంత ఆశ్చర్యకరమైన ఉద్యమాన్ని “శ్రమదానము” అనో త్యాగమనో ఎందుకనుకోవాలి? ఇది స్వచ్ఛ కార్యకర్తల నిత్య వేడుక! అది చల్లపల్లకీ, ఇతర గ్రామాలకీ శుభ సూచిక!
సమీక్షా సభలో మెండు శ్రీను సగర్వంగా పలికిన గ్రామ స్వచ్చోద్యమ నినాదాల అర్ధమేదో – ఇంకా తెలుసుకోవలసిన గ్రామస్తులున్నారు! యువ దర్శకుడు తన అనుభూతిని వివరిస్తున్నపుడు చప్పట్లే చప్పట్లు!
రేపటి వేకువ మన శ్రమస్థలం కాసానగర్ జంక్షన్ అని తెలిసింది.
లయన్స్ క్లబ్ ఆఫ్ చల్లపల్లి వి ఆర్ కె నగర్ మాజీ అధ్యక్షులు కొల్లిపర మధు గారి 67 వ పుట్టినరోజు సందర్భంగా ‘మనకోసం మనం’ ట్రస్టుకు పదివేల రూపాయలు విరాళం ఇచ్చారు. వారి కోడలు మౌనిక, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ వరద హరిగోపాల్ గారు కూడా మధు గారితో వచ్చారు.
అందరికి మా వందనమ్ములు!
అసాధారణ శ్రమోద్యమమిది - అలుపెరుంగని ప్రయాణం ఇది
గ్రామ భవితకు మేలి మలుపిది - ప్రజారోగ్యపు భద్రతే ఇది
3-4 వేల రోజుల మొండి మనుషుల ప్రమాణంబిది
ఆదరించిన - ప్రోత్సహించిన అందరికి మా వందనమ్ములు!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
29.11.2024