3308* వ రోజు ....           30-Nov-2024

 పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

శనివారపు (30.11.2024) శ్రమదాన మహత్మ్యం! (3308*)

          ఈవింతలు జరిగింది కూడా 216 వ రహదారి మీదనే గాని నిన్నటికి కిలోమీటరు దూరంగా కాసానగర్ కూడలి వద్ద! తుఫాను చెలరేగబోతున్నా – అలుపెరగక - కాలుష్యాల మీద కసి తగ్గక దూరమైనా మూడూళ్ళ నుండి కాలుష్య రహిత పర్యావరణమ్మీద ఆశ చావక సేవలందించిన మొండి వాళ్లు 31 మంది!

          ఇప్పుడు కాదు గానీ – నాలుగేళ్ల క్రితం దాకా ఈ స్వచ్చ కార్యకర్తల గురించీ, నాయకత్వం గురించీ జిల్లాలోనూ, బయటా బోలెడన్ని కాల్పనిక గాధలు చెప్పుకొనే వాళ్లు!

* వాళ్లకు కేంద్ర ఢిల్లీ నుండీ, అమెరికా నుండీ కోటాను కోట్ల డబ్బొచ్చిపడుతుంటే..!

* ఇందులో ఇద్దరు ముగ్గురి చూపు పద్మశ్రీ బిరుదు మీదా, MLA, MP సీటుల మీదా ఉన్నదట!

* అసలీ కార్యకర్తల్లో చాల మందికి కీర్తి దురదుందిలే – కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సన్మానాలూ, బిరుదులూ, పేపర్లలో - సామాజిక మధ్యమాల్లో గుర్తింపుల కోసమే ఈ తిప్పలట!

* అసల్నాకు తెలియకడుగుతానూ - ఏ కోరికలూ లేకుండ ఇంత నికృష్టమైన మురుక్కాల్వల – శ్మశానాల పనులెవరైనా ఎందుకు చేస్తార్రా ఈ రోజుల్లో?

*   *   *   *

          ఇక - ఇప్పుడు – 10-11 ఏళ్ళ ఎడతెగని సేవల పిదప, ఊరిలో మార్పులు చూశాక, అసత్య ప్రచారాలు తగ్గిపోయి, నిజాలు నిగ్గుతేలి, “ఈ శ్రమదానం మంచిదేనే! ఊరికి అవసరమేలే!” అనిపిస్తున్నది చాల మందికి! నిజం నిప్పని ఋజువైపోతున్నది!

          ఈ వేకువ శ్రమలో సమీప గ్రామస్తులు పాల్గొంటే ఒట్టు! బ్రతిమాలి సాగదీస్తే – బొట్టుపెట్టి పిలిస్తేనో కొందరు వచ్చేవాళ్లేమో!

          ఇక వానా – చలి గాలీ సంగతా? ఒక్కసారిగా వాన దబాయించలేదు గాని, చినుకు తుంపర్లు 2 గంటల పాటు పడుతూనే ఉన్నాయి! అవి చలిగాలిని తోడు తెచ్చుకున్నా - ఏ ఒక్క కార్యకర్తా వాటిని లెక్కచేయలేదు. ఈ పూటకు తమ 200 గజాల రహదారి శుభ్రతా లక్ష్యాన్ని సాధించేశారు!

          పని అపాలని ఎన్ని విజిల్స్ మ్రోగినా 6:20 దాక ఏడెనిమిది మంది ఆ మ్రోతల్ని గౌరవించనే లేదు!

          అనుమానాస్పద వాతావరణం దృష్ట్యానూ, నాదెళ్ల సురేశ్ గారి ఆతిధ్యాన్ని కార్యకర్తలందుకొనేందుకూ రేపటి వేకువ మన వీధి పారిశుద్ధ్యం బైపాస్ వీధీ - కమ్యూనిస్ట్ బజార్ల వద్దే!

          ఎంత మాయ చేసితివే?

ఒక పదేళ్ళ క్రితం గూడ ఊహించని మార్పులు ఇవి!

ఉద్యమ కర్తలు చూపిన ఓర్పుకసలు హద్దు లేవి?

సదుద్యమాల కీమాత్రం ఊపిరు లూదిన దెవ్వరు?

స్వచ్ఛ సుందరోద్యమమా! ఎంత మాయ చేసితివే?

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   30.11.2024