3309* వ రోజు....           01-Dec-2024

పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

అత్యుత్సాహ భరితంగా ఆదివారపు శ్రమ నివేదనం-@3309*

          2024 డిసెంబరు మాసారంభాన 4.20 – 6.20 వేకువ సమయాన- బైపాస్, సామ్యవాద వీధుల కూడలి ప్రాంతాన- 2 రోడ్లలో సుమారు 300 గజాల బారున జరిగిన 70-80 పని గంటల శ్రమ నివేదకులు నికరంగా 46 మందీ, సమయానుకూలంగా పాల్గొన్నది మొత్తం 75 మంది.

          ఇంతటి భారీ శ్రమ వేడుకకీ, ఎక్కువ మంది కార్యకర్తల కూడికకీ  ముఖ్యకారకుడు - ఈ స్వచ్ఛ సుందరోద్యమానికి వెన్నెముకల్లో ఒకడైన నాదెళ్ళ సురేష్ ! అత్యుత్సాహానికి కారణం - 24 రోజుల తన బహుళార్ధ సాధక భారత యాత్రను  ముగించి, తిరుగు ప్రయాణమౌతున్న అతనికి  వీడ్కోలు పలకాలనే కార్యకర్తల కోరిక!

ఉత్సాహ- ఉద్వేగాల సంగతికొస్తే- అవి చాల విధాలుగా ఉండవచ్చు.

- సంవత్సర కష్టం ఫలించి, పంటచేతికొచ్చి, ధరపలికిన ఉత్సాహం రైతుది.

- వణికిస్తున్న చలిలో- వేకువ 4.20- 6.20 మధ్య ఊరి బాధ్యత తలకెత్తుకొని – వీధులూడ్చి, వేలకొద్దీ చెట్లతో పచ్చదనం పెంపొందించి, వీధి వీధినీ కాపాడుకొంటున్న స్వచ్ఛ కార్యకర్తల ఉత్సాహం మరోరకం!

- పదేళ్లు శ్రమించి, పాతిక వేలమంది సౌకర్య- సౌజన్య- సౌమనస్యాల సాధనలో సఫలీకృతమౌతున్న క్షణాలను తలచుకొన్నప్పటి చల్లపల్లి స్వచ్ఛ సుందరోద్యమ నాయకత్వానిది అంతులేని ఉద్వేగం!

- ఇక్కడి శ్రమదానోద్యమ విజయాన్ని విశ్లేషించే సామాజిక వేత్తల ఆశ్చర్యం - ఆనందం మరోరకం!

- అసలివేవీ పట్టించుకోక –“ఇది నా ఊరు, నా కష్ట సుఖాల- జయాప జయాల సాక్షీభూతమైన ఈ చల్లపల్లి కోసం రోజుకు గంటన్నర శ్రమించడం నా కనీస బాధ్యత” అని 4 లక్షల పని గంటలుగా శ్రమిస్తున్న స్వచ్చ కార్యకర్తలది మచ్చలేని ఉత్సాహం! వెలకట్టలేని సంతృప్తి!

          నేను పనిగట్టుకొని, మంచి మంచి పదాలేరుకొని ఈ వేకువ కార్యకర్తల కష్టాన్ని వర్ణించాలా?

* వర్షం నీరు నిలిచి వీధి గుంటలు పడకుండా నీటి మడుగులు డ్రైన్లో కి ఎవరు మళ్లించారో –

 * కరెంటు తీగలకు తగలకుండా అన్ని చెట్ల కొమ్మల్నెవరు తొలగించారు-

* ఏ స్త్రీ కార్యకర్తల వల్ల ఈ రెండు వీధులు దుమ్ము తొలగి, సుందరీకృతమయ్యాయో – ఆ వీధుల్ని చూసి ఎవరైనా గ్రహించవచ్చు.

నేటి తుది సమావేశం గోళ్ల వేంకట రత్నం నినాదాలతోనూ, DRK సమీక్షతోనూ,  నాదెళ్ల సురేష్ ఉద్యమ విశ్లేషణ తోనూ-

అనల్పాహార విందుతోనూ 7. 00 లకు ముగిసింది.

రేపటి శ్రమదానం 216 వ రహదారి మీద కాసానగర్ వద్దకు మారింది.

               ఏమ్మాయలు చేసితివే

పదేళ్లనాటి ఊరా ఇది - పసిమి మిసిమి మితిమీరెను,

ఊరెకాదు ఊరిబయటి బాటలు కళకళలాడెను

సొంతూరిపట్ల చాల మంది కున్నదభినివేశమిపుడు

ఏమ్మాయలు చేసితివే స్వచ్ఛ సుందరోద్యమమా !

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   01.12.2024