3310* వ రోజు ....           02-Dec-2024

 పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

సాగర్ బైపాస్ వీధిలోనే 3310* వ నాడు కూడ!

          సోమవారం 216 వ రహదారి సేవలు అని ముందు నిర్ణయించుకొన్నది. ఐతే - తుఫాను వర్షం శీలాన్ని శంకించి ఈ వేకువు కూడ 25 మంది కార్యకర్తలు సజ్జా ప్రసాదుని వీధి – అనగా అశోక్ నగర్ 1 వ, 2 వ, 3 వ వరుసల్లోనే – 4:18 – 6:12 నడుమ శ్రమించారు.

          తమిళ రాష్ట్రం నుండి రావడం కుదరక వాన రాలేదు. కాస్త చలిగాలి వీచినా - వాతావరణం కార్యకర్తలకు ప్రోత్సాహకంగానే ఉన్నది. అందువల్లనే - కార్యకర్తల బలగం కొంచెం తగ్గినా – బైపాస్ దారి బారునా, దాని ప్రక్క రోడ్లలో పని పరిమాణం తగ్గనే లేదు.

పనులు 3 రకాలుగా ఉన్నవి:

1. విద్యుత్తీగలు చెట్ల కొమ్మల కంటుకొనే ప్రమాద నివారణ, అందుగ్గాను 3 వృక్షాల శాఖల్ని ఖండించవలసొచ్చింది.

2. పూల మొక్కల పాదుల్లో పుట్టిపెరిగి పెనవేసుకుంటున్న - పులుగుడు తీగల సంహరణ, గడ్డి తొలగింపు.

3. కొమ్మల – రెమ్మల - పిచ్చి తీగల – కలుపుల - సింగిల్ యూజ్ ప్లాస్టిక్కుల సేకరణ, ట్రాక్టర్ లోకి రవాణా, వీధి దక్షిణపు జాగాలో పేర్చుట.

          ఈ పూట కూడ పరి విరమణ జాప్యం సుందరీకర్తలదే. మినీ ఉద్యానాల్లోని ఆకులలములు కూడ ఏరి, డిప్పలకెత్తి, ట్రాక్టరులో నింపందే వాళ్ళకి సంతృప్తి దక్కలేదు.

          వేడి కాఫీ పానీయానంతర సమావేశంలో :

          భోగాది వాసు ఉపాధ్యాయుడు శ్రమదానోద్యమ నినాదాలు ప్రకటించి, ఇటీవల బెజవాడలో పునః బోధనా తర్ఫీదు కాలంలో స్వచ్చ చల్లపల్లి కార్యక్రమాన్ని అక్కడి వారు పదేపదే ప్రస్తావించడాన్ని వివరించగా,

          4.12.24 న స్వచ్ఛాంధ్ర మిషన్ ఛైర్మన్ పట్టాభి గారి గ్రామ సందర్శనా, CPM జిల్లా మహాసభల సందర్భంగా 17.12.24 న ఆ డెలిగేట్ లు మన వేకువ కార్యక్రమ పరిశీలన గురించి DRK గారు వివరించగా,

          రేపటి ఉదయ శ్రమదాన స్థలం 216 వ రహదారి మీద - కాసానగర కూడలి అని గ్రహించి, గృహోన్ముఖులైరి.  

         కుఢ్య చిత్రాల్ లిఖించుటలో-

ODF + చేయడంలో- మరుగు దొడ్లను కట్టడంలో

నాల్గు చోటుల స్వచ్ఛ - సుందర టాయిలెట్ నిర్మించడంలో

ముఖ్య వీధుల నక్కడక్కడ కుఢ్య చిత్రాల్ లిఖించుటలో-

అలసి సొలసిన కార్యకర్తల కందరికి అభివందనమ్ములు!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   02.12.2024