3316* వ రోజు ....           08-Dec-2024

 పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

ఆదివారం (8.12.24) నాటి శ్రమ సహచారం - @3316*

          కనీసం డజను మంది కష్టమైతే ఠంచనుగా 4:20 కే – వాసిరెడ్డి కోటేశ్వరరావు గారి వీధి - అనగా అశోక్ నగర్ 3 వ లైనులో మొదలయింది. పోనుపోను కార్యకర్తల తాకిడి పెరిగి, చివరికా సంఖ్య 34 కు చేరింది.

          ఇద్దరు కొంగ్రొత్త స్వచ్ఛ – శుభ్రతాభిమానులు కూడ పాల్గొన్నారు. అందులో ఒకామె చేసింది గంటలోపే ఐనా - చాలా చిత్తశుద్ధితో పనికి పూనుకొనడం విశేషం!

          సొంత వీధిలో - తమ ఇళ్ళ ముంగిళ్ల - ఇందరు పెద్దలూ, పరిచయస్తులూ పని చేస్తుంటే - ఇళ్లలో పడుకోవడం సిగ్గనిపించి, పాల్గొంటున్నట్లూ, ‘పెద్ద పెద్ద వారి సరసన పనిచేయడం ఎలాగా అని ఇన్నాళ్లు వెనకాడినట్లూ’ తెలిసింది!

          దివంగత వాసిరెడ్డి వారి వీధిలో పారిశుద్ధ్య లోపాలు సరి చేశాక, ఆ వ్యర్ధాల్ని ట్రాక్టర్ లో నింపాక, అశోక్ నగర్ 4 వ వీధిలోకి శ్రమదానం చొరబడింది. సదరు వీధేమో చిన్నది - కార్యకర్తల సంఖ్యేమో ఎక్కువ - అందువల్ల 6:10 నిముషాలకే ఆ వీధి పారిశుద్ధ్యం ముగిసింది.

          వెలుతురు పెరిగాక - చివరి పది నిముషాలలో చూడాలి - అక్కడి శ్రమ సందడి! ఒకరి చేతిలో డిప్పను చప్పున మరొకరందుకొంటూ - కత్తులు వాడకుండానే పిచ్చి మొక్కల్ని పీకేస్తూ - గడ్డిని చెక్కి, గోకి, ఏరేస్తూ – ట్రక్కు పైకెక్కిన అంజయ్య చెత్త డిప్పలందుకొని, సర్ది అణగ త్రొక్కుతూ... చివరికా వీధి శుభ్రసుందరంగా మారిన నిముషాలవి!

          4 రోజులు శ్రమదానానికి దూరమైన ఆకుల దుర్గాప్రసాదు గారు మైకందుకొని, నినాదాలు ప్రకటించగా,

          చతురోక్తుల సుద్దుల్ని అడపా గురవయ్య గారు వినిపించగా,

          రేపటి మన తొలి సమావేశమూ, పని స్ధలమూ భారత లక్ష్మి రైసుమిల్లు సమీపమందని నిర్ణయించబడగా....

          ఆదివారపు శ్రమ వేడుక ముగిసింది.

          చల్లపల్లికి ముద్దు బిడ్డలు!

ఎండ మండీ, వాన ముసిరీ గండములు గట్టెక్కుతుంటే

పేడ - పెంటలు ఎత్తివేస్తూ – మొండి గోడల నందగిస్తూ

ఊరి చుట్టూ పూలవనములు వృద్ధి చేస్తూ - శోభనిస్తూ

స్వచ్ఛ సుందర కార్యకర్తలె చల్లపల్లికి ముద్దు బిడ్డలు!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   08.12.2024