పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?
భారతలక్ష్మి వడ్లమర కేంద్రంగా....@3317*
తొలుత పదొకొండుగురూ, నిముషక్రమాన మొత్తం 24 మందీ పాల్పడిన వీధి పారిశుద్ధ్య – సుందరీకరణ సంగతులు :
అవి ఉభయ కామినేని భవన విభాగ నిర్మాణాల ఎదుట వీధికి పరిమితమైనవి. వడ్లమర గేటుదాక – బాటకు రెండు ప్రక్కలా సుమారు 200 గజాల హద్దులోనివి.
ఉభయ అపార్టుమెంట్లలోని లేదా ఐదారు గృహాల నుండి గాని ఒక్కరైనా, మచ్చుకైనా మేల్కోని, వచ్చి, స్వచ్చ కార్యకర్తలతో చేతులు కలపనే కలపనిది మొదటి సంగతి!
వీధి మలుపు ఇల్లు/ దుకాణం వారు మాత్రం మేల్కొని, తమ ప్రహరీ మీదుగా - తమ పరిసరం ఏమాత్రం శుభ్రపడిందా అని పరిశీలించింది 2 వ సంగతి!
బంధన్ బ్యాంక్ ఎదుట గడ్డీ – పిచ్చి చెట్లూ దట్టంగా పెరిగిన చిట్టడవిని 6 గురు కార్యకర్తలు గట్టి పంతం పట్టి, 6.20 దాక కాలుష్యరహితం చేసిన ప్రముఖ విశేషమది!
కార్యకర్తలు పీకిన - కోసిన – తెగ నరికిన గడ్డినీ, ముళ్ళ కంపనీ, కొన్ని మొక్కల కొమ్మల్నీ 4 గురు చీపుళ్లతో ప్రోగు చేస్తే - ఇద్దరు డిప్పలకెత్తితే - ఒక బాణావతు రమేశుడూ మరొక పైడిపాముల రాజేంద్రుడూ ట్రాక్టరులోకెక్కించిన కష్టమిది!
ఊరి జనంకాక – క్రొత్త వాళ్లు చూస్తే – “ఏమిటిది? ఈ ముసలోళ్లూ, గృహిణులూ, రైతులూ, చిరుద్యోగులు ఇంత వేకువ చలిలో ఇంత కష్టమైన – నికృష్టమైన మురికి – దుమ్మూ పనులెందుకు చేస్తున్నారు? ఎవరిందుకు పురమాయించారు?” అని గందరగోళపడే సంగతులన్న మాట!
ఎవరెలా ఊహించుకొన్నా – అదంతా తమ సామాజిక బాధ్యతగా 10-11 ఏళ్లుగా చేసుకుపోతున్న కార్యకర్తలు మాత్రం పనులు ముగించి, తమ 2 గంటల కష్టంతో బాగుపడ్డ వీధి భాగాన్ని సంతృప్తిగా చూసుకొని, కాఫీలు సేవించి,
మట్టా మహాలక్షి అనే సీనియర్ నర్సు దంచికొట్టిన నినాదాలకు స్పందించీ, రేపటి తమ బాధ్యతల కోసం మరొకమారు భారతలక్ష్మి రైసు మిల్లు ప్రాంతాన్నే ఎంచుకొని, ఇళ్లకేగారు!
చెమట ఫలమే!
వీధి వీధిని తిరిగి చూస్తే – ఊరి మూలలు వెదకి చూస్తే
బయలు దారులు వెళ్లి చూస్తే – అన్ని చోట్లా పచ్చదనమే!
ఈ అడుగడున ఆహ్లాదమయమే! కార్యకర్తల చెమట ఫలమే!
దేశమున కాదర్శ ప్రాయమె! - అందరికి అది స్ఫూర్తి ప్రదమే!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
09.12.2024