3318* వ రోజు ....           10-Dec-2024

 పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

స్వచ్ఛ సంస్కృతికి మచ్చుతునకగా మంగళవారపు శ్రమోద్విగ్నత - @3318*

          10-12-24 నాటి శ్రమోత్సాహం 4:19 కే మొదలై, 6:27 కు గాని తగ్గలేదు! అంటే 2 గంటల 8 నిముషాల వ్యవధన్నమాట! నేటి 33 గ్గురి శ్రమ సంఘటనా స్థలి బైపాస్ వీధిలో వడ్లమర మొదలు ప్రభుత్వ విద్యార్ధినుల వసతి గృహ పర్యంతం!

          ప్రత్యక్షంగా ఈ 50 పని గంటల కష్టాన్ని చూడని కొందరికి “ఇంత మంది – ఇన్ని గంటలు ఊడ బొడిచింది ఈ 200 గజాల వీధి శుభ్రతనా?” అనిపిస్తుందేమో గాని, స్వయంగా పాల్గొని అనుభవించిన వాళ్ల అలోచన వేఱు! అందుకే ప్రతి గ్రామస్తుడూ ‘ఒక్కరోజైనా – ఒక్క మారైనా స్వచ్ఛ కార్యకర్తగా మారు నేస్తమా’ అని నందేటి శ్రీను సవినయంగా అభ్యర్థిస్తుంటాడు!

          ఇందరు కార్యకర్తలు ఎవరి ఆయుధాలు వారు ధరించి, ఊడ్చే వాళ్లు ఊడ్చి, గడ్డి చెక్కే వాళ్లు చెక్కి, ప్లాస్టిక్ లు ఏరే వాళ్లు ఏరి, పాతిక ముప్పై ముళ్ల పూల మొక్కల్ని సుందరీకరించే వాళ్లు దీక్షగా సుందరీకరించి, ఈ నానా రకాల చెత్తనూ డిప్పలకెత్తి, ట్రాక్టర్లో అందించేవాళ్లు అందించి, ఆ ట్రక్కు గజమున్నర ఎత్తులో ఒక రమణ అందుకొని, అమర్చి – త్రొక్కి,...... ఎంతగా పాటుబడితే ఈ బైపాస్ వీధి భాగం ఇంత చూడ చక్కగా మారింది?

          తక్కిన సంగతులలా ఉంచి, 2-3 ముఖ్య సన్నివేశాల్ని ప్రస్తావించాలి.

- బాగా కసిగా పని చేసే ఇద్దరు ప్రసాదులూ, ఒక మెకానిక్ రవీ చచ్చి, ఎండిన బోగన్ విలియా పూల భారీ చెట్టునూ, దాని దెబ్బకు సగం ఎండిన వేప చెట్టునూ నరికి – ముళ్ల కొమ్మల్ని విరిచి, క్రిందికి దించిన ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశం!

          ఈ దృశ్యాన్ని కన్నార్పకుండా చూసి, ఆ సాహసాల్ని మెచ్చి, ఏ ఇబ్బందీ జరగనందుకు ఊపిరి పీల్చుకొన్న 85 ఏళ్ల వైద్య వృద్ధుడూ!

- అంతెత్తు ట్రాక్టర్ చెత్తమీద నుండి చెత్త త్రొక్కుడు రమణను నిచ్చెన మీదుగా నలుగురు దించుతున్న దృశ్యమూ!

- 6:27 కు 3 వ విజిలు మ్రోగినపుడు అయిష్టంగా పని ముగించిన గ్రామ సర్పంచీ, పల్నాటి అన్నపూర్ణా!

- తాను జాగ్రత్తపరుడే గాని, పని ముగిశాక – కత్తులు మోసుకొస్తూ వాటి పదునుకు వ్రేలు తెగిన కస్తూరి శ్రీనూ!

- ట్రాక్టరు మీదెక్కి మరీ కార్యకర్తల పనులను చిత్రీకరిస్తున్న తూము వారూ!

          ఇన్నిన్ని వింతలు - విశేషాల నేటి శ్రమదానానంతర సమావేశాన్ని వేగంగా నినాదాలు పలికి, ప్రారంభించినది కృష్ణకుమారి గారూ,

          రేపటి వేకువ మన పనుల ప్రారంభం బాలికల హాస్టలు (1 వ వార్డు) వద్దననే ఏకగ్రీవ తీర్మానమూ!

          వ్యత్యాసం –

అందరి ఆలోచనలో సుఖమంటే ఉద్యోగం –

ఫ్యాను క్రింద, A/C లోన – బట్ట మురికి పట్టకుండ – దర్జాగా బ్రతకడం

స్వచ్చోద్యమ మందేమో బజారెక్కి – చెమట క్రక్కి

సొంతూరికి కార్యకర్త చేయగలుగు శ్రమదానం!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   10.12.2024