3335* వ రోజు ....           27-Dec-2024

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు పర్యావరణ భంగకరం! రసాయన రహిత నార సంచుల వాడకం ఆదర్శనీయం!!

33 గ్గురి శ్రమతో సాగర్ టాకీస్ ప్రాంతం పునీతం! @3335*

            శుక్రవారం వేకువ (27-12-24) సంగతన్నమాట – “ఫలానా చోట 4.30 కు కలుసుకుందాంఅనుకోవడమూ, 4;15 కే 15 మంది చేరి వీధి కాలుష్యాల మీద కాలుదువ్వడమూ కార్యకర్తలకు షరా మామూలైపోయింది!

            అది బైపాస్ వీధిలో సినిమా హాలు ప్రాంతం అక్కడి ఉద్యానంలోనూ, వెలుపలా, తటవర్తి భవనం వద్దా, క్రొత్త మద్య దుకాణం పరిసరాల్లో వివిధ కాలుష్యాలు కవ్విస్తుంటే - ఊళ్లోని ఇతరుల్లాగా స్వచ్ఛ కార్యకర్తలూరకుండగలరా? 6.16 AM. దాక పరాక్రమించి, విజేతలయ్యారు!

            తామే గతంలో నాటి - పెంచిన ప్రహరీ వెలుపలి ఉద్యానంలోనే 16 మంది గంటన్నర కష్టించారు. కలుపులేరి, ప్లాస్టిక్ వ్యర్ధాల్ని సమీకరించి, అడ్డదిడ్డంగా పెరిగిన చెట్లకొమ్మల్ని క్రమబద్దీకరించి, అ వ్యర్ధాల్ని విభజించి, గోతాల్లో కుక్కి, డిప్పలకెత్తి ట్రాక్టర్ లో నింపారు! అక్కడి ఏడెనిమిది సెంట్ల జాగాలోనే బండెడు చెత్తా, 200 కు పైగా గాజు - ప్లాస్టిక్ సీసాలూ గ్లాసులూ - ప్లేటులూ దొరికాయంటే....

వేకువ 4.30 కు ముందూ, 6.30 తరువాతా

1) CPM ఆఫీసు వీధి వద్దా,

2) మద్య దుకాణ పరిసరాలు

3) ఒకానొకప్పటి చల్లపల్లి వైద్యశాలదగ్గరి ఖాళీ చోటుల్నీ గమనించి, వ్యత్యాసాన్ని గ్రహించండి! ఆ ప్రాంతం నివాసులు ఇకనుండైనా దయచేసి వ్యర్ధాలనక్కడ విరజిమ్మకండి!

            ఒక ముఖ్య గమనికేమంటే ఐదేళ్లపాటు భారీ శ్రమదానం చేసిన ప్రశాంతమణి గారు మళ్లీ ఈ వేకువ 2 ½ కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి, ఉరుకులు - పరుగులుగా వీధి శుభ్రతలో పాల్గొనడం! శ్రమ పరిశ్రమ ఉద్యోగానికామె చేసిన రాజీనామాను ఉపసంహరించినందుకందరూ అభినందించడం!

            (ఏళ్ల తరబడీ సామూహిక శ్రమదానం రుచి చూసి, సహ కార్యకర్తల సౌజన్య సౌఖ్యం అనుభవించిన ఏ కార్యకర్త అయినా ఆ పని మానడం ఎంత కష్టమో అందరూ గ్రహించారు!)

            అందుకామె ఉద్వేగ భరితంగా సగం నినాదాలే చెప్పగా - మిగిలిన సగానికి Dr. DRK గారు సహకరించడం!

            సినిమా ప్రదర్శనశాల మూల మలుపులోని కాలుష్యాల పనిబట్టడానికై రేపటి వేకువ మనం  కలుసుకోదగిన చోటు CPM ఆఫీసు వీధి మొదటనే అనే నిర్ణయించారు!

            శివరాంపురం కార్యకర్త, ప్రముఖ పాత్రికేయుడు శ్రీమాన్ బాల దుర్గా రాంప్రసాద్ తన 48 వ పుట్టినరోజు సందర్భంగా మనకోసం మనంట్రస్టుకు ఆన్లైన్ లో 2,000/- పంపినందుకు కార్యకర్తలందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు. 

            ఇరువ దొకటవ శతాబ్దంలో

కొద్ది మందే పెద్ద ఊరికి క్రొత్త రూపును సంతరిస్తూ

హరిత సుందర మహా వైభవ మందజేసే బరువు మోస్తే....

దశ వసంతాలదే పనిలో తన్మయంగా ఉండిపోతే

ఇరువ దొకటవ శతాబ్దంలో ఇంతకన్నా వింత కలదా?

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  27.12.2024