3336* వ రోజు ....           28-Dec-2024

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు పర్యావరణ భంగకరం! రసాయన రహిత నార సంచుల వాడకం ఆదర్శనీయం!!

3336* వ నాటి శ్రమ సందేశం!

            శనివారం వేకువ కూడ (28-12-24) 4.18 కే కొందరూ, సమయక్రమాన మరిందరూ - మొత్తం చివరికి నినాదాల సమయానికి 46 మందీ వీధి శ్రమకు కలసి వచ్చారు.

            పని స్థలాలు 2. ఎక్కువ మంది సాగర్ టాకీసు ప్రక్కన బైపాస్ మార్గంలోనూ, నలుగురు బందరు వీధిలో వైజయంతం వద్దా!

            జరిగిన వీధి మెరుగుదల పనులా – వాటికేం లోటు? శ్మశానాల్లోనూ, ఊరికి దూరంగా రహదార్లలోనూ పనిచేసే కార్యకర్తలకు ఊళ్లో పనులొక లెక్కా?

- ఒక భారీ వృద్ధకాయుడు ఒంగోలేక మోకాళ్లు నేలకానించి, గడ్డిని కోస్తున్న గంటన్నర శ్రమను చూడండి!

- బైపాస్ రోడ్డుకు ఉత్తరంగా ఉద్యానంలో అరేడుగురు ఎంతగా కష్టిస్తే అక్కడి గడ్డీ, , పిచ్చి చెట్లూ తొలగి, పూలమొక్కల పాదులు కుదురుకొని, ప్లాస్టిక్ వస్తువులు గోతాం నిండా దొరికాయో తెలుసుకోండి!

- CPM వీధి మలుపు దగ్గరి టాన్స్ఫార్మర్ లోతట్టున – దుర్గంధం వ్యాపిస్తున్న మురుగు కాల్వ గట్టును నలుగురైదుగురు బాగుచేసి, ప్లాస్టిక్, గాజు సామాన్లను 2 గోతాల్లో సేకరించిన దృశ్యం చూడదగినది కాదా?

- 10 మంది కార్యకర్తలు ఒళ్ళు వంచి, పనిచేయనిదే సినిమా హాలు టికెట్ కౌంటర్ వెనుక ఆరేడు సెంట్ల వ్యర్ధాలు, ఒక కొలిక్కి వచ్చాయా?

            6.25 సమయం దాటినా – అప్పటికే 2 మార్లు విరమణ విజిల్ మ్రోగినా - ఇద్దరు విజ్ఞప్తి చేసినా – ఒక వార్డు మాజీ సభ్యురాలూ, పాస్టరు గారి ఇల్లాలూ, హోటలు యజమానురాలూ, 3 గ్గురు గృహిణులూ సినిమా హాలు గేటు ఎదుట తామనుకొన్నట్లు అందంగా మార్చిన శ్రమదానం మాత్రం తక్కువదా?

            ఇక్కడికి దూరంగా – బందరు రోడ్డులోని జమీందార్ల వైజయంతం ప్రహరీని సుందరీకర్తలు ఇంకెంత అందంగా చేయాలనుకొంటున్నారో మరి!

            ఈ కాలంలో ఎక్కడా కనుపించని సామాజిక - సామూహిక - శ్రమదానాన్ని 45 మంది కొనసాగించే దృశ్యం అపురూపం కాదా?

            గోపాలకృష్ణయ్య - శంకరశాస్త్రుల జంట తరపున బిస్కట్లు పంపకం తరువాత - 6.40 కి సమీక్షా సమావేశం జరిగి, మాలెంపాటి అంజయ్య గారి నినాదాలు మ్రోగి, చల్లపల్లి సర్కిల్ ఇన్స్పెక్టరు గారు ఉపన్యసించాక –

            రేపటి కార్యక్రమం కోసం సాగర్ టాకీసు పశ్చిమోత్తర కూడలిలో కలవాలని నిర్ణయించారు!

            పాలు, నీళ్లుగా కలిపి వేసిరి

వీధులందే పర్వదినములు శ్రమను మిళితం చేసిచూపిరి

పండుగలనూ ఉత్సవాలను క్రొత్త భాష్యం చెప్పి చేసిరి

ప్రజావసరము సాంప్రదాయము పాలు, నీళ్లుగ కలిపి వేసిరి

నేటి బాటలు కార్యకర్తలు మేటిగానే తీర్చిదిద్దిరి!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  28.12.2024