3337* వ రోజు ....           29-Dec-2024

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు పర్యావరణ భంగకరం! రసాయన రహిత నార సంచుల వాడకం ఆదర్శనీయం!!

ఆదివారం (29-12-24) శ్రమదానం సందడే వేరు! - @3337*

         మరొకమారు సాగర్ టాకీసు ప్రాంతంలోనే. 4:23 కే 13 మందీ, అనంతరం ఒకరొకరుగాను, జట్లగానూ, చివరికి 5.30 కైనా సరే ఇద్దరు - ముగ్గురూ - వెరసి 46 మంది -  అదీ సొంతానీకే కాదు సుమా - ఊరి స్వచ్చ – శుభ్ర – సౌందర్య సాధన కోసం తోచినంత శ్రమించడం మామూలు సంగతా!

ఆ గంటన్నర సమయంలో :

1) బరువైన ఎండు మ్రానుల్నెత్తుతున్నప్పుడూ,

2) బైపాస్ వీధికి రెండు ప్రక్కలా పల్లంగా మారిన చోట రాతి ముక్కలు అమర్చి, మన్ను కప్పి చదును చేస్తున్నప్పుడూ,

3) సినిమా హాలు పశ్చిమోత్తరంగా ఏ పుణ్యాత్ములో డంపింగ్ యార్డుగా మార్చిన డ్రైపర్లూ, ఆహార వ్యర్ధాలూ, చెడిన కూరల వ్యర్ధాలూ కంపుగొడుతూ కడుపులో దేవుతున్నా వదలక ట్రాక్టర్లోకి చేరుస్తుండగానూ,

4) 10 నుంది చిత్ర ప్రదర్శనశాల ఎదుట గడ్డీ, పిచ్చి మొక్కలూ చెక్కుతుంటేనూ,

5) కట్టెల అడితీల వద్ద సర్పంచితో సహా ఆరేడుగురు పైన మంచూ - క్రింద నుండి దుమ్మూ క్రమ్ముతున్నా ఊడుస్తున్న వేళా,

6) పోస్టల్ ఉద్యోగి ఒంటరిగా డ్రెను దుర్గంధాన్ని భరిస్తూ డైన్ల జాయింటు చోట తుక్కులాగి, మురుగుకు పరుగులు నేర్పుతుండగానూ,

7) వార్డు మెంబరూ, మరో డజను మందీ చీపుళ్ళతోనూ, డిప్పల్తోనూ, కత్తులతోనూ శక్తి కొద్దీ పనులు చేసుకుపోతుండుగానూ,

8) ఇక్కడికి సుదూరంగా బందరు రోడ్డులోని అమరావతి ప్రభువుల ప్రహరీని నలుగురు సుందరీకర్తలు చిత్రాలంకరణ చేస్తుంటేనూ....

         ....ఇన్ని దృశ్యాలను చూసేవాళ్లకేమనిపిస్తుంది? ఈ నిస్వార్థ శ్రమ జీవన సౌందర్యాన్ని పాటల్లో - కవితల్లో కీర్తించాలనిపించదా? ఆ సందడి చూస్తే మనసు నిండదా?

6.50 కే మొదలైన సమీక్షా సభలో :

RTC డ్రైవర్ తోట నాగేశ్వరుని నినాదాలూ, డి.ఆర్.కె. డాక్టరు గారి వ్యక్తిత్వ వికాస వచనాలూ,  “గుంపుల కొద్దీ కార్యకర్తలు దశాబ్దానికి పైగా పొరపొచ్చాల్లేక - వర్గ భేదాల్లేక స్నేహంగా ఎలా పనిచేస్తున్నారనే రహస్యమూ వెలువడినవి.

         కాలం 7:00 అవుతున్నా ఇళ్లకెళ్లేందుకు ఎవరూ తొందరపడలేదు.

         రేపటి వేకువ పని చోటు సినిమా హాలు పశ్చిమ బైపాస్ రహదారిగా నిర్ణయింపబడినది!=

         దివ్యపథమును చూపగలిగిరి!

కలలు కనుమని కలాం చెప్పెను గ్రామ భవితను కలలుకంటూ

స్వచ్ఛ సుందర శుభ్ర వీధుల స్వయంకృషితో నిర్వహిస్తూ

గత పదేళ్లుగ స్వచ్ఛ - సుందర కార్యకర్తలు ప్రయత్నిస్తూ

దేశమునకొక మార్గదర్శక దివ్యపథమును చూపగలిగిరి!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  29.12.2024