3338* వ రోజు ....           30-Dec-2024

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!!

సహనం కోల్పోని శ్రమదానం - @ 3338*

            శ్రమదానం సోమవారం (30-12-24) వేకువది, 4.20 కే మొదలై, 6.18 దాక ప్రవర్థిల్లినది; చలి హుంకరింపులకు బెదరని 30 మంది కార్యకర్తలది; వరుసగా 3 వ నాడు కూడ సినిమా హాలు సంత - రైతు బజారు - పోలీసు క్వార్టర్ల చోటులకు పరిమితమైన 40 కి పైగా పనిగంటల కష్టమది!

            నేటి 2 వ, 3 వ వాట్సప్ ఫొటోలు గమనించారా? అవి సినిమాహాలు వద్ద నిన్న తాము శుభ్రపరచినా, మళ్లీ పుట్టుకొచ్చిన చెత్త కేంద్రాన్ని ఓర్పుతో కార్యకర్తలు బాగుచేసిన దృశ్యాలుకొందరి బాధ్యతారాహిత్యానికీ, కార్యకర్తల సహనగుణానికీ గుర్తులు!

            గత పదేళ్లలో ఈ వీధిని కార్యకర్తలెన్నిమార్లు బాగుచేసి, పేవర్ టైల్స్ పరచి, రంగులేసి, బొమ్మలు గీసి, కష్టించారో గుర్తుచేసుకొండి!

అనగననగ రాగ మతిశయిల్లుచునుండు

తినగ తినగ వేము తియ్యగుండు...

            అనే వేమన పద్యాన్ని గుర్తు చేస్తూ స్వచ్చంద శ్రమకారుల ఓర్పు అతిశయిస్తున్నది, ఒక్కొక్క వీధీ మెరుగౌతున్నది!

            సినిమాహాలు ఎదుట మురుగుకాల్వగట్టూ, ప్రహరీ వెలుపలి పెరిగిన గడ్డీ, పడున్న ప్లాస్టిక్ వికారాలు, రోడ్డు ప్రక్కన క్రుంగిన రంగురాళ్లూ సగం మంది కార్యకర్తల ప్రయత్నంతో శుభ్రపడినవి.

            అక్కడ నుండి దక్షిణంగా 50-60 గజాల మేర వీధి కాలుష్యాలు - అనగా దుమ్మూగుడ్డ ముక్కలూ, బళ్ల వ్యాపారాల వ్యర్ధాలూ, గాజు - ప్లాస్టిక్ సీసాలూ మరొక పది మంది కష్టంతో తొలగిపోయినవి!

            6.30 తర్వాత చూడండి ఆ వీధి ఎంత శుభ్రంగా పొందికగా, ఆహ్లాదకరంగా మారిందో! పోలీసు క్వార్టర్లు సైతం గతంలో కన్నా ఇప్పుడు మెరుగుపడలేదూ?

            నిన్న మన వాట్సప్ లోని PDF చూస్తే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి కార్యాలయ ఆవరణ ఎంత  ముచ్చటగా ఉందో తెలుస్తుంది.

            ఏ ఫలితమైనా మానవ శ్రమతోనే సిద్ధిస్తుంది.

            6.50 దాక జరిగిన సమావేశంలో ముందుగా వేల్పూరి ప్రసాదు గబగబా నినాదాలు ప్రకటించిన తరువాత నవంబరు 10-30 తేదీల మధ్యకాలపు ట్రస్టు జమా ఖర్చులు తెలిసినవి.

            రేపటి మన శ్రమ స్ధలం సాగర్ టాకీసు ప్రాంతమే!

            తెలుగు ప్రభుతా మేలుకొనవా!

కథలు కథలుగ కూర్చ వలసిన - కవితలెన్నో కట్టవలసిన

గ్రామ గామ్రం నేర్వవలసిన - కలుషములపై పొరవలసిన

స్వచ్ఛ సుందర కార్యకర్తల శ్రమ విహారం గుర్తురాదా!

తెలుగు ప్రభుతా మేలుకొనవా! తెలుగు యువతా ఆదుకొనవా!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  30.12.2024