సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!!
మంగళవారం (31-12-24) నాటి కార్యకర్తల బలగం 43 - @3339*
సదరు సంఖ్యాబలంలో పొరుగు పంచాయతి వారు 5 గురూ, శివరామపురీయులిద్దరూ, చివరి 20 నిముషాల్లో వచ్చిన నలుగురూ! ఐతే పనిచోటు స్థానికులొక్కరూ పాల్గొన లేదు - జనాబ్ మొహమద్ జానీ తప్ప!
ఇంత మంచులో – దురాక్రమిస్తున్న డిసెంబరు మాసపు చలిలో వీళ్లు ఏం సాధించినట్లు? వేకువ 3.30 కే లేచి వచ్చేది నిద్రపట్టకా? ఇళ్ల దగ్గర పనుల్లేకా... ?” అంటే :
సరైన గ్రామ పౌరులుగా తమ సామాజిక బాధ్యత వాళ్ళని ఠంచనుగా తట్టిలేపుతుంటుంది మరి! గ్రామ సామాజిక బాధ్యత తీర్చుకోవడంలోనూ, సమూహంగా శ్రమించడంలోనూ ఆనందం వాళ్ళని 3339* రోజుల్నుండీ నడిపిస్తుందట!
ఈ నెల తుది రోజున - 2024 సంవత్సరాంతాన ఇందరు కార్యకర్తలేం సాధించారో చూద్దాం రండి!
ముందుగా వాళ్లు కలుసుకొన్నది సాగర్ టాకీస్ జంక్షన్ కు 100 గజాల దూరంలో. ఇక అక్కడికి తూర్పు పడమరలుగా బైపాస్ మార్గంలో 200 గజాల దాక జరిగింది చిరస్మరణీయ శ్రమ వేడుకే!
నలుగురు పారల్తో, ముగ్గురు గునపాలతో వీధి మార్జిన్ గుంటల్ని సరిజేస్తూ, ఏడెనిమిది మంది చీపుళ్లతో ఊడుస్తూ, అక్కడి ఎలక్ట్రికల్ షాపు ఎదురుగా ఆ మినీ డంపు ఎందుకొచ్చిందో తెలియదు – 5 గురు గంటసేపు దాన్నెత్తి ట్రాక్టర్ లో నింపుతూ, సిమెంటు రోడ్డు ప్రక్క గుంటల్ని రాతి ముక్కల్తో పూడుస్తూ, మొత్తానికి 4.18 నుండి 6.15 దాక శ్రమిస్తూనే ఉన్నారు.
కార్పెంటర్ సతీషు, పినిశెట్టి నిరంజనుడు రాళ్ళను మలాటుతో చితక్కొట్టి 6.30 కి గాని అస్త్ర సన్యాసం చేయలేదు.
ఈలోపు సరదా కబుర్ల - కాఫీ సేవనాల కార్యక్రమం ముగిసింది.
ఇక్కడికి 1½ కిలోమీటర్ల దూరాన – 5 గురు కుఢ్య చిత్రకారులు సజ్జా వారి వీధిలో సుందరీకరణలో మునిగి తేలారు. 2 మార్లు ఇద్దరు గుర్తు చేయగా పని ముగించి, 6.20 కి బైపాసు వీధిలోకి వచ్చి, ప్రధాన శ్రమజీవన స్రవంతిలో కలిశారు.
ఈ పనులన్నీ చూస్తే, పరిశీలిస్తే ఏమర్ధమౌతున్నది? ఇది ఐచ్చికంగా – ఆత్మ తృప్తికరంగా చేస్తున్న ఊరి బాధ్యతనా - లేక బలవంతపు బ్రాహ్మణార్థమనా?
తుది సమీక్షా సభ ముగిసి, కార్యకర్తలు ఇళ్లకు చేరే సరికి 7.00 దాటే ఉంటుంది!
రేపటి వీధి శుభ్రతల కోసం క్రొత్త సంవత్సరంలో మనం కలుసుకోదగింది భగత్ సింగ్ దంత వైద్యశాల వద్ద!
ఒళ్లు హూనం చేసుకొంటూ
ఎంతగా శ్రమదాతలైనా ఇన్ని ఏళ్లా వీధి సేవలు?
ఎంత సేవాధురీణులైనా మురుగు - బురద - బజారు పనులా?
పత్రికలకై మూడు రోజులు పని నటిస్తే చాలదేమో!
ఒళ్లు హూనం చేసుకొంటూ ఉద్యమించే ఖర్మమేమో!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
31.12.2024