సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!!
3355* వ శ్రమ ముహూర్త బలం - @4.18 AM.
ఈ గురువారం (16.1.25) నాటి గ్రామ వీథి శ్రమకారులు 26 ముంది – బైపాస్ మార్గపు అడపా బాబూరావు, మూడేళ్లగా అస్పత్రిలో ఉద్యోగిస్తున్నా ఈ వేకువ మాత్రమే బోణీ కొట్టిన నర్సు బొంతు సౌభాగ్యవతితో సహా! ఉపమార్గంలో 1 వ, 2 వ నారాయణరావు నగర్ అడ్డ రోడ్ల దాక కనిపిస్తున్న స్వచ్చ - శుభ్రతలు 2 గంటల శ్రమ ఫలితాలే!
కొందరు వీధి మార్జిన్ల ఎత్తు పల్లాల్ని సరిచేసినా, రహదారి మార్జిన్ ఉద్యానాన్ని తీర్చిదిద్దినా, ఎక్కువగా పెరిగిపోతున్న పూల చెట్ల కొమ్మల్ని కత్తిరించి, పాదుల్లో తుక్కులేరి అక్కడి అంద చందాలకు మెరుగులు దిద్దినా, ఇద్దరు ప్రసాదులూ, పోస్టలు శ్రీనూ గంటన్నరకు పైగా పలుగూ – పారా – దంతే - డిప్పలు వాడి, 10 గజాల బారునా సిమెంటు రోడ్డు మీది మట్టిని తొలగించినా,
ఇంకా ఈ బరువు పనులకు తోడు 4 గురు చీపుళ్లతో 150 గజాల వీధి దుమ్మూ – ధూళీ ఊడ్చేసినా, ముగ్గురైతే 2 వ అడ్డ రోడ్డు వంతెన దగ్గర రకరకాల కశ్మలాల్ని ప్రోగులు చేసి, ఆ చోటుకు క్రొత్త అందాలు సమకూర్చినా,
కోమలానగర్ కు చెందిన విశ్రాంత ఉద్యోగులిద్దరు సిమెంటు బాట అంచుల్ని మెరక చేసి పటిష్ట పరచినా, ఒక కమ్యూనిస్టు వీధి కార్యకర్త మోకాలు, నడుమూ బాగా సహకరించకున్నా ట్రాక్టరెక్కి తుక్కుల్ని సర్దుతున్నా, గత 2 రోజులు విశ్రాంతి తీసుకొన్న 85 ఏళ్ల పరమ వృద్ధ వైద్యుడు ఆలస్యంగానైనా వచ్చి, చేతులు కలిపినా....
ఇదంతా స్వచ్ఛ సుందరోద్యమ మహిమే! ఒక సమష్టి సామాజిక సదాచరణమే! గ్రామ సమాజం పట్ల కార్యకర్తల నిబద్ధతే! వీరిలో ఏ ఒక్కర్నీ ఇళ్లకెళ్లి వేకువ 3.30 కే తట్టిలేపి, బ్రతిమాలి ఈ మంచులో, చలిలో ఈ మురికి పనులకు ఎవరూ తీసుకురాలేదు! అలా తెస్తే జరిగే పారిశుద్ధ్య కృషి వేఱుగా ఉంటుంది – ఇన్ని వేల పనిరోజులపాటీ కార్యక్రమం నడిచేదే కాదు!
అందుకే మరి - మన సీనియర్ స్వచ్చ వైద్యుడు ప్రతిరోజూ తుది సమావేశంలో ఆనాటి అద్భుత కృషికి ఆశ్చర్యపోతూ సమీక్షించే ది! 2-3 రోజుల ఎడంతో ఈ వేకువ శ్రమలో పాల్గొన్న శివరామపురస్తుడైన మల్లంపాటి ప్రేమానందుని నినాదాల్ని అనుసరించే అవకాశం ఈ పూట కలిగింది.
చల్లపల్లికి చెందిన, హైదరాబాద్ నివాసులైన అన్నవరవు రామమోహనరావు గారు ప్రతి సంక్రాంతికి వలెనే నిన్న ఆన్లైన్ లో 50,000/- రూపాయలను మన ట్రస్టుకు బదిలీ చేశారు.
విశ్రాంత పోలీస్ ఉన్నతోద్యోగి శ్రీ బత్తిని శ్రీనివాస్ గారు తమ శ్రీమతి దివంగత ఉమాదేవి గారి 5000/- విరాళ ఆనవాయితీని కొనసాగిస్తూ ఈరోజు ఆ మొత్తాన్ని బదిలీ చేశారు.
పై ఉభయ దాతలకు స్వచ్చ సుందర ఉద్యమం తరపున ధన్యవాదములు.
రేపటి వేకువ కూడ దివిసీమ పాలిటెక్నిక్ ప్రాంతంలోనే - మన పారిశుద్ధ్య పనులు!
వెలితి బాధిస్తు౦దేల మనకు?
మనసేదో వైకల్యము శ్రమవేడుక చూడనపుడు
వీధి శుభ్రతలు చేయక నిద్రపట్టదప్పుడప్పుడు
ఇందరితో కలిసి మెలిసి కాఫీలను సేవించని
రోజంతా ఏదో వెలితి బాధిస్తు౦దేల మనకు?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
16.01.2025