3370* వ రోజు ....           31-Jan-2025

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని – వాడబోం! వాడబోం!

నార చేతి సంచుల్నే - వాడతాం! వాడ తాం!!

ఇది 3370* వ శ్రమదానం!

         శుక్రవారం – క్రొత్త సంవత్సర జనవరి మాసాంతం - వీధి పెదకళ్ళేపల్లి – చోటు విజయక్రాంతి, ఒకప్పటి శ్రీనీత దాణా కర్మాగారం – కార్మిక సోదరులు 28 మంది.

         ఈ ఉదయం కూడ ప్రాత కార్యకర్తలే, కాస్త అటూ ఇటూగా నిన్నటి పనులే, మైకు పాటలు మాత్రం మారినవి. ఐతే - చేస్తున్న కార్యకర్తలకూ, చూస్తూ మురిసిపోతున్న నాలాంటి ఇద్దరు ముగ్గురికీ వీధి శ్రమ పనులు ఎప్పుడూ వింతగానే ఉంటాయి. “ఇన్నేళ్లు  - ఇన్నాళ్లు - ఇందరు పరోపకారులు - ఊరికి ప్రయోజనకరమైన ఈ కార్యక్రమం ఎలా చేయగలుగుతున్నారా” అని!

         క్రాంతి కళాశాల వీధి దక్షిణ - పశ్చిమ డ్రైన్ను కార్యకర్తల చేయిపడకముందూ, గంటన్నర తర్వాతా గమనించారా? 16 గురి కాయకష్టంతో అక్కడి తొలగిన వ్యర్ధాలూ, వాటి కంపు 50 డిప్పల పైమాటే!

         దానికి కాస్త దూరంగా రోడ్డుకు పడమరగానే ఇటీవల ఏలినవారు క్రొత్తగా వేసిన ఎత్తైన రోడ్డు ప్రక్కన పల్లం మాటేమిటి? ఈ పూట ఆరేడుగురు డ్రైను గట్టున ఎండు మట్టినీ, రాతి ముక్కల రద్దునూ త్రవ్వి, మోసి, గుంటను పూడ్చకపోతే, వచ్చేపోయే వాహనాల్నెక్కించి చదును చేయకపోతే ఆ రోడ్డు భద్రత ఏమౌతుంది?

         ఇంకొంచెం దక్షిణంగా జాస్తి - మెండు అనే ఇద్దరే బాటకు తూర్పు పడమరల్లో ఎన్నెన్ని పిచ్చి మొక్కల్ని తొలగించారో పాత డ్రైనులోని ఎంత చెత్తను సేకరించారో చూశారా?

         ఇంట్లో సొంత పనుల్ని వాయిదా వేసి, ఇంత దూరం వచ్చిన మహిళలు 150 గజాల బాటనెంత కష్టపడి ఊడిస్తేనో గదా – ఇప్పుడీ మాత్రం అందంగా కనిపిస్తున్నది?”

         ఇవన్నీ బొత్తిగా తెలియకనా - ఈ కళాశాలల వారూ, ఇక్కడ గృహస్తులూ, మిల్లు యాజమాన్యాలూ కనీసం ఇక్కడ జరిగే పారిశుద్ధ్యంలో పాలుపంచుకోనిది?

         6.30 వేళ – ట్రాక్టరంతా చెత్తతో నిండిన సమయాన - కాఫీలు ముగించి కళాశాల ప్రహరీ ముందు నిలిచి, స్వచ్చోద్యమ రధసారధి అభినందలందుకొని, ఆకుల దుర్గాప్రసాదుని నినాదాలు విని, గురవయ్య సూక్తులాలకించి,

          రేపటి శ్రమదాన స్థలమీ P.K. వీధిలోననే తెలుసుకొని, నేటి శ్రమను ముగించారు!

         పోజు పెట్టలేదు మనం

ఏదో సాధించామని విర్రవీగ లేదు మనం

ఎవరినొ ఉద్ధరించినట్లు పోజు పెట్టలేదు మనం

మన బాధ్యత తీర్చేస్తాం కొంత తృప్తి పొందేస్తాం

ఊరి ఋణం కాస్తయినా తగ్గించామనుకొంటాం!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   31.01.2025