3371* వ రోజు ....           01-Feb-2025

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని – వాడబోం! వాడబోం!

నార చేతి సంచుల్నే - వాడతాం! వాడతాం!!

శనివారం(1-2-25) వేకువ కాలపు 3 ముఖ్య సంగతులు - @ 3371*

         1 వ విశేషం - నేటి 30 మంది వీధి శ్రామికులతో కళ్ళేపల్లి బాటలో ఒక మహిళ -కొల్లి దివ్య కలవడమూ, 10 నిముషాల్లోనే ప్రాత కార్యకర్తలాగానే పనులు చేసుకుపోవడమూ!

         2 వ పని ప్రత్యేకత – దాని కష్టమూ, నైపుణ్యమూ, శ్రద్ధా వివరించాలంటే విడిగా ఒక వ్యాసమే వ్రాయాల్సి ఉంటుంది! చాలా ఏళ్ళ నుండి కార్యకర్తలు ఆ పని చేస్తున్నా – ఈ కళ్ళేపల్లి బాటలో - గత 12 రోజులుగా మరీ సీరియస్ గా, దీక్షగా శ్రమిస్తున్న సదరు విషయమేమంటే - R&B లేదా జిల్లా పరిషత్ వారు ఇటీవలే పరచిన తారు రోడ్డుకు ఇరుప్రక్కలా వేసిన బరంతు సరిపోదని – స్వచ్ఛ కార్యకర్తలు దానిని సరిచేసే బాధ్యతను తీసుకోవడమూ!

         ఈ వేకువ నేను కూడ కొంత సమయం పలుగుతో - డిప్పతో కష్టించాను గనుక ఇదెంత బరువు పనో తెలిసొచ్చింది. మరి – గంటన్నర పైగా – పలుగుతో త్రవ్వి, పారల్తో రాయి - మట్టీ మిశ్రాన్ని గోతుల్లో నింపి, చెమటలు క్రక్కిన  ఇద్దరు రైతులూ, ఒక ఆకుల వ్యాపారీ ఈ పాతిక గజాల రోడ్డును పటిష్ట పరచేందుకెంత శ్రమించి ఉంటారు? అందులోనూ దేసు మాధురి అనే యువతి అంత బరువు డిప్పలెలా మోసిందో – ఆమె ముఖంలో అలసట బదులు అంత సంతోషమేమిటో తెలుసుకు తీరాలి!

 

         రోడ్డు అంచుల్ని బలపరచే పనీ, వాటి మన్నికకెంత అవసరమో – అమెరికా నుండి ఒక నాదెళ్ల సురేషూ, మొవ్వ గ్రామస్తుడు మండవ నాగేశ్వర్రావులే బాగా చెప్పారు!

         ఇక 3 వ ముఖ్య సంగతి : దీన్ని కారకర్తల తుది సమావేశంలో డాక్టరు  DRK గారు ప్రస్తావించగా, వాలంటీర్లంతా చప్పట్లు మ్రోగించారు [ఇలాంటి సమాచారాలు చల్లపల్లిలో కాబట్టీ, చెపుతున్నది విశ్వసనీయతగల వ్యక్తి కనుకా - విని మెచ్చేది కూడ ఆదో రకం వెర్రిమాలోకాలు కావడానా సరిపోయింది గాని - అన్ని చోట్లా ఇలా కుదరదు అభాసుపాలవుతుంది!]

         అదేమనగా : దేవరకోట గ్రామస్తుడూ - అమెరికాలో మంచి శస్త్రకారవైద్యుడూ ఐన దోనేపూడి శరత్ గారి వితరణ గురించి! ప్రతి ఏటా పాతిక నుండి 50 వేలు ఈ స్వచ్ఛ  కార్యక్రమానికిచ్చే Dr.శరత్ గారు నిన్న 75 వేల చెక్కును DRK గారి కందించారట! అమెరికాలో తాను నివసించిన 12 కోట్ల విలువ చేసే పెద్ద భవనాన్ని ప్రభుత్వానికాయన అప్పగించాడట!

         ఈ గ్రామ స్వచ్ఛ సంస్కృతీ సాంప్రదాయానుసారంగా నేటి నినాదాలను పద్ధతిగా పలికినది కోట పద్మావతి గారు.

         రేపటి శ్రమ కూడ ఈ కళ్ళేపల్లి బాటలోనే - ఒక పంట కాలువ సమీపానే!

         స్వస్తతలకు మూలధనం!

విచ్చలవిడి వ్యర్ధాలతొ - పెచ్చరిల్లు దోమలతో

కాలుష్యం భూతాలకు పెరుగుతున్న కోరలతో

సతమతమగు పల్లెలకిక చల్లపల్లె ఆదర్శం

శుచీ, శుభ్ర – హరిత శోభ స్వస్తతలకు మూలధనం!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

 

   01.02.2025