సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని – వాడబోం! వాడబోం!
నార చేతి సంచుల్నే - వాడతాం! వాడతాం!!
ఆదివారం వేకువ P.K., వీధంతా శ్రమ సందడే సందడి@ 3372*
2-2-25 వేకువ 4.18 కే డజను మందితో మొదలయింది గాని, సందడి పీక్ కు చేరింది 5-00 తరువాతే! 6.00 తర్వాత లెక్కించి చూస్తే కార్యకర్తల బలగం 41 గా తేలింది - 10 మంది మహిళామ తల్లులతో సహా! ఇందులో ఒకామైతే మరీ విడ్డూరం – ఆలస్యమైపోతున్నదనే బెంగతో ఈ కిలోమీటరు దూరం శ్రమ స్థలికి 40/- చెల్లించి, ఆటోలో వచ్చింది ! అరగంటైనా శ్రమదానం చేయపోతే ఆమెకు నిద్రపట్టదు మరి!
జరిగిన వీధి పనుల సంగతి కొస్తే- వాటి కెప్పుడు లోటు జరిగింది గనుక ! అసలే బ్రహ్మ కాలం - చేసేదేమో ఒంటరిగా కాక - ఒక ఆశయం కోసం పదకొండేళ్లుగా ఊరి కోసం శ్రమించే వ్యక్తుల సమూహం! అక్కడికి చేరుకో గానే ప్రతి ఒక్కరిలో వచ్చేస్తుంది శ్రమ పూనకం ! మరి తోక ముడవకేం చేస్తుంది వీధి కాలుష్యం !
మొత్తం 15 మంది కాబోలు ఈ పూట కూడ రోడ్డు అంచుల భద్రతకే శ్రమించారు - 3 గ్రూపులుగా - 3 చోట్ల ! ఈ పనెట్లా ఉంటుందంటే - ముందుగా పల్లంలో ఇటుక, గులక తదితర ముక్కలు పేరుస్తారు, వాటి మీద దగ్గర్లో దొరికిన మట్టిని త్రవ్వి, మోసుకొచ్చి, చదునుగా వేస్తారు, అటుగా వచ్చే- పోయే వాహనాలతో డ్రైవర్ల నడిగి తొక్కిస్తారు. ఈ అర కిలోమీటరు రోడ్డు అంచుల్ని తూము వారు తీసిన ఫొటోల్లో చూస్తే మీకే అర్థమౌతుంది-వాళ్లసలు స్వచ్ఛ కార్యకర్తలా లేక రోడ్డు పనివాళ్ళా అనేది!
ఇక- పంట కాల్వ సమీపాన 40-50 మీటర్ల డ్రైన్ లోనే పిచ్చి చెట్లు ముళ్ళ మొక్కలూ, కంపలూ, తీగలూ, వాటి మధ్య ప్లాస్టిక్ గాజు సీసాలూ 20 మంది కష్టంతో అదృశ్యమై ట్రాక్టర్ లోకి ఇమిడిపోయాయి!
సమీక్షా సభా కార్యక్రమం మాత్రం ఆలస్యమై కొందరిళ్లకు చేరేసరికి 7.30 కూడ అయింది.
రేపటి శ్రమ స్థలం కూడ ఇదే P.K.పల్లి మార్గమే!
శ్రమకు ఎవ్వరు విలువ కట్టిరి
రాళ్లు పేర్చిరి- మట్టి కప్పిరి – ట్రాక్టరుతో తొక్కించి చూసిరి
పలుగుతోటి కుళ్లగించిరి - పారతో ఆ మన్ను ఎత్తిరి
డిప్పతో ఆ మట్టి మోసిరి- రోడ్లు మన్నిక రూఢి చేసిరి!
మరి- స్వచ్ఛ సుందర కర్మ వీరుల శ్రమకు ఎవ్వరు విలువ కట్టిరి!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
02.02.2025