3373* వ రోజు ....           03-Feb-2025

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని – వాడబోం! వాడబోం!

నార చేతి సంచుల్నే - వాడతాం! వాడతాం!!

కార్యకర్తల సంఖ్య తక్కువా, పని ఎక్కువా! -3773*

         సోమవారం వేకువ (3-2-25)  ఒక ప్రక్క మంచూ, చలీ గడగడలాడిస్తుంటే -  పెదకళ్లేపల్లి రోడ్డు మీదే 20 మంది సామాజిక శ్రమదాతల శ్రమోత్సాహం!

         వాళ్ళ కష్టానికి సాక్ష్యంగా పంట బోదె వద్ద పూడి, చదునైన వీధి మార్జిన్ పల్లమూ, దక్షిణ దిశగా సకల కల్మషరహితంగా మరో 100 గజాల మార్గం,

         బాట పడమటి డ్రైన్ లో దిగి, పిచ్చి చెట్ల పని పట్టిన జోడు కత్తుల విశ్రాంతోపాధ్యాయుడూ, అంబటి శంకర్రావు గైరుహాజరీతో రోడ్డు పడమటి మార్జిను గుంటను పూడ్చిన ‘కోడూరు’ కార్యకర్తా, తన భారీకాయాన్ని వంచి పసిచేసుకుపోయిన కొర్రపాటి వీరుడూ,

         ఇంకా - అటు గొర్రూ, ఇటు చీపుళ్ళతో వీధి శుభ్రతను సాధించిన ముగ్గుర్నలుగురు మహిళా శ్రామికులూ, చేస్తున్న పనిని మధ్యలో కాస్త ఆపి శ్రమ జీవన సౌందర్యాల్ని   కెమేరా కంటిలో బంధిస్తున్న తూము మహాశయుడూ,

         ___ఇలా నేటి 2 గంటల వీధి పారిశుద్ధ్య క్రీడలో ఎన్నో గుర్తించదగిన అంశాలు!

         పావుగంట పలుగూ – పార పనికే నా మోకాళ్ళూ, గూళ్ళూ నొప్పి చేశాయే – గంటకు పైగా బరువైన మలాటుతో కాంక్రీటు దిమ్మల్ని పగలగొట్టిన  కస్తూరి మొనగాడూ, పనిలో దిగితే ఇక ఒళ్ళు తెలియని సజ్జా మహాశయుడూ, బృందావనుడూ, ఉరుకు – పరుగుతో పనిచేసే రాజు – పసుపులేటి, అంతంత బరువు పనులెలాచేస్తారో మరి!

         “మట్టి త్రవ్వి, మోసే పనికి ఒకరు రండి” అని పిలిచారో లేదో - చకచకా నలుగురు వచ్చి పని అందుకొన్నారు!

         ఇందుకే గదా – 30-40 ఊళ్ళలో క్రమంగా ఆగిపోయిన శ్రమదానాలూ, అర్ధాంతరంగా ఆయా చోట్ల నిలిచిపోయిన పారిశుద్ధ్యాలూ ఈ చల్లపల్లిలో మాత్రం చెక్కు చెదరక 11 ఏళ్ళ తర్వాత కూడ గెలుస్తున్నది?

 

         నేటి సమీక్షా సభను కొంచెం మార్చిన నినాదాలతో ప్రారంభించినది నేనైతే, రోడ్డు ప్రమాదాలను ప్రస్తావించినది DRK గారూ!

         రేపటి శ్రమదానం కోసం నాగభూషణం గారి ఇంటి ఎదుటే కలుసుకొందాం! (పెదకళ్లేపల్లి రోడ్డే.)

         ఇదేగద కొంగ్రొత్త సంస్కృతి

“ఊరి మంచికి గంట సమయం ఓర్పుగా పనిచేయుటొకటీ,

సమాజానికి పడిన అప్పును సర్దుబాటొనరించుటొకటీ,

మంచి పనితో ఉషోదయమ్మున మనోల్లాసం పొందుటొకటీ

ఇదేగద కొంగ్రొత్త సంస్కృతి - ఇందులోన అసాధ్యమేమిటి?

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   03.02.2025