సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని – వాడబోం! వాడబోం!
నార చేతి సంచుల్నే - వాడతాం! వాడతాం!!
మంగళవారం (4.2.25) నాటి వీధి బాగుదల కృషి - @3374*
కృషి 4.17 నుండి 6. 20 వరకు జరుగుతూనే ఉండెను. పని జరిగిన ప్రాంతం పెదకదళీపుర మార్గంలో NH-216 దగ్గరగా నాగభూషణం గారి ఇంటికి ఉత్తర దక్షిణాలుగా..
క్రొత్త ప్రభుత్వకాలంలో ఇటీవల వేసిన రోడ్డు బాగానే ఉన్నది. కాని, చాల చోట్ల అంచుల్లో మాత్రం బరంతు చాలక కొంత అసౌకర్యంగానూ, ముందు ముందు బలహీనపడే ప్రహదమున్నది. అందువల్లనే గత 10 రోజులుగా కార్యకర్తల్లో సగం మంది ఆ లోపాల సవరణకే కష్టిస్తున్నారు! ఈపూట కూడ బాటకు తూర్పు, పడమర అంచుల్లోని గుంటల పూడిక కోసం వాళ్లు పలుగూ, పారా, డిప్పలకు పనీ చెప్పారు – 20 గజాల మేర పల్లాల్ని సరిదిద్దారు.
నిన్నా, ఇవాళా ట్రాక్టర్ల కొద్దీ వ్యర్ధాలు బదులు ½ ట్రాక్టరు మాత్రం దొరకడానికి కారణం ఆ వీధికే చెందిన ఫీడ్ మిల్లు యజమాని సబ్బినేని ప్రసాదు. ఆయన ఆదివారం నాడు 8 మంది కూలీలతో వ్యర్ధాల్ని చాల వరకు ఏరించాడు.
అందువల్ల ఈ వేకువ ఒక్క గోతానికే ప్లాస్టిక్ - గాజు సీసాలు పరిమితమయ్యాయి! వీధి నూడ్చిన నలుగురి పని కూడ కాస్తంత తగ్గింది. కాకపోతే - వేగవంతమైన వాహనాల వల్ల అప్పుడప్పుడూ పని మందగించింది!
సరే - మందమో చురుకో - ఏదైనా ఈ స్వచ్చంద శ్రామికులు మహాశివరాత్రి కన్న ముందే వీలైతే వెంకటాపురం దాక - లేకుంటే కనీసం శివరామపురం దాక ఈ 2 లేక 3 కిలోమీటర్ల రహదారి కాలుష్యాల, రోడ్డు బరంతుల, డ్రైన్ల పరిశుభ్రతకు కట్టుబడి ఉన్నారు! శివరాంపుర ప్రాత కార్యకర్తలైనా వచ్చి ఈపనుల్లో కలిస్తే మంచిదే!
నిన్నటి మన వాట్సప్ లోని వార్త చూసే ఉంటారు గదా – చల్లపల్లి పట్ల మన దేవాంగ సోదరుల బాధ్యతను? హిందూ శ్మశాన సౌకర్యాల కోసం 120 కుటుంబాలూ ఒక్క త్రాటిపైకొచ్చి, శక్తికి మించి చందాలేసి 2,85,000/- ను మన డాక్టర్లకు తెచ్చి యిచ్చిన విజ్ఞతను?
తూము వారి నినాదాల తర్వాత స్వచ్ఛ కార్యకర్తల అభినందనలు ఆ బాధ్యులకు ఈ సభ నుండి దక్కాయి!
రేపటి శ్రమ సంఘటనలు కూడ – శివరాంపురం రోడ్డులోని నాగభూషణం గారింటి వద్ద నుండే!
ఈ సందడి, పని దూకుడు
ఈ సందడి, పని దూకుడు, ఇందరితో సల్లాపము,
పరస్పరం అభివాదము, స్వచ్ఛతకై ఆరాటము,
2 గంటలకు పైగా సామూహిక సత్కార్యము..
ఇవే గదా వేల నాళ్ల శ్రమజీవన విధానములు!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
04.02.2025