సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని – వాడబోం! వాడబోం!
నార చేతి సంచుల్నే - వాడతాం! వాడతాం!!
నేటి (బుధవారం – 05.02.2025) తో 3375* నాళ్ళ శ్రమదానం!
ఈ వేకువ కూడ మళ్లీ ఆదే ఉత్సాహం 4.18 కే! ఆదే శివరాంపురం రోడ్డు – ఒకప్పటి సారా విక్రయ కేంద్రం వద్దే! 11 మందితో మొదలైన 3 రకాల వీధి మెరుగుబాటులు చివరగా చేరిన గోపాలకృష్ణునితో 28 మందిగా 6. 45 కు ముగిశాయి.
మూడు విధాల పనులేమంటే :
1) ఖాళీ స్థలంలోని గడ్డీ, చెడు మొక్కలూ, కొబ్బరి బొండాలు వంటి సకల కశ్మలాల తొలగింపు. ఇందుగ్గాను ఆరేడుగురు శ్రమించి, ఆ వెడల్పాటి చోటును చూడచక్కగా మార్చుట.
2) మరింత కష్టమైన వీధి ఉభయ మార్జిన్ల పల్లాలను సుమారు 30 గజాల మేర పూడ్చుట, ముఖ్యంగా రోడ్డు పడమటి ప్రక్కన చూడండి - గజం వెడల్పు పెరిగింది. డ్రైను మురుగు మట్టిని త్రవ్వడమూ, పారల్తో డిప్పలు నింపడమూ, ఇద్దరవి మోసుకుపోయి అవసరమైనంత మేరకు సర్దడమూ!
వీళ్ళ కష్టాన్నీ, దూరదృష్టితో చేస్తున్న వీధి విస్తరణనూ చూసి, ఉత్సాహించిన ట్రాక్టర్ల వారు ఆ మట్టి పెళ్లల్నీ, రాతి రద్దునూ త్రొక్కించడమూ!
ఏదో యాదాలాపంగా అటుగా వెళ్తే కాదు, కాస్త పరిశీలనగా ఈ 1 కిలోమీటరు రోడ్డును చూస్తే ఎవరైనా ఈ అందం వెనక 12 రోజుల – ఐదారు వందల పని గంటల శ్రమను పసిగట్టగలరు!
“ఆ మహిళలెంతగా శ్రమించి ఊడిస్తే ఇవాళ్టి 150 గజాల వీధి పరిశుభ్రతలు దక్కాయో ఉహించండి!
వీధి తూర్పు డ్రైన్లో పడిపోయిన చెట్టునూ, గడ్డీ, వ్యర్ధాల్ని తొలగిస్తున్న ఐదారుగురి ప్రయాత్నాన్ని అర్ధం చేసుకోవాలి?
నేటి శ్రమ ఫలితమైన ట్రాక్టరు నిండా వ్యర్ధాల్ని చూసుకోవాలి!
పదేళ్లకు పైగా ఈ గ్రామ సామాజిక సేవా స్ఫూర్తిని ఈ కార్యకర్తలెలా నిలబెట్టుకోగలుగుతున్నారా అని ఆశ్చర్యపడాలి!
అదేంటో – క్రొత్తరకంగా BSNL నరసింహారావు చెప్పిన నినాదాలతో మొదలైన తుది సమావేశం - ఎక్కడో తెలంగాణ వనపర్తిలో మురళి దంపతుల సభలో స్వచ్ఛ చల్లపల్లి శ్రమదాన ప్రస్తావననూ, టాటా ధార్మిక సంస్థ వారు దశాబ్ద కాలపు వేకువ శ్రమ సంధ్యాసాధ్యాలను వాకబు చేయడాన్నీ DRK గారు ప్రస్తావించుటతో ముగిసింది!
రేపటి వేకువ మనం ఆగేది నాగభూషణం గారి ఇంటి వద్దా,
పనులు చేసేది NH216 వరకూ అని తెలిసింది!
ఏమాయలు దాగున్నవొ
మానేద్దామనుకొంటునె మళ్లీ మళ్లి వస్తారట!
గాయమైన చేత్తోనే కత్తిపట్టి పనికి దిగుట!
మోకాళ్లకు, నడుములకూ బెల్టుపెట్టి పనిచేయుట!
ఏమాయలు దాగున్నవొ ఈ స్వచ్చోద్యమం వెనుక!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
05.02.2025