సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని – వాడబోం! వాడబోం!
నార చేతి సంచుల్నే - వాడతాం! వాడతాం!!
NH216, P.K. పల్లి రోడ్ల జంక్షన్ కాలుష్యాలపై దాడి - @3377*
శుక్రవారం వేకువ NH216 కు దగ్గరగా 7-2-25 వ నాడు నదరు దాడికి పాల్పడిన వారు 29 మంది స్వచ్ఛ కార్యకర్తలు! ఆ 150 గజాల వీధి చేసిన తప్పేమంటే:
- వాళ్లు ఏ 9 ఏళ్లనాడో నాటిన చెట్ల కొమ్మలు ఒక పద్దతి పాడు లేకుండా రోడ్డు మీదికి చొచ్చుకురావడమూ,
- తూర్పు ప్రక్క డైన్ లోకి పొలం నీరు చేరి, అక్కడ పెరిగిన గడ్డీ, కొన్ని పిచ్చి మొక్కలూ, ప్లాస్టిక్ - గాజు వస్తువులూ పడి ఉండి, అసహ్యంగా కనిపించడమూ,
- దక్షిణంగా పూర్వపు సారా కొట్టు వద్ద చాల రకాల వ్యర్ధాలు ఇష్టారాజ్యంగా వికృతంగా పడి ఉండడమూ,
- రోడ్డు దక్షిణపు పాతిక గజాలు పల్లంగా ఉంటే కొన్నాళ్లకది భారీ వాహనాలతో ఛిద్రంకావచ్చనే అనుమానమూ,
- రోడ్డు బారునా, మార్జిన్లంతా ఆకులు, కొమ్మ రెమ్మల్తో అందవిహీనంగా కన్పించడమూ.....!
మరివన్నీ చూస్తూ తక్కిన గ్రామస్తుల్లా మిన్నకుండి పోతారా స్వచ్ఛ సైనికులు?
గోనె సంచికి సరిపడా గాజు – ప్లాస్టిక్ వ్యర్ధాలేరి,
మర్యాదగా పెరగని చెట్ల కొమ్మల్ని శిక్షించి, డ్రైను మట్టి త్రవ్వి, రోడ్డు అంచుపల్లాన్ని పూడ్చి, రోడ్డు భద్రతను కాపాడి, వైశాల్యాన్ని పెంచి, మళ్ళీ సమస్త వ్యర్ధాల్నీ ట్రాక్టరులో నింపే సరికే 4.17-6.17 నడిమి 2 గంటలూ ముగిసినవి.
ఒక ప్రక్కన విజృంభిస్తున్న మంచూ, రోడ్డంట వేగంగా వచ్చి వెళ్తున్న వాహనాలను కాచుకోవడమూ తప్పడం లేదు.
స్వచ్ఛంద శ్రమలో పునఃప్రవేశించినందున శివరామపురీయుడైన BDR ప్రసాదుకు నినాదాల అవకాశం దక్కినట్లున్నది. మరొకమారు ఉడత్తు నళిని ద్వారా నాదెళ్ల సురేష్ పంపిన చాక్లెట్లు కార్యకర్తలందుకొనిరి.
ఈ సాయంత్రం 6.00 కు పద్మావతి ఆస్పత్రిలో మనకొక ముఖ్య సమావేశమున్నట్లు ఈ ఉదయం DRK గారు ప్రస్తావించలేదు. కానీ దాని ప్రాధాన్యత దృష్ట్యా ఏకరూప దుస్తులతో అచటికి వచ్చి, గత నెలలోని మన అందరం వెలిబుచ్చిన అభిప్రాయాలనూ, వీడియోలను చూడవలసి ఉన్నది.
రేపటి వేకువ పెదకళ్ళేపల్లి రోడ్డులోనే NH 216 కు దక్షిణంగా మనం కలువవలసి ఉన్నది!
30 వేలకు పైగా మొక్కలిట్లు
అందరికీ నీడనిచ్చు - ఆహ్లాదము పంచిపెట్టు –
మనసుల నుల్లాసపరచు - మంచి పూల నందించే
30 వేలకు పైగా మొక్కలిట్లు నాటి పెంచు
స్వచ్ఛోద్యమ కారులార! సాష్టాంగ ప్రణామములు!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
07.02.2025