సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని – వాడబోం! వాడబోం!
నార చేతి సంచుల్నే - వాడతాం! వాడతాం!!
3379* వ వీధి శ్రమ ఆదివారం (9-2-25) నాటిది!
కార్యకర్తల లెక్క 50 కి పెరగడానికదొక కారణం కావచ్చు. ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాల నుండి దాసరి లక్ష్మీ రాణి (Retd. SBI Manager) గారి పిలుపుతో వేకువ 4.16 కే 2K.M. దూరంలోని శివరాంపురం రోడ్డుకు వచ్చిన SBI ఉన్నతోద్యోగినులు 10 మందనుకొంటా! 50 వ వ్యక్తి మాత్రం ఆ వీధికి చెందిన నాగభూషణం గారు!
ప్రాత, సరిక్రొత్త కార్యకర్తలు ఎవరే పనిలో కుదురుకొన్నారో- ఏ మేరకు వీధి శుభ్ర - సౌందర్యాల్ని సాధించారో- పరస్పరం ఎలా స్ఫూర్తి నింపుకొన్నారో- పావు కిలోమీటరు దాక ఇందరి శ్రమ పని ఫలితాన్నిచ్చిందో- ముఖ్యంగా 10 మంది అతిథి శ్రమదాతల పనిపాటులేమిటో కొంత పరిశీలించాను.
ఈ మురికి పనుల్లో చేరి “ఒక్కరోజైనా - ఒక్కసారైనా స్వచ్చ కార్యకర్తలుగా” మారేందుకా వందల కిలోమీటర్లు ప్రయాణించి, ఇందరు వచ్చింది ? అని ఆశ్చర్యపడ్డాను!
చూస్తుండగానే 2 గంటల శ్రమ అక్కడి కాలుష్యాల మీద వీర విహారం చేసింది. పాతిక- ముప్పై గజాల రోడ్డు ప్రక్క పల్లాల్లో బరంతు పూర్తయింది. 4 పెద్ద గోనె సంచుల నిండా ప్లాస్టిక్ భూతాలు కిక్కురు మనకుండా ఒదిగిపోయాయి! అప్పటికే కొంత శుభ్రంగానే ఉన్న రోడ్డు మరింత శుభ్ర - సుందరంగా మారింది! నరికేసిన చెట్ల కొమ్మల్తో, ఆకులలమల్తో ట్రాక్టరు నిండనే నిండింది!
ఇంత వేగంగా స్వచ్ఛ- శుభ్ర కర్మకాండలు జరిగితే- ఉభయ శివరామపురాల దాకా పెదకళ్ళేపల్లి వీధి మరొక వారం రోజులకే సరికొత్త అందాలనందుకోగలదనిపించింది.
ఒకటి-రెండూ కాదు- 3 విజిల్స్ మ్రోగితే గాని. 6.20 కి గాని ఈ శ్రమదానోత్సవం ముగియలేదు! అప్పుడు కాఫీలు త్రాగి మొదలైన కృషి సమీక్షాసభలో :
Dr. టి. పద్మావతి గారి నినాదాలూ, DRK గారి సమయోచిత ప్రశాంసాత్మక-విచక్షణాత్మక- వివరణాత్మక సమీక్షా వచనాలూ, నిన్నటి స్వచ్యాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారి చల్లపల్లి పర్యటనా విశేషాలూ, నందేటి వారి నాలుగైదు పాటల తుంపులూ, పనిలో పనిగా కోడూరు వెంకటేశ్వర రావు గారి 520/- విరాళమూ,
అన్నిటి కన్న శర్వాణి, ముక్తేశ్వర రావు గార్ల ఆనంద వ్యక్తీకరణలూ... ఇలా ఎన్నెన్ని విశేషాలో!
రేపటి మన శ్రమదానం కూడ సాగర్ ఆక్వా మిల్లు నుండే మొదలట!
దేనికింత తపనంటే
" ఎందుకింత శ్రమ అంటే, దేనికింత తపనంటే –
మరీ ఇంత త్యాగ బుద్ధి మనకవసరమా" అంటే-
ఒక గాంధీ- మరొక చండ్ర – ఒక పుచ్చల పల్లి సుంద
రయ్యల జీవిత చరిత్రల నవలోకించాలని చెప్పెద!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
09.02.2025