3380* వ రోజు ....           10-Feb-2025

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని వాడబోం! వాడబోం!

నార చేతి సంచుల్నే - వాడతాం! వాడతాం!!

సోమవారం (10-2-25) నాటి శ్రమవీరులు 24 మంది – 3380*

         శ్రమ జాలువారింది శివరామపురం రోడ్డులోని మేకలడొంక ప్రాంతంలో! ఈ కొద్దిమంది కష్టంతోనే 4.17 - 6.16 నడుమ సదరు వీధి 100 గజాలకు మించి బాగుపడకపోను – తమ పరిధిలోనిదిగావున పెదప్రోలు పంచాయతి వారు అక్కడి నుండి శివరామపురందాక ఇటీవల  కొంత శుభ్రపరచడం వల్ల ఈ మాత్రం పని జరిగింది!

         ఐతే - పడమటి డ్రైన్ లో వ్యర్ధాలూ, పెరిగిన పనికిమాలిన మొక్కలూ, సీసాలూ, కప్పులూ, ప్లాస్టిక్ సంచులూ కార్యకర్తలకు చేతి నిండా పని కల్పించాయి.

         వీళ్లే బాధ్యతగా నాటి పెంచిన చెట్ల ఆకులూ, తాటి, ఈత చెట్ల తాలూకు వ్యర్ధాలూ ఉండనే ఉంటాయి - ఐదారుగురు చీపుళ్ల కార్యకర్తలు శుభ్రం చేసుకొనడానికి!

         గునపాలు, పారలూ ఝళిపించడానికి రోడ్ల భద్రతా దళం రడీగానే ఉన్నా పని అరకొరగానే జరిగింది. కారణం ఆ దరిదాపుల్లో మట్టి దొరక్కపోవడమే! అందుకని ఈ నిపుణులు న్యూట్రి ఫీడ్ రోడ్డు మలుపులో డ్రైను శుభ్రతకు దిగారు.

         పంచాయతి వారి శుభ్రచర్యల వల్ల ఈ ఉదయం ప్రోగైన వ్యర్ధాలు ట్రాక్టరు సగానికే వచ్చాయి. రెండు కొమ్మల గుట్టలు షెడ్డరుకు వదిలేశారు.

         వంతెన - పంటకాల్వల మధ్య భాగమూ, అక్కడి నుండి క్రొత్త శివరామపురం వరకూ వారం రోజుల్లోనే పనులు పూర్తి కావచ్చు.

         కాఫీల వేళ ఒకరు ములగకాయలూ - కరివేపాకూ, మరొకరు టొమాటోలూ పరిమితంగా పంచారు.

నేటి ముగింపు సభలో:

         నినాదాలు వినిపించినది తూములూరి లక్ష్మణుడు, పనుల్ని వివరించినది DRK వైద్యుడు, దూరప్రాంతపు SBI ఉద్యోగ బృందం ఈరోజు కూడ ఇంకా చల్లపల్లి పర్యటన కొనసాగిస్తున్నదట!

         జిల్లా కలెక్టరు గారి సతీమణి, కుమార్తె నిన్న స్వచ్ఛ - సుందర చల్లపల్లిలో విశేషాలు తిలకించారట!

          కీర్తి శేషులు మారుపూడి రఘు బాబు గారి జ్ఞాపకార్థం గాంధీ మాస్టారు, చంద్ర నాంచారమ్మ, సురేంద్ర బాబు, రాజేశ్వరి గారలు స్వచ్చోద్యమం కోసం 5,000/- రూపాయల విరాళం అందజేసినందుకు మన ధన్యవాదాలు.

         రేపటి శ్రమదానం కూడ P.K.పల్లి రోడ్డుకు చెందిన మేకలడొంక నుండే!

         సాగిల పడి మ్రొక్కాలా!

వీధులూడ్చు పని చాలక రోడ్ల మరామత్తులా!

అందుకు ఉన్నతోద్యోగులు, ఆడు వారి పాటులా!

బరువు డిప్ప మోయుటలో పరస్పరం పోటీలా!

స్వచ్ఛ కార్యకర్త కృషికి సాగిల పడి మ్రొక్కాలా!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   10.02.2025