సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని – వాడబోం! వాడబోం!
నార చేతి సంచుల్నే - వాడతాం! వాడతాం!!
ఆదర్శ సామాజిక బాధ్యతలో 3381* వ వేకువ!
మంగళప్రదమైన ఈ మంగళవారం (11-2-25) బ్రహ్మకాలంలో శివరామపురం సమీపస్ధ మేకలడొంక ప్రాంతాన 35 మంది కృషి రహదారి స్వచ్చ – శుభ్రప్రదంగా మారింది. 4:18 కి పనిలో దిగబోతున్న పదముగ్గురూ మంచులో కప్పడిపోయి, ముఖాలెవరివో కూడ తెలియడం లేదు!
వంతెన మాటున పనిచేసే వాళ్ళూ, కాసానగర్ వైపు డొంక ప్రక్కన పిచ్చి చెట్లు నరికే వాళ్లూ, వీధి మార్జిన్ల అవకతవకల్ని సరిజేస్తున్న వాళ్ళూ, క్రొత్తగా వచ్చిన రోడ్డు అంచుల్ని మట్టితో మెరకవేసే వాళ్లూ నాకు అస్పష్టంగానే కనిపించారు.
రోజుటిలా కొమ్మల్నీ, మండల్నీ పూర్తిగా ట్రాక్టరులో నింపక, కొన్నిటిని తూర్పు పంట పొలానికి కంచెగా అమర్చుతున్నారు 4 గురు!
నాతో సహా ముగ్గురికి 2 రకాల సీసాల్ని సేకరించడమూ, ప్లాస్టిక్ గాజు వస్తువుల్ని విడిగొట్టి వేర్వేరు గోతాల్లో సర్దడమే సరిపోయింది. అవి 1+3 సంచులుగా లెక్క తేలింది! వాటిలో ఒక పెద్ద గోనె సంచైతే - గాజు సీసాల్తో పూర్ణ గర్భిణే!
పంటకాల్వ ఉత్తరపు గట్టు ఈ పూట ఆరేడుగురికి ముమ్మరంగా పని కల్పించింది! రోడ్డు వార మొలిచి, పెరుగుతున్న తాటి చెట్లనూ, ఖాళీ లేకుండ క్రమ్ముకొంటున్న పిచ్చి తీగల్నీ – గడ్డినీ వాళ్లెంత ఓర్పుగా - నేర్పుగా తొలగిస్తే ఆ జాగా ఇప్పుడింత శుభ్ర - సుందరంగా మారింది?
ఈ మంచు సమయపు ఒక అపశృతి - శివరామపురీయుడైన ప్రేమానందుని చేతి వ్రేలు గాయపడి నెత్తు రోడడం! దాని తర్వాత కూడ ముప్పావు గంట అతడు పని ఆపలేదు. అసలా శ్రమ వాతావరణమే అలాంటిది – చేస్తున్న పని ఆపబుద్ధి కానిది!
నేటి నినాదకర్త డేవిడ్ గోల్కొండ, అంత మంచు వేకువలో వెంకటాపురం నుండి వచ్చి మరీ శ్రమించిన విద్యార్ధులు – సంతోష్, అఖిల్!
రేపటితో బరువైన పనులు ఐపోతాయని DRK గారి అంచనా!
రేపు కూడ మన తొలిగమ్యం - మేకలడొంక వంతెనే!
కలం ముందుకు కదలకున్నది!
దశాబ్దంగా కార్యకర్తల తపోదీక్షలు తలచుకొంటే
వీర విక్రమ శ్రమోల్లాసం వివరములు గమనించుచుంటే
సమగ్రంగా స్వచ్ఛ సుందర సచ్ఛరిత్రను వ్రాయబోతే
తగిన పదములె దొరుకకున్నవి! కలం ముందుకు కదలకున్నది!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
11.02.2025